Begin typing your search above and press return to search.

చైనాను దాటేసిన ఇటలీ కరోనా మరణాలు

By:  Tupaki Desk   |   20 March 2020 5:34 AM GMT
చైనాను దాటేసిన ఇటలీ కరోనా మరణాలు
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మరణాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు.. మరణాల రేటు మరింత వేగాన్ని అందుకున్నాయి. ఇప్పటివరకూ ఎనిమిది వేలకు ఉన్న కరోనా మరణాలు.. ఇప్పుడు తొమ్మిది వేలను దాటేశాయి. ఈ మాయదారి వైరస్ పుట్టిన చైనాలో చోటు చేసుకున్న మరణాల కంటే ఎక్కువగా ఇటలీలో చోటు చేసుకోవటం దారుణం. కరోనా కారణంగా చైనాలో 3245 మంది మరణిస్తే.. ఇటలీలో ఈ సంఖ్య అంతకు మించి ఉండటం గమనార్హం. గురువారం తో కలిపి ఆ దేశంలో 3405 మంది మరణించారు.

వైరస్ సోకిన వారి సంఖ్య 35వేలకు దాటినట్లుగా అక్కడి అధికారులు చెబుతున్నారు. దీంతో.. ఇటలీలో పరిస్థితిని ఎలా అదుపు చేయాలా? అన్నది ఆ దేశానికి ఏ మాత్రం పాలుపోవటం లేదు. ఇప్పటికే ఆ దేశంలో 80 ఏళ్లు దాటిన వారికి కరోనా చికిత్స చేయకూడదని నిర్ణయించటం తెలిసిందే. వైద్యం చేయటానికి వైద్యులు.. వైద్య సిబ్బంది.. మందులు కొరత తో పాటు.. వారికి చికిత్స చేసేందుకు అవసరమైన గదులు లేకపోవటం తో పెద్ద వయస్కుల్ని వదిలి వేయాలన్న దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. మొన్నటివరకూ అందమైన.. ప్రశాంతమైన దేశంగా చెప్పే ఇటలీ.. ఇప్పుడు భయానకంగా మారింది. శోక సంద్రంలో కూరుకుపోవటమే కాదు.. తమకు ఎదురైన దారుణ పరిస్థితిని ఆ దేశస్తులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇలాంటి ఉత్పాతం తమను చుట్టేస్తుందని.. తమ జీవితాల్లో ఇంత దారుణమైన పరిస్థితుల్ని చూసి రావాల్సి వస్తున్న వైనంపై వారు తల్లడిల్లిపోతున్నారు. ప్రపంచంలో డెవలప్ మెంట్ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటైన తమ దేశంలో.. వైరస్ బారిన పడిన పెద్ద వయస్కుల్ని గాలికి వదిలేయాల్సి రావటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటలీ తో పాటు.. యూరప్ లోని పలు దేశాల్లో కరోనా కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతోంది.

మరణాల సంఖ్య తో పాటు.. కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. జర్మనీలో ఒక్కరోజులోనే 2801 కేసులు పాజిటివ్ కాగా.. మొత్తం కేసులు 10,999కి పెరిగాయి. స్పెయిల్ లో కరోనా మరణాల సంఖ్య 767కు చేరుకుంది.