Begin typing your search above and press return to search.

త‌ల్లిదండ్రుల‌ను చూడ‌క‌పోవ‌డం నేరం.. దానికి శిక్ష ఏంటో తెలుసా..?

By:  Tupaki Desk   |   12 Feb 2021 8:00 PM IST
త‌ల్లిదండ్రుల‌ను చూడ‌క‌పోవ‌డం నేరం.. దానికి శిక్ష ఏంటో తెలుసా..?
X
ఈ భూమ్మీదకు మ‌నం వ‌చ్చామంటే.. త‌ల్లిదండ్రులు జ‌న్మ‌నివ్వ‌డం వ‌ల్లే. మ‌నం ఎదిగి ఓ స్థాయికి వ‌చ్చామంటే.. వారి రెక్క‌ల క‌ష్టం వ‌ల్లే. కానీ.. త‌మ‌కు రెక్క‌లొచ్చిన త‌ర్వాత ప్రాణం పోసిన వారిని మ‌రిచిపోతుంటారు కొంద‌రు. గోరు ముద్ద‌లు తినిపించి పెంచిన వారిని గాలికి వ‌దిలేస్తుంటారు చాలా మంది. ఈ స‌మ‌యంలో నిత్యం ఎక్క‌డో ఒక‌చోట ఇలాంటి ఉదంతాలు చూస్తూనే ఉంటాం. అయితే.. ఆ విష‌యంలో పాపం, పుణ్యం సంగ‌తి ఎలా ఉన్నా.. చ‌ట్ట ప‌రంగా మాత్రం అది తీవ్ర‌మైన నేరం. ఇదే విష‌యాన్ని మ‌రోసారి స్ప‌ష్టం చేస్తున్నారు న్యాయ‌మూర్తులు!

అవసాన దశలో అమ్మానాన్నలను నిర్లక్ష్యం చేయడం, వారి యోగ క్షేమాలు చూడకపోవడం తీవ్రమైన నేరమని, అందుకు మూడునెలల జైలు శిక్షతోపాటు జరిమానా ఉంటుందని చెప్పారు సీనియర్‌ సివిల్‌ జడ్జి, సిటీ సివిల్‌ కోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి కె.మురళీమోహన్‌. హైదరాబాద్ సిటీ సివిల్‌ కోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో సీనియర్‌ సిటిజన్స్‌ కోసం శుక్రవారం 'న్యాయ విజ్ఞాన సదస్సు' నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి కె. మురళీమోహన్..‌ పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ పోషణ, సంక్షేమ చట్టం గురించి వివరించారు. చట్టంతోపాటు బాధ్యతలను కూడా వివరించారు. తల్లిదండ్రులను, సీనియర్‌ సిటిజన్స్‌ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత వారి పిల్లలపైనే ఉందన్నారు. కని, పెంచి పోషించిన పిల్లలు.. చివరి దశలో వారికి రక్షణగా ఉండాలన్నారు.

ఒకవేళ పిల్ల‌లు ప‌ట్టించుకోక‌పోతే.. చ‌ట్ట ప్ర‌కారం న్యాయాన్ని పొందే అవ‌కాశం ఉంద‌న్నారు. ఆర్‌డీఓ స్థాయి అధికారి ఆధ్వర్యంలోని ట్రిబ్యునల్‌ను సీనియ‌ర్ సిటిజ‌న్స్‌ సంప్రదించవచ్చని చెప్పారు. తల్లిదండ్రుల ఆస్తిని కాజేసి, వారిని ప‌ట్టించుకోక‌పోతే.. తమ ఆస్తిని తిరిగి వెనక్కి పొందే అవకాశం కూడా చ‌ట్టంలో ఉంద‌ని చెప్పారు.ఈ రోజుల్లో కొందరు కొడుకులు ఆస్తిని పంచుకుని తల్లిదండ్రలను లెక్క చేయడంలేదన్నారు. కానీ.. ఇలాంటి ప‌ద్ధ‌తి స‌రికాద‌న్నారు. తల్లిదండ్రులను కూడా తమ భార్యాపిల్లల్లో భాగంగా ప్రతీ కొడుకు గుర్తించాలని సూచించారు.