Begin typing your search above and press return to search.

మరింత ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండేది మోడీ సాబ్

By:  Tupaki Desk   |   17 Jan 2021 10:00 AM IST
మరింత ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండేది మోడీ సాబ్
X
దేశ ప్రధానులుగా చాలామంది ఆ పదవిని చేపట్టినా.. మిగిలిన వారికి భిన్నంగా.. మేజిక్ చేసినట్లుగా వ్యవహరించే లక్షణం మోడీ సొంతం. సమయం చూసుకొని.. మనసుల్ని హత్తుకునేలా మాట్లాడటం.. ఆ సమయంలో ఆయన ప్రస్తావించే అంశాలు అద్యంతం వ్యూహాత్మకంగా ఉంటాయి. అయితే.. ఒకవిధమైన వ్యూహం ఎక్కువసార్లు వర్కువుట్ కాదు. తాజాగా ప్రధాని నోటి నుంచి వచ్చిన మాటలకు వచ్చిన స్పందనే నిదర్శనంగా చెప్పొచ్చు. కరోనా వ్యాక్సిన్ ను దేశ వ్యాప్తంగా ఇస్తున్న కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా దేశ ప్రజల్ని ఉద్దేశించి మోడీ మాట్లాడారు.

ఈ సందర్భంగా తెలుగు కవి గురజాడ అప్పారావు గేయాన్ని మోడీ ప్రస్తావించారు. ‘సొంత లాభం కొంత మానుకో.. పొరుగువాడికి తోడు పడవోయ్! దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అన్న మాటల్ని యథాతదంగా ప్రస్తావించటమే కాదు.. దాని అర్థాన్ని హిందీలో వివరించి చెప్పారు. సాధారణంగా ఇలాంటి గేయాల్ని ప్రస్తావించే సమయంలో.. యాసను జాగ్రత్తగా ఫాలో కావటం చాలా అవసరం.

తాజాగా గురజాడ గేయాన్ని ప్రస్తావించే సమయంలో మోడీ మాటలు తేలిపోయినట్లుగా ఉన్నాయి. దీనికికారణం ఆయన యాస.. పదాలు స్పష్టత లేకపోవటం.. ఎక్కడ పదాన్ని ఆపాలో దాన్ని అపకుండా తనకు తగ్గట్లు మార్చేసుకున్నారు. దీంతో.. ప్రధాని నోటి నుంచి వచ్చిన గురజాడ గేయం ద్వారా రావాల్సిన ఎఫెక్టు రాలేదని చెప్పాలి. ఇలా ప్రముఖుల మాటల్ని. కవితల్నిసమయానికి తగ్గట్లుగా ప్రస్తావించటం మోడీకి అలవాటే. మొదట్లో ఆయన.. ఇలాంటి వాటిని ఎఫెక్టివ్ గా చెప్పేందుకు కాస్త ప్రాక్టీస్ చేసే వారేమో. ఇటీవల కాలంలో అంత శ్రద్ధ చూపటం లేదన్న విషయం తాజాగా ఆయన మాటల్ని వింటే అర్థమైపోతుంది. కాస్త కసరత్తు చేసి.. మరింత బాగా చెబితే.. ఎఫెక్టు ఎక్కువగా ఉండేదన్న అభిప్రాయం పలువురి నోటి వెంట రావటం గమనార్హం.