Begin typing your search above and press return to search.

చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: ఐవీ రెడ్డి

By:  Tupaki Desk   |   6 March 2017 11:36 AM GMT
చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: ఐవీ రెడ్డి
X
తనకు కోర్టు నోటీసులు కొత్తేమీ కాదని అంటున్న చంద్రబాబు గారు.. ఇదే సమయంలో తనకు స్టే లు తెచ్చుకోవడం కూడా కొత్త కాదు అనే విషయాన్ని ఎందుకు చెప్పలేదు? తను 26 కేసులను ఎదుర్కొన్నాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు అందులో 18 కేసుల్లో విచారణపై ‘స్టే’ తెచ్చుకుని బతికేస్తున్నాను.. అని ఎందుకు చెప్పలేదు. పాపాల భైరవుడు అయిన చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా కేసుల ఉచ్చు నుంచి బయటపడాలని చూసినా.. అవి ఏదో విధంగా తగులుకుంటూనే ఉన్నాయి. కింది కోర్టులో స్టే తెచ్చుకున్నా.. పై కోర్టులో మాత్రం ఆయన పప్పులు ఉడకడం లేదు. ఒక చోట మేనేజ్ చేసినా.. మరో చోట బాబు దొరుకుతూనే ఉన్నారు.

ఈ పరంపరంలో ‘ఓటుకు నోటు’ కేసులో బాబుకు మళ్లీ నోటీసులు జారీ అయ్యాయి. విశేషం ఏమిటంటే.. ఒకవైపు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు బలం లేకుండా కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలిపి, చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు పంచుతున్న వేళ.. ఏపీలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కొనుక్కొంటున్న వేళ.. తెలంగాణలో ఎమ్మెల్యేను కొన్న వ్యవహారానికి సంబంధించిన కేసులో నోటీసులు జారీ అయ్యాయి.

తెలంగాణలో ఎమ్మెల్యేను కొనబోయిన వ్యవహారంలో తను ఇరుక్కున్నా బాబుకు బుద్ధి రాలేదు. మళ్లీ ఏపీలో అదే పని చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పాత పాపానికి సంబంధించి నోటీసులు జారీ అయ్యాయి. ఓటుకు నోటు కేసులో బాబు పాత్రపై విచారణ జరగాల్సిన అవసరాన్ని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది. అయితే.. బాబు మాత్రం తనకు నోటీసులు కొత్తేమీ కాదని అంటున్నారు. నిజమే.. ఆయనకు నోటీసులు కొత్తేమీ కాదు. తనకు నోటీసులు కొత్తేమీ కాదంటున్న బాబు.. తప్పించుకోవడం తనకు కష్టం ఏమీ కాదనే సంకేతాలనే ఇస్తున్నాడు.

ఇప్పటికే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర సమితితో లాలూచీ పడ్డాడు. తెలంగాణలో తన పార్టీ ని తాకట్టుగా పెట్టి, హైదరాబాద్ ను ఖాళీ చేసి.. విజయవాడకు చేరుకుని.. తెలంగాణలో తెరాసకు అడ్డు ఉండమనే హామీతో కొంత రిలీఫ్ పొందాడు. ఇక ఈ కేసులో తన ప్రయోజనం కోసం.. చంద్రబాబు నాయుడు కేంద్రం వద్ద ఏపీకి ప్రత్యేక హోదాను కూడా తాకట్టుగా పెట్టాడు. ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా అడిగితే.. కేంద్రం ఎక్కడ ఈ కేసును గట్టిగా కదిలిస్తుందో.. అనే భయం చంద్రబాబుది.

ఈ విధంగా తనను తాను రక్షించుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాలనే పణంగా పెట్టి, పైగా తను నిప్పుని అని అను నిత్యం చెప్పుకు తిరుగుతున్నాడాయన. మరి నిజంగానే ‘నిప్పు’ అయితే.. సుప్రీం కోర్టు తాజా ఆదేశాల మీద స్టే తెచ్చుకోకూడదు. 18 కేసుల్లో ‘స్టే’ తెచ్చుకుని బతికేస్తున్న ఆయన .. ఈ కేసులో 19 వ స్టే తెచ్చుకోకుండా.. దమ్మూధైర్యం ఉంటే విచారణను ఎదుర్కొనాలి. ఈ కేసులో ఏమీ లేదని అని అంటున్న ఆయన.. విచారణను ఎదుర్కొని ‘నిప్పు‘ అని నిరూపించుకోవాలి.

అంతకన్నా మునుపు.. అప్రజాస్వామికంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసును ఎదుర్కొంటున్న బాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. అయితే బాబుకు అంత సీన్ లేదనేది అందరికీ తెలిసిందే. ఆయన ఒక జిత్తుల మారి నక్క.. కన్నింగ్ ఫాక్స్. చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి.. అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహారం. వేప చెట్టు నుంచి తేనె చుక్కను ఆశించడం, చంద్రబాబు నుంచి నీతీనిజాయితీలను ఆశించడం కూడా ఒకటే. రెండూ జరిగే పనులు కాదు. ఇప్పటికే స్టే కోసం ప్రయత్నాలు మొదలుపెట్టి, మళ్లీ తను నిప్పుని అని నీతులు చెప్పుకోవడానికి రెడీ అవుతున్నట్టు తెలుగుదేశాధినేత. అయితే బాబు ఆటలు అచిరకాలమే. ప్రతి పాపమూ ఎప్పుడో ఒక సారి పండి తీరుతుంది.

-ఐవీ రెడ్డి,
గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త, వైఎస్సార్ కాంగ్రెస్,
ప్రకాశం జిల్లా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/