Begin typing your search above and press return to search.

పాశర్లపూడిలో ఆ ఒక్క పులస ధర ఎంత పలికిందో తెలిస్తే అవాక్కే

By:  Tupaki Desk   |   21 Sept 2020 2:20 PM IST
పాశర్లపూడిలో ఆ ఒక్క పులస ధర ఎంత పలికిందో తెలిస్తే అవాక్కే
X
జిహ్వకో రుచి అంటారు కానీ.. పులస దగ్గరకు వచ్చేసరికి మాత్రం అందరికి ఒకటే మాట. పుస్తెలమ్మి అయినా పులస తినాలన్న నానుడికి ఏ మాత్రం తగ్గకుండా.. ఎప్పుడో ఒకసారి దొరికే పులస కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. పులసలకు పెట్టింది పేరైన తూర్పుగోదావరిలో తాజాగా దొరికిన ఒక పులస హాట్ టాపిక్ గా మారింది.

దాన్ని సొంతం చేసుకున్న పెద్ద మనిషిని చూసి ఆసూయ చెందేటోళ్లు బోలెడంతమంది. ఇంతకూ ఆ పులస స్పెషాలిటీ ఏమంటే.. సాధారణంగా ఏ పులస అయినా మూడు కేజీల బరువు మించదు. సాధారణంగా అరకేజీ.. కేజీ పులసలే ఎక్కువగా దొరుకుతుంటాయి. అప్పుడప్పుడు రెండున్నర కేజీలకు వరకు బరువుండే పులసలు లభిస్తాయి. తక్కువగా సందర్భాల్లో మాత్రమే రెండున్నర కేజీలకు పైన పులసలు దొరుకుతుంటాయి.ఇక.. ధర విషయానికి వస్తే కిలో రూ.4వేల వరకు పలుకుతూ ఉంటుంది.

తాజాగా మాత్రం అందుకు భిన్నంగా నాలుగు కేజీల పులస ఒకటి మత్యకారుడి వలలో పడింది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి వద్ద ఒక మత్యకారుడికి లభించిన ఈ భారీ పులస హాట్ టాపిక్ గా మారింది. దాన్ని సొంతం చేసుకోవటానికి పెద్ద పోటీనే నడిచింది. చివరకు పాశర్లపూడి నగరం ఏఎంసీ ఛైర్మన్ కొమ్ముల కొండలరావు సొంతం చేసుకున్నారు. అది కూడా రికార్డు ధర చెల్లించి మరి.

రెగ్యులర్ గా కేజీ రూ.4వేల చొప్పున నాలుగు కేజీలకు రూ.16వేలు పలకాలి. కానీ.. ఎప్పుడో ఒకసారి అరుదుగా వచ్చే ఈ భారీ పులసను సొంతం చేసుకోవటానికి రూ.21వేలు చెల్లించారు. ఈ పులస గురించి ఆలస్యంగా తెలిసిన వారంతా.. చక్కటి ఛాన్సు మిస్ అయ్యామని తెగ ఇదైపోతున్నారట.