Begin typing your search above and press return to search.

సంతోష వాతారణంతో.. గొప్ప ఫలితాలు

By:  Tupaki Desk   |   2 Oct 2015 7:20 AM GMT
సంతోష వాతారణంతో.. గొప్ప ఫలితాలు
X
'ఉద్యోగులకు పని స్థలాల్లో ఆనందమయమైన వాతావరణాన్ని కల్పించడం అనేది.. సంస్థ మెరుగైన ఫలితాలు సాధించడానికి, అందులోని ఉద్యోగులు ఎక్కువ పనితీరు కనపరచడానికి దారితీస్తుందని' గిద్దలూరుకు చెందిన ఎన్నారై పారిశ్రామిక వేత్త ఐ.వి.రెడ్డి అన్నారు. న్యూయార్క్‌ లో బుధవారం నాడు 'డెలివరింగ్‌ హేపీనెస్‌' అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్న ఐవిరెడ్డి ఆ అనుభవాలను పంచుకున్నారు.

'డెలివరింగ్‌ హేపీనెస్‌' సంస్థ సీఈవో జెన్‌ లిమ్‌ ముఖ్యఅతిథిగా హాజరై.. సంస్థల్లో ఏర్పాటు చేయాల్సిన పనివాతావరణం గురించి, ప్రత్యేకించి ఉద్యోగుల విషయంలో తీసుకోవాల్సిన శ్రద్ధ గురించి పారిశ్రామికవేత్తలకు సూచనలు చేస్తూ ఈ సదస్సును నిర్వహించారు. సంస్థ ఉద్యోగుల వ్యక్తిగత ఇబ్బందులు, సౌకర్యాల మీద కూడా సంస్థల యాజమాన్యాలు దృష్టి పెడుతూ ఉన్నట్లయితే.. వాటి పట్ల స్పందిస్తూ ఉన్నట్లయితే ఉద్యోగుల నుంచి మెరుగైన పనిఫలితాన్ని రాబట్టుకోవడం సాధ్యం అవుతుందంటూ.. సదస్సుకు హాజరైన పారిశ్రామిక వేత్త ఐవి రెడ్డి చెప్పారు. పనివాతావరణాన్ని ఉద్యోగులకు సానుకూలంగా ఉంచడం, ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత గురించి ఎలాంటి చింత - అనుమానం ఉండని వాతావరణాన్ని కల్పించడం, సందర్భాలను బట్టి, పనిలో మెరుగ్గా వ్యవహరించినప్పుడు వివిధ రకాల కానుకలను వారికి ఇవ్వడం - ఇన్సెంటివ్‌ లు - బోనస్‌ లు ఇస్తుండడం లాంటి చర్యలు సంస్థల పురోభివృద్ధికి బాటలు వేస్తాయని ఐవిరెడ్డి చెప్పారు.

ప్రధానంగా ఉత్పాదక సేవా రంగాల్లో ఉండే సంస్థలన్నీ కూడా.. ఉద్యోగులకు సంస్థతో ఒక మానసిక పరమైన అనుబంధం ఏర్పడేలా కూడా చేయాలని, అలాంటి వాతావరణం కల్పించడం వలన.. తొలుత ఉద్యోగులకు కోసం కాస్త ఎక్కువ ఖర్చు పెడుతున్నట్లుగా కనిపించినప్పటికీ.. అంతిమంగా సంస్థకు ఎక్కువ లాభం చేకూరుతుందని ఈ సదస్సు తెలియజేస్తుందని ఐవిరెడ్డి అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న సమయంలో.. కొత్త సంస్థలు అనేకం ఆవిర్భవించబోతున్న సమయంలో.. సంస్థల నిర్వహణలో ఇలాంటి శాస్త్రీయమైన విధానాలను అవలంబించడం అనేది మేలు చేస్తుందని ఆయన చెప్పారు.