Begin typing your search above and press return to search.

మీరే శాశ్వతం కాదు, అతి పనికిరాదు చంద్రబాబు: ఐవీ రెడ్డి

By:  Tupaki Desk   |   3 March 2017 12:56 PM GMT
మీరే శాశ్వతం కాదు, అతి పనికిరాదు చంద్రబాబు: ఐవీ రెడ్డి
X
ఇంతకీ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది? నడుస్తున్నది పాలనా లేక చంద్రబాబు ఇంటి పేరంటాలా? తామేం చేస్తున్నామో అనే విషయంపై అవగాహన ఉండి ఇలా వ్యవహరిస్తున్నారా? లేక తోలుమందం ఎక్కువై, కండకావరంతో.. మతి పోయి వ్యవహరిస్తున్నారా? మతి ఉంటే ఇలాంటి పనులు చేయరేవరు. మానసిక వ్యాధితో బాధపడుతున్న ముఖ్యమంత్రి పాలనలో ఇలాంటివే జరుగుతాయి కదా.. ఈ సందేహాలే కలుగుతుంది ఎవరికైనా.

వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లీ ఆరంభం అనే తతంగాన్ని గమనిస్తే... ఆరంభం అయినది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీనా? లేక.. తెలుగుదేశం పార్టీ కొత్త కార్యాలయమా? అనే సందేహం కలుగుతుతుంది. ఒకవేళ అది తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయ్యుంటే.. దాని ఓపెనింగ్ ను తమకు ఇష్టం వచ్చిన వారిని పిలుచుకుని, ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు తెలుగుదేశం అధినేత. అయితే.. అది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, దాన్ని కట్టింది ప్రజల సొమ్ముతో, అది ప్రజల కోసం నిర్మించబడినది.. కాబట్టి దాని ప్రారంభోత్సవం విషయంలో కొన్ని ప్రొటొకాల్స్ పాటించాల్సి ఉంది. బాబు ఇష్టం ఉన్నా, లేకపోయినా.. ఆ కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీని కూడా కలుపుకుపోవాల్సిన అవసరం ఉంది.

బాబుకు జగన్ తో వ్యక్తిగతం గా ఎన్ని విబేధాలు ఉండవచ్చు గాక, కానీ ప్రతిపక్ష నేతకు ఆహ్వానం అందకపోవడం ఏమిటి? ఏపీ అసెంబ్లీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తిగా తమ ప్రైవేట్ కార్యక్రమంగా మార్చేసుకున్నారేంటి? తమ వారిని పిలుచుకుని.. తమ అనుకూల మీడియాలో హైప్ చేయించుకుని.. మమ.. అనిపించేశారు.

అదేమంటే.. జగన్ కు సమాచారం అందించాం.. ఆయన అందుబాటులోకి రాలేదు.. ఓఎస్డీకి చెప్పాం.. అంటూ డ్యామేజ్ కంట్రోల్ యత్నాలు చేస్తున్నారు తెలుగుదేశం నేతలు. అయితే గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ , ప్రభుత్వ పెద్దల తీరును గమనించాకా... వీరు జగన్ ను ఆహ్వానించి ఉంటారని ఎవ్వరూ నమ్మడం లేదు. అసెంబ్లీ ఆరంభోత్సవానికి కార్డులు కొట్టించి.. డైరెక్టుగా అందించి ఉంటే అదో మర్యాద. అలా కాకుండా.. ఫోన్లు చేశాం - పలకలేదు.. అంటే ఇదంతా తప్పించుకునే ఎత్తుగడ - డ్యామేజ్ కంట్రోలే తప్ప మరోటి కాదని చెప్పాల్సి ఉంటుంది.

తమకు అవసరం అయిన వారి కి ఎదురేగి.. మెడలో శాలువలు వేస్తూ - లడ్డూలు ఇచ్చే మర్యాదలు - న్యాయమూర్తులకు ప్రత్యేక విందులు ఏర్పాటు చేసే మన్ననలు చంద్రబాబుకు తెలుసు కానీ.. అసెంబ్లీ భవన ఆరంభానికి అందరినీ ఆహ్వానించాలనే ఇంగితం మాత్రం లేకుండా పోయింది.

అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డికి గానీ, మండలిలో ప్రతిపక్ష నేత రామచంద్రయ్య కు గానీ అసెంబ్లీ ప్రారంభోత్సవానికి ఆహ్వానం దక్కలేదు. రామచంద్రయ్యకు ఎందుకు ఆహ్వానం అందించలేదనే విషయం గురించి కూడా మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఏదో కహాని చెప్పాడు. ఇలా చెప్పుకొంటూ పోతే.. ఎన్ని అయినా చెప్పొచ్చు. కానీ.. కనీస మర్యాద పాటించడం ధర్మం. దాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు చంద్రబాబు నాయుడు. అయినా ఇలాంటి ధర్మాలు పాటించడానికి చంద్రబాబు ఏమీ ధర్మరాజు అంశం కాదు కదా.. ఔరంజేబు అంశం.

అసెంబ్లీ ప్రారంభోత్సమే కాదు.. రాజధాని శంఖుస్థాపన దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ ఇదే తీరును కొనసాగిస్తున్నారు. బాబు గుర్తుంచుకోవాల్సి ఏమిటంటే.. అధికారం శాశ్వతం కాదు. విరగాలంటే పెరగాలి... చంద్రబాబు తీరులో కూడా అలాంటి అహకారమే రోజు రోజుకూ పెరుగుతోంది. అది విరిగి.. కూకటి వేళ్లతో సహా పెకలించబడే సమయం మరెంతో దూరం లో లేదు. మతి పోయి వ్యవహరిస్తున్న చంద్రబాబుకు ఈ విషయం అర్థం కాదిప్పుడే.

-ఐవీ రెడ్డి,
గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రకాశం జిల్లా.