Begin typing your search above and press return to search.

బయటకు వచ్చిన ఆ ఐటీ ఉద్యోగి టైం హిస్టరీ

By:  Tupaki Desk   |   4 March 2020 5:42 AM GMT
బయటకు వచ్చిన ఆ ఐటీ ఉద్యోగి టైం హిస్టరీ
X
కొవిడ్ వైరస్ పాజిటివ్ వచ్చిన ఐటీ ఉద్యోగి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. ఈ వైరస్ బారిన పడినట్లుగా పరీక్షల్లో తేలిన వెంటనే.. అతగాడు.. అంతకు ముందు ఎక్కడెక్కడకు వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? గడిచిన పదిహేను రోజులుగా ఎక్కడ ఉన్నాడన్న విషయాల మీద అధికారులు కిందామీదా పడ్డారు. అతగాడి టైం హిస్టరీని సిద్ధం చేసి.. రివర్స్ ఇంజనీరింగ్ లో అతడు కలిసిన వారు.. అతగాడు పర్యటించిన ప్రాంతాల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ మొత్తం ప్రక్రియను సీక్రెట్ గా ఉంచారు. తాజాగా.. దీనికి సంబంధించిన ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. హైదరాబాద్ మహానగరానికి కొవిడ్ బెంగను తీసుకొచ్చిన సదరు ఐటీ ఉద్యోగి ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎక్కడున్నాడు? ఏం చేశాడన్న విషయానికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.

ఫిబ్రవరి 15 బెంగళూరు నుంచి దుబాయ్ కు వెళ్లారు
ఫిబ్రవరి 16 దుబాయ్ నుంచి సింగపూర్ వెళ్లారు. అక్కడే మూడు రోజులు ఉన్నారు
ఫిబ్రవరి 19 సింగపూర్ లో ఉండి కంపెనీ పని చేసిన అతడు.. మరో ఉద్యోగితో కలిసి పని చేశాడు
ఫిబ్రవరి 20 సింగపూర్ లో పని పూర్తి చేసుకొని బెంగళూరు చేరుకున్నారు
ఫిబ్రవరి 21 విదేశీ పర్యటన తర్వాత బెంగళూరులోని ఆఫీసుకు వచ్చాడు. రెండు రోజులు అక్కడే పని చేశాడు
ఫిబ్రవరి 21 ఒంట్లో నలతగా ఉండటంతో బెంగళూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరాడు
ఫిబ్రవరి 22 హైదరాబాద్ కు వచ్చాక.. జ్వరంతో సికింద్రాబాద్ అపోలోకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు
ఫిబ్రవరి 23 హైదరాబాద్ కు చేరుకున్న నాలుగు రోజుల తర్వాత నుంచి కొవిడ్ లక్షణాలు మొదలయ్యాయి
ఫిబ్రవరి 27 సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరాడు.
ఫిబ్రవరి 29 అపోలో ఆసుపత్రిలో చేరిన అతడు.. రెండు రోజులు ఆసుపత్రిలోనే చికిత్స చేయించుకున్నాడు
మార్చి 01 అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో బైలేటరల్ లోయర్ లోబ్ న్యుమెనియా పరీక్ష చేశారు
మార్చి 01 కొవిడ్ లక్షణాలు తేలటంతో అతడ్ని గాంధీకి షిఫ్ట్ చేశారు

మార్చి 02 సాయంత్రం చేరిన అతడికి రక్త పరీక్షలు జరిపి.. అనుమానిత కేసుగా స్క్రీనింగ్ టెస్టు చేశారు. అనుమానంతో అర్థరాత్రి ఒంటిగంటకు మరో నమూనా తీసుకున్నాడు. చివరకు మార్చి 2న ఉదయం తొమ్మిది గంటలకు కొవిడ్ పాజిటివ్ కేసుగా నిర్ధారణ చేశారు. దీంతో.. తెలంగాణలో తొలి కొవిడ్ పాజిటివ్ కేసును గుర్తించినట్లుగా కేంద్రం ప్రకటించింది. ఇలా బెంగళూరు నుంచి సింగపూర్ కు వెళ్లిన అతగాడి జర్నీ.. హైదరాబాదీయులకు పెను గండంగా మారిందిప్పుడు.