Begin typing your search above and press return to search.

నితీష్‌కు ఆర్జేడీ టార్చ‌ర్‌.. మామూలుగా లేదుగా!

By:  Tupaki Desk   |   24 Nov 2020 6:29 PM GMT
నితీష్‌కు ఆర్జేడీ టార్చ‌ర్‌.. మామూలుగా లేదుగా!
X
ఉత్త‌ర భారతంలోని కీల‌క రాష్ట్రం బిహార్‌లో ఎన్నిక‌లు ముగిసి.. ప్ర‌బుత్వం కొలువుదీరి ప‌ట్టుమ‌ని ప‌దివారాలైనా గ‌డ‌వ‌క ముందే.. నాలుగో సారి ముఖ్య‌మంత్రిగా ప‌ద‌విని చేప‌ట్టిన జేడీయూ నేత‌.. నితీష్‌కుమార్‌కు నిద్ర ప‌ట్ట‌డం లేదు! తాను ఈ ఒక్క‌సారే సీఎం అవుతాన‌ని.. వ‌చ్చే సారి తాను బ‌రిలో నిల‌వ‌న‌ని ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో చెప్పుకొచ్చారు. అయితే.. ఇప్పుడు ఈ ఒక్క‌సారి కూడా ఆయ‌న సీఎంగా ప‌ద‌విలో ఉండ‌నిచ్చేలా క‌నిపించ‌డం లేదు.. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు. మ‌రీ ముఖ్యంగా అధికారం అంచుల వ‌ర‌కు వ‌చ్చి ప‌ట్టు త‌ప్పిన‌.. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కుమారుడు తేజ‌స్వి యాద‌వ్ నేతృత్వంలోని ఆర్జేడీ.. నిత్యం నితీష్‌పై విరుచుకుప‌డుతోంది. అచ్చం.. శ‌ల్య సార‌థ్యం మాదిరిగా.. సూటి పోటి మాట‌ల‌తో నితీశ్‌లో ధైర్యాన్ని క‌కావిక‌లం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

స‌రే! ఆర్జేడీ వ్యూహం ఎలా ఉంద‌నే విష‌యాన్ని కొంచెం ప‌క్కన పెడితే.. నిజంగానే నితీష్ కు కూడా సీఎం సీటు భారంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో జ‌ట్టుక‌ట్టి.. ఎన్డీయే కూట‌మిగా నితీశ్ బ‌రిలోకి దిగారు. అయితే.. తాను అనుకున్న‌ది ఒక్క‌టైతే.. జ‌రిగింది మ‌రొక‌టి. బీజేపీని ఎవ‌రు ఆద‌రిస్తారు.. అనుకున్న నితీష్‌కు భారీ దెబ్బ‌త‌గిలింది. త‌న పార్టీ జేడీయూ క‌న్నా.. భారీ సంఖ్య‌లో బీజేపీ సీట్లు సాధించింది. జేడీయూకు 43 స్థానాలు ద‌క్క‌గా.. బీజేపీకి 73 సీట్లు ద‌క్కాయి.దీంతో ఇంకేముంది.. నితీష్‌ను బీజేపీ ప‌క్క‌న పెడుతుంద‌నే ప్ర‌చారం ముందుకు వ‌చ్చింది. అయితే.. మ‌హారాష్ట్ర త‌ర‌హాలో ప్ర‌మాదం పొంచి ఉంటుందేమో.. అనే బావ‌న‌తో బీజేపీ మాట‌కు క‌ట్టుబ‌డ్డానంటూ.. నితీష్‌నే ముఖ్య‌మంత్రిని చేసింది.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. మంత్రుల సంఖ్య బీజేపీకే ఎక్కువ‌గా ఉంది. పైగా నితీష్ కు పెద్ద‌గా అధికారాలు కూడా లేవ‌నేది.. విశ్లేష‌కుల అభిప్రాయం. అంతేకాదు. బీజేపీ చెప్పిన‌ట్టు ఆయ‌న న‌డుచుకుంటున్నార‌నేది ప్ర‌తిప‌క్షంగా ఉన్న ఆర్జేడీ వాద‌న‌. దీంతో నిత్యం నితీష్‌ను ఆర్జేడీ నేత‌లు ఆట‌ప‌ట్టిస్తూనే ఉన్నారు. 43 మంది ఎమ్మెల్యేల‌తో ఉన్నా.. మీకు ప్రాధాన్యం లేదు.. రేపోమాపో.. గురి చూసి.. మీకు బీజేపీ దెబ్బ‌కొట్ట‌డం ఖాయం.. వ‌చ్చేయండి సార్‌.. మ‌నం మ‌నం చూసుకుందాం.. అని ఆర్జేడీ నేత‌లు.. సీఎంను ఉద్దేశించి.. సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. అంతేకాదు.. ప్ర‌స్తుత నితీశ్ కేబినెట్ లో ని మంత్రుల జీవిత చ‌రిత్ర‌ల‌ను త‌వ్వితీస్తోంది ఆర్జేడీ. ఈ క్ర‌మంలోనే ఆరోప‌ణలు ఎదుర్కొంటున్న మేవాలాల్‌.. ఇలా మంత్రి ప‌ద‌వికి ప్ర‌మాణ స్వీకారం చేసి.. అలా రాజీనామా స‌మ‌ర్పించాల్సి వ‌చ్చింది.

ఇక‌, మ‌రో ఇద్ద‌రు మంత్రుల‌పైనా ఆర్జేడీ నేత‌లు వ్యూహాత్మ‌కంగా దాడులు ప్రారంభించారు. ఇదిలావుంటే.. ఎంసీ నితీష్ టార్గెట్‌గా ఆర్జేడీ చేస్తున్న విమ‌ర్శ‌లు తార‌స్తాయికి చేరుతున్నాయి. ఆర్జేడీ సీనియ‌ర్ నాయ‌కుడు, లాలూ మిత్రుడు.. అమ‌ర్‌నాథ్ గ‌మీ ఏకంగా.. నితీశ్ త‌మ‌తో చేతులు క‌లిపితే.. బాగుంటుంద‌ని, ప్ర‌బుత్వాన్ని ఏర్పాటు చేద్దామ‌ని.. బిహారీల‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా మోడీ అన్యాయం చేశార‌ని.. అలాంటి పార్టీతో చేతులు క‌లిపి.. చ‌రిత్ర‌లో చెడ్డ నేత‌గా నిలిచిపోవ‌ద్ద‌ని.. నిత్యం నితీశ్‌కు చుర‌క‌లు అంటిస్తున్నారు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. నితీష్‌.. రాజ‌కీయాలు.. అంత ఈజీగా సాగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పైగా బీజేపీ వ్యూహాత్మ‌కంగా ఇక్క‌డ పావులు క‌దుపుతోంది. మొత్తంగా చూస్తే.. నితీష్‌కు అప్పుడే.. టార్చ‌ర్ ప్రారంభం కావ‌డంతో .. ఐదేళ్లు ఆయ‌న స‌ర్కారు మ‌న‌గ‌లుగుతుందా? అనే సందేహాలు వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.