Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఓటు త‌న హ‌క్కు అంటున్న‌ మాల్యా

By:  Tupaki Desk   |   27 April 2018 5:04 PM GMT
క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఓటు త‌న హ‌క్కు అంటున్న‌ మాల్యా
X
లిక్కర్‌ కింగ్‌ - బ్యాంకులకు కోట్లాది రుణాల ఎగవేత కేసులో నిందితుడు విజయ్‌ మాల్యా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. బ్యాంకులకు రూ 9 వేల కోట్లు బకాయిలు - మనీల్యాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా రెండేళ్లుగా బ్రిటన్‌ లో తలదాచుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎగవేత కేసులో విచారణ ఎదుర్కొంటూ విదేశాల్లో తలదాచుకున్న మాల్యాకు బ్రిటన్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన గుర్తుండే ఉంటుంది. ఆయ‌న్ను భార‌త్‌ కు అప్పగించే కేసు ప్రస్తుతం లండన్‌ లోని వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మే 12న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడం తన ప్రజాస్వామిక హక్కు అని అన్నారు.

క‌ర్ణాట‌క ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం త‌న దృష్టిలో ఉంద‌ని విజ‌య్ మాల్యా లండ‌న్‌ లో మీడియాతో పేర్కొన్నాడు. క‌న్న‌డ ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌డం త‌న హ‌క్కు అని పేర్కొంటూ ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేదని తెలిపాడు. బెయిల్‌ నిబంధనల ప్రకారం తాను బ్రిటన్‌ ను వీడి వచ్చే అవకాశం లేదని మాల్యా చెప్పాడు. కర్ణాటక రాజకీయాలను తాను ఇటీవల పరిశీలించకపోవడంతో వాటిపై మాట్లాడలేదన్నాడు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, తాను నిర్దోషినని మాల్యా అన్నారు. తానేంటో కోర్టే నిర్ణయిస్తుందని తెలిపారు.

ఇదిలాఉండ‌గా.. భారత్‌ - యూకే మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత అగ్రిమెంట్ ప్రకారం మాల్యాను వెనక్కి రప్పించేందుకు ఇండియా ప్రయత్నిస్తోంది. మాల్యా అప్పగింత కేసులో బ్రిటన్‌ కోర్టులో విచారణ కోసం సీబీఐ - ఈడీ జాయింట్‌ టీమ్‌ లండన్‌ లో వాద‌న‌లు వినిపించింది. మాల్యాకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలను సమర్పించి ఆయనను భారత్‌ కు అప్పగించేలా చూస్తామని భారత దర్యాప్తు సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. భారత్‌ తరపున క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టులో వాదనలు వినిపిస్తోంది.