Begin typing your search above and press return to search.

మూడు నెల‌ల్లో 11000 ఉద్యోగాలు ఔట్‌...ఐటీ ప‌రిశ్ర‌మ‌లో ఆందోళ‌న‌

By:  Tupaki Desk   |   31 July 2020 1:30 AM GMT
మూడు నెల‌ల్లో 11000 ఉద్యోగాలు ఔట్‌...ఐటీ ప‌రిశ్ర‌మ‌లో ఆందోళ‌న‌
X
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం...ప‌లు సంద‌ర్భాల్లో స‌మ‌స్య‌లు ఎదుర్కుంటున్న‌ప్ప‌టికీ యువ‌త‌కు ఈ రంగంపై ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌స్తుతం అన్ని రంగాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తోంది. ఈ షాకుల పరంప‌ర‌కు తాజాగా సాఫ్ట్‌వేర్ ప‌రిశ్ర‌మ సైతం పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయింది. మ‌న దేశంలోని ఐటీ రంగ సంస్థలు ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దాదాపు 11వేల మంది ఉద్యోగులను తొలగించాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి దేశీయ‌ టాప్ కంపెనీల్లో పెద్దమొత్తంలో వెళ్లిపోయారు. ఈ ప‌రిణామాల‌కు పూర్తిగా క‌రోనా కార‌ణ‌మ‌ని పేర్కొన‌లేమ‌ని కరోనా వైరస్‌ ప్రభావం కావచ్చు.. ఆటోమేషన్‌ ఫలితమై ఉండొచ్చు.. మూడు నెలల్లో మాత్రం ఐదు అగ్రశ్రేణి సంస్థల ఉద్యోగుల సంఖ్య 10,962 మేరకు తగ్గిపోయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కంపెనీల వారీగా ఉద్యోగాలు ఊస్ట్ అయిన ఉదంతాలు చూస్తే, టీసీఎస్‌లో అత్యధికంగా 4,786 మంది ఉద్యోగులు వెళ్లిపోగా, ఇన్ఫోసిస్‌లో 3,138, టెక్‌ మహీంద్రాలో 1,820, విప్రోలో 1,082, హెచ్‌సీఎల్‌ టెక్‌లో 136 మంది చొప్పున ఉద్యోగులు త‌మ కొలువుల‌కు రాజీనామా చేశారు. ఈ ప‌రిణామంపై నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఐటీ సంస్థల ఉద్యోగుల సంఖ్యలో హెచ్చుతగ్గులే ఐటీ రంగ వృద్ధి, పతనానికి కొల‌బ‌ద్ద‌గా పేర్కొంటారు. ఇలాంటి త‌రుణంలో తాజాగా పెద్ద సంఖ్య‌లో ఉద్యోగాలు కోల్పోవ‌డం చూస్తే, దేశీయ ఐటీ రంగం మందగమనంలో ఉంద‌ని భావించ‌వ‌చ్చ‌ని పేర్కొంటున్నారు.

ఇక ఈ కీల‌క‌మైన మార్పుపై దేశీయ ఐటీ దిగ్గ‌జాలు సైతం త‌మ అభిప్రాయ‌ల‌ను పంచుకున్నాయి. ఇన్ఫోసిస్‌ సీవోవో ప్రవీణ్‌ రావు మాట్లాడుతూ కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని అన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరికొంత సమయం పడుతుందన్న ఆయన ఉద్యోగుల కోతలపై స్పందించలేదు. పెద్ద సంఖ్య‌లో ఉద్యోగాలు పోయిన జాబితాలో ఇన్ఫీ మొద‌టి స్థానంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. కొలువులు కోల్పోయిన జాబితాలో రెండో స్థానంలో ఉన్న‌ విప్రో సంస్థ‌ సీఎఫ్‌వో జతిన్‌ దలాల్‌ స్పందిస్తూ సంస్థ ఆదాయం పడిపోయినప్పుడు ఇలాంటివి జరుగడం మామూలేనని అన్నారు. త‌మ‌ సంస్థలో ప్రతిభావంతుల కొరత లేదన్నారు. టెక్‌ మహీంద్రా సీఎఫ్‌వో మనోజ్‌ భట్ స్పందిస్తూ, సంస్థాగత నియామకాల్లో మందగమనం ఉన్నట్లు ‌ అంగీకరించారు. అయితే రాబోయే త్రైమాసికాల్లో పూర్వ వైభవాన్ని సంతరించుకోగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.