Begin typing your search above and press return to search.

రోజంతా మాస్క్ ధరించడం కష్టం...పంత్ కి మద్దతుగా నిలిచిన గంగూలీ !

By:  Tupaki Desk   |   16 July 2021 11:30 AM GMT
రోజంతా మాస్క్ ధరించడం కష్టం...పంత్ కి మద్దతుగా నిలిచిన గంగూలీ !
X
టీమ్ ఇండియా యువ వికెట్‌ కీపర్‌ , స్టార్ ఆటగాడు రిషభ్‌ పంత్‌ కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అండగా నిలిచారు. టీం ఇండియా యువ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ యూకే డెల్టా వేరియంట్‌ లక్షణాలు కనిపించడం టీమిండియాను కలవరానికి గురిచేసింది. ఇంగ్లండ్‌ తో ఐదు టెస్టుల సిరీస్‌ ప్రారంభానికి పంత్‌ తో పాటు సహాయక సిబ్బంది దయానంద్‌ గరానికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. అయితే పంత్‌ కు కరోనా రావడంపై స్పందించిన దాదా అండగా నిలిచాడు. పంత్ అద్భుత ఆటగాడని ప్రశంసించారు.

ఇంగ్లండ్‌ లో ఇప్పుడు రూల్స్‌ మారాయి. ఇటీవలే జరిగిన యూరోకప్‌ 2020, వింబుల్డన్‌ మ్యాచ్‌ లకు చాలావరకు ప్రేక్షకులు మాస్క్‌ పెట్టుకోకుండానే వచ్చారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ అనంతరం మన ఆటగాళ్లకు 20 రోజుల విరామం లభించింది. రూల్స్‌ సవరించడంతో మాస్కులు పెట్టుకోకుండా తిరిగారు. అయినా, రోజు మొత్తం మాస్క్‌ ధరించి బయట తిరగడం ఇబ్బందిగానే ఉంటుంది. ఇక పంత్‌ గురించి మేం దిగులు చెందడం లేదు. అతని ఆరోగ్యం త్వరగానే మెరుగవుతోంది. టెస్టు సిరీస్‌ ప్రారంభంలోగా పంత్‌ జట్టుకు అందుబాటులోకి వస్తాడు అని చెప్పుకొచ్చాడు.

ఇకపోతే , కాగా ఇంగ్లండ్‌, టీమిండియాల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. విరామం అనంతరం భారత ఆటగాళ్లు మళ్లీ ఆటపై దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 20 నుంచి చెస్టర్‌ లీ స్ట్రీట్‌లో జరిగే మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ లో టీమిండియా బృందం కౌంటీ సెలక్ట్‌ ఎలెవన్‌ జట్టుతో తలపడుతుంది. ప్రస్తుతం ఐసోలేషన్‌ లో ఉన్న ఐదుగురు మినహా మిగతావారంతా ఈ మ్యాచ్‌ కోసం గురువారం సాయంత్రం లండన్‌ నుంచి డర్హమ్‌ కు చేరుకున్నారు. పంత్‌ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని, వరుసగా రెండు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు నెగెటివ్‌ గా వస్తే అతనూ జట్టుతో చేరతాడని బోర్డు వెల్లడించింది. అయితే నెగెటివ్‌ గా వచ్చినా కోలుకునేందుకు సమయం పడుతుంది కాబట్టి అతను ఈ మ్యాచ్‌ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సాహా కూడా ఐసోలేషన్‌లో ఉండటంతో కేఎల్‌ రాహుల్‌ కీపర్‌గా వ్యవహరించవచ్చు.

అయితే టీమిండియా ఆటగాళ్లకు 20 రోజుల విశ్రాంతి ఇవ్వడంతోనే కరోనా బారిన పడ్డారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిక్కిరిసిన అభిమానుల మధ్య యూరో కప్ మ్యాచ్‌ లను చూసేందుకు వెళ్లినందుకే పంత్‌ కు వైరస్ సోకి ఉండవచ్చని, అతను మాస్క్ కూడా ధరించలేదని కొందరు విమర్శించారు. కానీ రిషభ్ పంత్ లండన్‌ లోని ఓ దంత వైద్యుడిని సంప్రదించాడని, అక్కడే వైరస్ సోకి ఉండవచ్చని టీమ్ వర్గాలు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. జూలై 5, 6 తేదీల్లో రిషభ్ పంత్ లండన్‌ లోని ఓ దంత వైద్యుడిని సంప్రదించాడు. అక్కడే అతనికి వైరస్ అటాక్ అయ్యి ఉండొవచ్చు అని టీమ్‌ కు చెందిన ఓ అధికారి తెలిపాడు. ఇక రిషభ్ పంత్‌ కు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్‌ గంగూలీ అండగా నిలిచారు. నిజ జీవితంలో పూర్తిగా మాస్కులు ధరించడం కష్టమని పంత్‌ పై వస్తున్న విమర్శలను దాదా తిప్పికొట్టాడు.