Begin typing your search above and press return to search.

కూతురు ఫీలైంది.. ట్రంప్ బాంబులేశారు

By:  Tupaki Desk   |   12 April 2017 5:24 AM GMT
కూతురు ఫీలైంది.. ట్రంప్ బాంబులేశారు
X
పిల్ల‌ల కోసం త‌ల్లిదండ్రులు చాలానే చేయ‌టం మామూలే. కానీ.. అంత‌ర్జాతీయంగా ప్ర‌భావితం చూపే అంశాల మీద తొంద‌ర‌ప‌డ‌రు. కానీ.. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అందుకు భిన్న‌మ‌ని తేలిపోయింది. తాను తీసుకునే నిర్ణ‌యం.. త‌నకు మిత్రులుగా ఉన్న వారికి ఆగ్ర‌హం తెప్పిస్తుంద‌న్న విష‌యం తెలిసినా అస్స‌లు ప‌ట్టించుకోక‌పోవట‌మే కాదు.. కూతురు ఫీలింగ్స్‌కు అంత ప్రాధాన్య‌త ఇవ్వ‌ట‌మా అంటూ ఇప్పుడు నోరెళ్ల‌పెడుతున్నారు.

సిరియాలో గ్యాస్ దాడితో వంద మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవ‌టం.. బొమ్మ‌ల్లా ఉన్న పిల్ల‌లు.. విగ‌త‌జీవులుగా మారిన వైనం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లంద‌రిని అయ్యో అనేలా చేసింది. గ‌ల‌గ‌లా న‌వ్వుతూ ఆడుకోవాల్సిన వ‌య‌సులో.. సిరియా ప్ర‌భుత్వం తీసుకున్న దుర్మార్గ చ‌ర్య‌తో వంద‌లాది త‌ల్లిదండ్రుల‌కు క‌డుపుకోత మిగిల్చిన ఈ ఉదంతంపై ప్ర‌పంచ వ్యాప్తంగా చాలామంది చాలా ర‌కాలుగా ఫీల్ అయినా.. అమెరికా అధ్య‌క్షుడి కుమార్తె ఫీల్ అయిన ఫీల్ కు.. ట్రంప్ ఇచ్చిన ప్రాధాన్య‌త ఫ‌లిత‌మే.. అమెరికా దాడిగా చెప్పొచ్చు.

ముక్క‌ప‌చ్చ‌లార‌ని పిల్ల‌ల ప్రాణాల్ని తీసిన సిరియా ప్ర‌భుత్వం తీరుతో తీవ్ర ఆగ్ర‌హానికి గురైన ట్రంప్ కుమార్తె ఇవాంకా త‌న ఆవేద‌న‌ను త‌న తండ్రితో పంచుకుంద‌ని చెబుతున్నారు. ఇదే.. సిరియా వైమానిక స్థావ‌రంపై దాడి చేయాల‌ని ట్రంప్ నిర్ణ‌యించుకోవ‌టానికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని క‌న్ఫ‌ర్మ్ చేస్తూ తాజాగా ట్రంప్ కుమారుడు ఎరిక్ మాట్లాడుతూ.. సిరియా వైమానిక స్థావ‌రం మీద దాడి చేయాల‌ని ట్రంప్ నిర్ణ‌యం తీసుకోవ‌టంలో ఇవాంకా ఆవేద‌న కూడా కార‌ణ‌మ‌ని చెప్పాడు.

గ్యాస్ దాడితో త‌న గుండె ప‌గిలిన‌ట్లుగా ఇవాంకా చెప్పిన‌ట్లుగా ప్ర‌ముఖ మీడియా సంస్థ టెలిగ్రాఫ్ పేర్కొన‌టం.. తాజా వాద‌న‌కు బ‌లం చేకూరేలా చేస్తుంద‌న్న‌మాట వినిపిస్తోంది. ఏమైనా.. స‌మకాలీన అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల్లో అత్యంత కీల‌క‌మైన స్థానంలో ఉన్న తండ్రిని ప్ర‌భావితం చేసిన కుమార్తెగా ఇవాంకా నిలిచిపోతుండ‌న‌టంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/