Begin typing your search above and press return to search.

ఇవాంకా మెచ్చిన మోడీ చాయ్‌..హైద‌రాబాదీ బిర్యానీ

By:  Tupaki Desk   |   28 Nov 2017 12:44 PM GMT
ఇవాంకా మెచ్చిన మోడీ చాయ్‌..హైద‌రాబాదీ బిర్యానీ
X
హైదరాబాద్ లాంటి పురాతన నగరం.. ఇప్పుడు టెక్నాలజీ హబ్‌ గా ఎదగడం చాలా గొప్ప విషయం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు - సలహాదారు ఇవాంకా ట్రంప్‌ అన్నారు. గ్లోబ‌ల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్ సమ్మిట్ (జీఈఎస్)లో భాగంగా మాట్లాడిన ఇవాంకా.. హైదరాబాద్‌ పై ప్రశంసలు కురిపించారు. భాగ్యనగరాన్ని ఇన్నోవేషన్ హబ్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇండియా అని, ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీహబ్‌ ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఇది ఏషియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ హబ్ అని ఇవాంకా అన్నారు. ఇప్పుడు మీ టెక్నాలజీ సెంటర్లు వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ బిర్యానీని కూడా మించిపోయే స్థాయికి చేరుతాయని ఆమె కొనియాడారు. హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అని అన్నారు. హైదరాబాద్ ఇన్నోవేషన్ హబ్‌ గా ఎదుగుతోందని ఇవాంకా అన్నారు. హైదరాబాద్ నగరంగా ఎదుగుతోందన్నారు. త‌న‌ పిల్లలను హైదరాబాదు లోని పాఠశాలలకు పంపించాలని అనుకుంటున్నానని చెప్పారు.

మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల ఇక్కడే చదువుకున్నారని ఈ సందర్భంగా ఇవాంకా గుర్తు చేశారు. ఇండియా స్పేస్‌ క్రాఫ్ట్‌ లు చంద్రున్ని - మార్స్‌ ను తాకాయని ఈ సందర్భంగా ఇవాంకా చెప్పారు. ఇండియా తమకు స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు. ముత్యాల నగరం తొలిసారి ఆతిథ్యమిచ్చిన గ్లోబల్ ఎంటర్‌ ప్రెన్యూర్ సమ్మిట్‌ కు వచ్చిన 150 దేశాలకుపైగా ప్రతినిధులకు స్వాగతం పలికారు. తొలిసారి ఇంత పెద్ద గ్లోబల్ ఈవెంట్‌ లో 1500 మంది మహిళా వ్యాపారవేత్తలు పాల్గొనడం చాలా గర్వంగా ఉందని చెప్పారు. ఇండియా - అమెరికా మధ్య బంధం బలోపేతమవుతున్నదని ఇవాంకా వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇండియాను నిజమైన స్నేహితుడిగా చెబుతారని ఆమె చెప్పారు. మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యంగా ఈ ఏడాది సదస్సు జరుగుతున్నదని, ఈ సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలకు శుభాకాంక్షలు అని ఇవాంకా అన్నారు. ప్రధాని మోడీపై కూడా ప్రశంసల వర్షం కురిపించారు ఇవాంకా.

`ఇండియాలో మీరు అద్భుతాలు సాధిస్తున్నారు. మీ చిన్నతనంలో టీలు అమ్మి - ఇప్పుడు దేశానికి ప్రధాని కావడం చూస్తే ఎంత పెద్ద మార్పయినా సాధ్యమని నిరూపితమవుతోంది. ప్రజాస్వామ్య విజయానికి భారత్ ఆశాదీపంగా ఎదుగుతోంది` అని ఇవాంకా అన్నారు. మహిళా సాధికారత లేకుండా మానవాభివృద్ధి పరిపూర్ణం కాదని నమ్మిన మోడీకి కృతజ్ఞతలు చెప్పారు ఇవాంకా. చాలా దేశాల్లో నైతిక నియంత్రణలు మహిళల ఉన్నతికి అడ్డుగా ఉన్నాయని ఇవాంకా వాపోయారు. మహిళా పారిశ్రామికవేత్తలకు మార్గదర్శనం చాలా అవసరమని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాల్లో మహిళలకు మార్గదర్శనానికి ఇంకా కృషి అవసరమని చెప్పారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు మూలధనం, వనరులు, సమాన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు.

కొత్త ఆవిష్కరణలతో వస్తున్న ఔత్సాహికులు విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారని.. ఔత్సాహిక వ్యాపారవేత్తలు కాంక్ష వదలకుండా నిరంతరం పని చేయాలని ఇవాంకా తెలిపారు. పారిశ్రామిక వేత్తలు సరికొత్త విప్లవం సృష్టిస్తున్నారని..వీరు రాత్రింబవళ్లు పనిచేసి రోబోలు - యాప్‌ లు తయారు చేస్తున్నారని ఇవాంకా తెలిపారు. సదస్సులో 52శాతం మహిళలు పాల్గొనడం త‌నకు గర్వకారణంగా ఉందని అన్నారు. పురుషాధిక్య సమాజంలో రాణించాలంటే మహిళలు మరింత కష్టపడాలని తాను తెలుసుకున్నానని చెప్పారు. గత పదేళ్లలో మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య 10శాతం పెరిగిందని ఇవాంకా చెప్పారు. ఇప్పుడు అమెరికాలో కోటీ 10లక్షలమంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారని అన్నారు.

కాగా, అంత‌కుమందు గ్లోబల్ ఎంట‌ర్‌ ప్రెన్యూర్‌ షిప్‌ సమ్మిట్ (జీఈఎస్)లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు - కుమార్తె ఇవాంకా ట్రంప్‌ తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇవాళ మెట్రో రైలు ప్రారంభోత్సవం తర్వాత నేరుగా హెచ్‌ ఐసీసీకి వెళ్లిన మోడీ.. మొదట ఇవాంకాతో సమావేశమయ్యారు. ఇవాంకా - మోదీతోపాటు రెండు దేశాల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇవాంకా అంతకుముందు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తోనూ భేటీ అయ్యారు.