Begin typing your search above and press return to search.

ట్రంప్ కూతురు హైద‌రాబాద్ బ‌స ఆ స్టార్ హోట‌ల్లోన‌ట‌

By:  Tupaki Desk   |   13 Oct 2017 7:03 PM GMT
ట్రంప్ కూతురు హైద‌రాబాద్ బ‌స ఆ స్టార్ హోట‌ల్లోన‌ట‌
X
అగ్ర‌రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌య‌, వైట్‌హౌస్ కార్య‌ద‌ర్శి ఇవాంక ట్రంప్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు ఇంకా నెల‌రోజుల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ...ఆమె గుర్తించిన వార్త‌లు ఇప్ప‌టికే చ‌క్క‌ర్లు కొట్టేయ‌డం మొద‌లుపెడుతున్నాయి. ప్రపంచ పెట్టుబడిదారుల స‌మాఖ్య స‌మావేశం సంద‌ర్భంగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌య‌, ఆయ‌న స‌ల‌హాదారు ఇవాంక ట్రంప్ మొట్ట‌మొద‌టి సారి భార‌తదేశానికి రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌ద‌స్సు జ‌ర‌గనున్న హైద‌రాబాద్‌కు ఇవాంక ట్రంప్ రావ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌ను సంత‌రించుకుంది. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ఆహ్వానం కార‌ణంగా ఇవాంక ట్రంప్ ఇండియాకు వ‌చ్చేందుకు, ఈ స‌ద‌స్సులో భాగ‌స్వామ్యం పంచుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ఈ ఏడాది నవంబర్ 28 నుంచి 30 వరకూ హైదరాబాద్‌లో అమెరికా దేశాల ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ శిఖరాగ్ర పారిశ్రామికవేత్తల సదస్సు (గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌)-2017కు అమెరికా బృందానికి ఇవాంకా ట్రంప్ సార‌థ్యం వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశాన్ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో క‌లిసి ఇవాంక ప్రారంభించ‌నున్నారు. రెండు రోజుల పాటు జ‌రిగే ఈ స‌ద‌స్సులో భాగంగా ఇవాంక హైద‌రాబాద్‌లోనే ఉండ‌నున్నారు. అయితే ఆమె ఎక్క‌డ బ‌స చేయ‌నున్నార‌నే విష‌యంలో తాజాగా క్లారిటీ వ‌చ్చింది. హైద‌రాబాద్‌లోని స్టార్ హోట‌ల్ల‌లో ఒక‌టిగా పేరున్న వెస్టిన్ హోట‌ల్‌లో ఇవాంక బ‌స చేయ‌నున్నార‌ని తెలంగాణ ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారి ఒక‌రు వెల్ల‌డించారు. మొద‌ట ఇవాంక తాజ్ ఫ‌లక్‌నుమాలో బ‌స చేస్తార‌ని భావించిన‌ప్ప‌టికీ వేదిక నుంచి ఉన్న‌ దూరం, సెక్యురిటీ కార‌ణాల వ‌ల్ల ఆ ప్ర‌తిపాద‌న వెన‌క్కు తీసుకున్నారు.

జీఈఎస్ స‌ద‌స్సు జ‌ర‌గ‌నున్న హైద‌రాబాద్ ఇంట‌ర్నేష‌నల్ క‌న్వేన్ష‌న్‌కు 3.5 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న వెస్టిన్‌లో ఇవాంక బ‌స చేయ‌నున్నారు. స‌ద‌స్సు ప్రారంభంతో పాటుగా త‌దుప‌రి జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో కూడా ఇవాంక పాల్గొన‌నున్నారు. `మ‌హిళా పారిశ్రామిక‌వేత్తల‌కు ప్ర‌థ‌మ ప్రాధాన్యం, అన్నివ‌ర్గాల అభివృద్ధి` అనే నినాదంతో ఈ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. దాదాపుగా 1200 మందికి పైగా పారిశ్రామిక‌వేత్త‌లు, ఇన్వెస్ట‌ర్లు, ఔత్సాహికులు ఈ స‌ద‌స్సుకు హాజ‌రుకానున్నారు. ఇంత ప్ర‌త్యేకంగా జ‌రిగే స‌ద‌స్సుకు తెలంగాణ ప్ర‌భుత్వం రూ.8 కోట్లు విడుద‌ల చేసింది. ఇది కాకుండా స‌ద‌స్సు జ‌రిగే హెచ్ఐసీసీ ప‌రిస‌ర ప్రాంతాల్లో సుంద‌రీక‌ర‌ణ‌ను జీహెచ్ఎంసీ ప్ర‌త్యేకంగా ప‌ర్య‌వేక్షించ‌నుంది.దీంతో పాటుగా స‌ద‌స్సుకు హాజ‌రైన వారికి తాజ్ ఫ‌ల‌క్‌నుమాలోఅద్భుత‌మైన విందు ఇవ్వ‌నుంది.