Begin typing your search above and press return to search.

చెన్నై ఐటీ సెక్టార్ ను ఆదుకుంటున్న హైదరాబాద్

By:  Tupaki Desk   |   5 Dec 2015 9:56 AM GMT
చెన్నై ఐటీ సెక్టార్ ను ఆదుకుంటున్న హైదరాబాద్
X
తమిళనాడులో వరదలతో చెన్నై చిన్నాభిన్నం కావడంతో ప్రధానంగా ఆటోమొబైల్ - ఐటీ పరిశ్రమలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆటోమొబైల్ రంగ పరిశ్రమలు అప్పటికప్పుడు వేరే చోటి నుంచి పని చేయడానికి అవకాశం తక్కువ కావడంతో సెలవులు ప్రకటించేసి కామ్ గా కూర్చున్నాయి. కానీ, ఐటీ సెక్టార్ మాత్రం నిత్యం తమ క్లయింట్లకు సర్వీసు అందించాల్సి ఉండడం... సేవలకు అంతరాయం కలిగితే క్రెడిబిలిటీ - వ్యాపారం దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వారి కన్ను హైదరాబాద్ పై పడింది. చలో హైదరాబాద్ అంటూ చెన్నై నుంచి భాగ్యనగానికి వర్క్ ఫోర్స్ ను తరలించి పనికి అటంకం లేకుండా చూసుకుంటున్నారు. దాంతో హైదరాబాదులోని హోటళ్లన్నీ చెన్నై సాఫ్టువేర్ ఇంజినీర్లతో కిటకిటలాడుతున్నాయి.

చెన్నైలో ఐటీ పరిశ్రమ తిరిగి కోలుకునేందుకు కనీసం ఆర్నెల్లు పడుతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ తమ ప్రాజెక్ట్‌ లకు సంబంధించిన క్రిటికల్ రిసోర్స్ పర్సన్లను హైదరాబాద్ లోని తమ కార్యాలయాలకు పంపించి అక్కడి నుంచి పనిచేసేలా ఏర్పాట్లు చేశాయి. చెన్నైలో స్థిర నివాసముంటున్న ఐటీ నిపుణులు మినహాయిస్తే, మిగిలిన వారిలో ఎక్కువశాతం హైదరాబాద్‌ ఇప్పటికే వచ్చేశారు. ప్రతి ఐటీ కంపెనీకి క్రిటికల్ రిసోర్స్ పర్సన్లే ఎంతో కీలకం. ఆయా ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఒక క్రిటికల్ రిసోర్స్ పర్సన్‌ కు సరైన పని వాతావరణాన్ని కల్పించగలిగితే, క్రిందిస్థాయిలో కనీసం 500 నుంచి వెయ్యిమంది వరకు ఉద్యోగులు పనిచేసేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం చెన్నై నగరంలో పని వాతావరణ పూర్తిగా పాడైనందున ప్రముఖ కంపెనీలన్నీ తమ ప్రాజెక్ట్‌ లకు సంబంధించిన క్రిటికల్ రిసోర్స్ పర్సన్లను హైదరాబాద్ రప్పిస్తున్నాయి. వారి హోదాలను బట్టి స్టార్ హోటళ్లలోనూ - తమ సొంత - అద్దె గెస్ట్‌ హౌస్‌ ల్లోనూ వారికి వసతి కల్పిస్తున్నాయి. మెయిన్ సర్వర్ నుంచి వీపీఎన్ యాక్సిస్ ద్వారా వారంతా పనిచేసేందుకు వీలు కలుగుతుంది. ఇటువంటి పని వాతావరణం ఉండే.. హైదరాబాద్‌ లోని హోటల్ దసపల్లా - జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ తదితర స్టార్ హోటళ్లు - పలు ప్రైవేటు గెస్ట్‌ హౌస్‌ ల నుంచి ఇప్పటికే చాలామంది క్రిటికల్ రిసోర్స్ పర్సన్లు కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు హైదరాబాద్ లో రెడీ టు వర్క్ కార్యాలయాలు ఇప్పుడిప్పుడే పెరుగుతుండడంతో అలాంటివాటినీ అద్దెకు తీసుకుంటున్నారు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ - కంప్యూటర్లు అన్నీ ఏర్పాటు చేసి ఉన్న చోట నుంచి పనిచేస్తున్నారు. దీంతో ఆయా కంపెనీల సేవలకు అంతరాయం కలగకుండా చూసుకోగలుగుతున్నారు.

మరోవైపు ఆర్నెళ్లపాటు చెన్నైలో ఐటీ కోలుకునే అవకాశం లేకపోవడంతో అన్ని రాష్ట్రాల ఐటీ ఉద్యోగులు వెనక్కు మళ్లుతున్నారు. అలా వెనక్కు వస్తున్న తెలంగాణ ఐటీ ఉద్యోగులకు హైదరాబాద్ కంపెనీల్లో అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ఐటీ అసోసియేషన్(టిటా) ముందుకొచ్చింది. వారికి తెలంగాణ ప్రభుత్వ టీ హబ్ ద్వారా అవకాశాలు కల్పిస్తారు.

మరోవైపు చెన్నైలో ఉద్యోగులు చేయాల్సిన పనిని హైదరాబాద్ లోని ఆ సంస్థల బ్రాంచుల్లోని ఉద్యోగులు అదనపు గంటలు పనిచేసి పూర్తిచేస్తున్నారు. దీనివల్ల చెన్నై ఉద్యోగుల జీతాలకు ఇబ్బందుల్లేకుండా ఉంటాయి. ఇన్‌ ఫోసిస్ - యాక్సెంచర్ - ఐబీఎం - కాగ్నిజెంట్..తదితర కంపెనీలు బిజినెస్ కంటిన్యూ ప్లాన్(బీసీపీ) అగ్రిమెంట్‌ గా పిలిచే ఈ విధానాన్ని ఇప్పటికే అమల్లోకి తెచ్చాయి. మొత్తానికి ఒక్క గాలివాన చెన్నై ఐటీ పరిశ్రమను అతలాకుతలం చేసేస్తే హైదరాబాద్ నగరం ఐటీ రంగాన్ని అక్కున చేర్చుకున్నట్లయింది.