Begin typing your search above and press return to search.

ఐటీ మంత్రిగారు ఏంటీ ప్లాన్ ‘ఏ’.. ఏంది ప్లాన్‘బి’

By:  Tupaki Desk   |   1 April 2021 4:00 PM IST
ఐటీ మంత్రిగారు ఏంటీ ప్లాన్ ‘ఏ’.. ఏంది ప్లాన్‘బి’
X
కడప స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి నిర్మాణ సంస్థ ‘లిబర్టీ’ సంస్థ తప్పుకోవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కరోనా ఆర్థికపరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేసేంత సామర్థ్యం లేని ఈ సంస్థ వైదొలిగింది. ఏపీ ప్రభుత్వం తక్కువ వ్యయం పెట్టడం.. మొత్తం భారం లిబర్టీ సంస్థపైనే పడడంతో గిట్టుబాటు కానీ.. మోయలేని ఈ భారాన్ని లిబర్టీ సంస్థ వదులకుందట.. అసలు లిబర్టీ సంస్థకు అంత అర్హత లేదని.. అది దివాళా తీసిందని తేలింది. దీంతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కథ మళ్లీ మొదటికి వచ్చింది. అసలు పూర్తి అవుతుందా? లేదా అన్న ఆందోళన సీమ వాసుల్లో నెలకొంది.

అయితే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి టెండర్ వేసిన సంస్థకు కనీసం ఆ అర్హత ఉందా లేదా అన్నది చెక్ చేయకుండా కాంట్రాక్ట్ ఇవ్వడంతోనే ఇలా ఫ్లాప్ అయ్యిందన్న చర్చ సాగుతోంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం తాము చిత్తశుద్ధితో ప్రయత్నించామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. తాము కడప స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి తీరుతామని చెప్పారు. లిబర్టీ స్టీల్ తో ఎలాంటి అవగాహన ఒప్పందం కుదరలేదని మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. లిబర్టీ స్టీల్ సంస్థ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని తాము గుర్తించామని చెప్పారు. ఆ సంస్థతో కేవలం చర్చలు మాత్రమే జరిగాయని గౌతం రెడ్డి తెలిపారు. తమ వద్ద కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై ప్లాన్ బీ ఉందని చెప్పారు.

ఎంవోయూ చేసుకుంటున్నప్పుడు కనీసం వాళ్ల ప్రొఫైల్ చెక్ చేసుకోకుండా ఎలా ఒప్పందం చేసుకున్నారని కడప వాసులు నిలదీస్తున్నారు. మీడియాలో వచ్చేంతవరకు ప్రభుత్వంకు ఈ విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. కంపెనీ ప్రొఫైల్ తెలియకపోతే ఎలా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఒకవేళ నెటిజన్స్ ట్రోల్ చేయకపోయి ఉంటే వాళ్లకే కాంట్రాక్ట్ పోయి అనర్థాలు జరిగేవి అంటున్నారు.

కడప స్టీల్ ప్లాంట్ ను దక్కించుకున్న సంస్థ దేశ సంపద అయిన భూములను బ్యాంకులో పెట్టి డబ్బు కొట్టేసి పారిపోతే ఏం చేస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వారు అన్నీ సర్ధుకొని పారిపోయే వరకు పట్టించుకోరా అని నిలదీస్తున్నారు. ఇలాంటి ఎంవోయూ చేసుకునేటప్పుడు ఎక్స్ పర్ట్ కమిటీ వేసి వాళ్ల ప్రొఫైల్ చూసుకునే పరిస్థితి ఉండాలని సూచిస్తున్నారు.

అప్పుడే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి రాష్ట్ర యువతకు ఉద్యోగాలు వస్తాయి. కానీ ఇలాంటి అర్హత లేని లిబర్టీ స్టీల్ కంపెనీలతో రాష్ట్రానికి, ప్రభుత్వంకు నష్టం తప్పితే ప్రజలకూ ఎలాంటి ఉపయోగం ఉండదంటున్నారు. ఇప్పటికైనా పరిశ్రమలను కట్టబెట్టే ముందు ఆ కంపెనీ అర్హతలు గమనించాలని ప్రభుత్వాన్ని నెటిజన్లు, కడప వాసులు కోరుతున్నారు.