Begin typing your search above and press return to search.

అమ్మ ఇంట్లో ఐటీ త‌నిఖీలు..ఏం దొరికాయ్‌?

By:  Tupaki Desk   |   18 Nov 2017 4:14 AM GMT
అమ్మ ఇంట్లో ఐటీ త‌నిఖీలు..ఏం దొరికాయ్‌?
X
కాలం మ‌హా చిత్ర‌మైంది. అధికారానికి కేరాఫ్ అడ్ర‌స్ గా.. క‌నుసైగ‌తో రాష్ట్రాన్నే కాదు.. కేంద్రాన్ని శాసించిన స‌త్తా త‌మిళ‌నాడు అమ్మ జ‌య‌ల‌లిత‌ది. ఎవ‌రికి అవ‌కాశం ఇవ్వ‌ని అమ్మ‌.. కాలానికి మాత్రం దొరికిపోయారు. దాని చేతిలో ఓడిపోయారు. అంతులేని అధికారంలో చేతిలో ఉన్నా..సంప‌ద‌కు కొద‌వ లేకున్నా.. అనారోగ్యాన్ని మాత్రం జ‌యించ‌లేక‌పోయారు.

అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత వేద నిల‌యం క‌ళ త‌ప్పింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అమ్మ నెచ్చెలి శ‌శిక‌ళ జైల‌కు వెళ్ల‌టంతో పోయెస్ గార్డెన్‌కు తాళాలు ప‌డ్డాయి. అమ్మకు ఎంతో ఇష్ట‌మైన వేద నిల‌యాన్ని ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకునేందుకు పావులు క‌దుపుతున్న వేళ‌.. త‌మిళ‌నాడు అధికార‌పక్షంలో నెల‌కొన్న అంత‌ర్గ‌త విభేదాలు ఐటీ దాడుల వ‌ర‌కూ వెళ్లిన‌ట్లుగా చెబుతారు.

చిన్న‌మ్మ లెక్క తేల్చేందుకు వీలుగా క‌దుపుతున్న పావుల్లో ఇప్ప‌టికే భారీ ఎత్తున సోదాలు జ‌ర‌గ‌టం తెలిసిందే. ఆ సోదాల ప‌రంప‌ర‌లో తాజాగా అమ్మకు ఎంతో ఇష్ట‌మైన వేద‌నిల‌యంలోనూ ఐటీ త‌నిఖీలు త‌ప్ప‌లేదు. తాను ప‌వ‌ర్ లో లేన‌ప్పుడు గ‌తంలో ఐటీ అధికారులు పోయెస్ గార్డెన్ లో త‌నిఖీలు చేపట్ట‌గా.. ఈసారి చేతిలో అధికారంలో ఉన్న వేళ‌లోనూ వేద నిల‌యంలో ఐటీ అధికారుల త‌నిఖీలు త‌ప్ప‌లేదు.

గ‌డిచిన కొద్దిరోజులుగా చిన్న‌మ్మ శ‌శిక‌ళ ఆస్తుల మీద‌.. ఆమె కుటుంబ స‌భ్యులు.. బంధువులు.. స్నేహితుల ఇళ్ల మీద ఐటీ దాడులు భారీ ఎత్తున సాగుతున్న విష‌యంలో తెలిసిందే. ఈ మ‌హా సోదాలలో భాగంగా అమ్మ నివాస‌మైన వేద నిల‌యంలో శ‌శిక‌ళ ఉన్న గ‌దుల్లో త‌నిఖీలు నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఉందంటూ ఐటీ విభాగం కోర్టును ఆశ్ర‌యించింది. ఇందుకు కోర్టు స‌మ్మ‌తించ‌టంతో.. జ‌య ఈవీ సీఈవో వివేక్‌ కు ఫోన్ చేసిన అధికారులు వేద నిల‌యం తాళాలు తీసుకురావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

తాజాగా శుక్రవారం రాత్రి పోయెస్‌ గార్డెన్‌ లో జయలలిత తన కార్యాలయంగా ఉపయోగించిన గదితోపాటు - రికార్డుల గది - జయ పనిమనిషి పూనుగుండ్రన్ గది - శశికళ వినియోగించిన గదుల్లో తనిఖీలు చేపట్టామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. రాత్రి 9గంటల ప్రాంతంలో ప్రారంభమైన సోదాల్లో ఓ ల్యాప్‌ టాప్‌ తోపాటు, కొన్ని కీలక రికార్డులు సీజ్ చేసినట్లు సమాచారం. అమ్మ ఇంట్లో సోదాల‌న్న స‌మాచారం విన్న వెంట‌నే ఆమె అభిమానులు పెద్ద ఎత్తున పోయెస్ గార్డెన్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. అయితే.. ఇలాంటివి ముందే ఊహించిన అధికారులు భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. నిర‌స‌నకారుల్ని అడ్డుకున్నారు. కాగా.. తాజా సోదాల్ని శ‌శిక‌ళ వ‌ర్గం తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. అమ్మ ఆత్మ‌కు శాంతి ఉండ‌ద‌ని చెప్పింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో క‌నిపించ‌ని ఆత్మ గురించి ఆలోచించే వారు ఉన్నారంటారా?