Begin typing your search above and press return to search.

ఉద్యోగుల‌ను ఆఫీస్‌ల‌కు ర‌ప్పిద్దాం: ఐటీ యాజమాన్యాల దృష్టి

By:  Tupaki Desk   |   28 July 2020 11:15 AM IST
ఉద్యోగుల‌ను ఆఫీస్‌ల‌కు ర‌ప్పిద్దాం: ఐటీ యాజమాన్యాల దృష్టి
X
వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నా కూడా కార్యాల‌యాల్లో ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి తిరిగి ఉద్యోగుల‌ను వ‌ర్కు ఫ్ర‌మ్ హోమ్ విధానం ఎత్తివేసేలా కొన్ని ఐటీ కంపెనీలు ప్లాన్ వేస్తున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి తెరుచుకున్న నేప‌థ్యంలో కొన్ని ఇబ్బందుల కార‌ణంగా ఉద్యోగుల‌ను కార్యాలయాల‌కు ర‌ప్పిద్దామ‌ని ఐటీ సంస్థ‌లు భావిస్తున్నాయి. ప్ర‌స్తుతం 15 శాతం ఉద్యోగులు కార్యాలయాలకు వ‌స్తున్నారు. కంపెనీ, ఉద్యోగుల అవసరాలు, ఇబ్బందులు, క్లయింట్స్ డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యోగుల‌ను ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. దీనిలో భాగంగా టెక్ మహీంద్రా, ఇన్పోసిస్ వంటి కంపెనీలు ఎవరిని కార్యాల‌యాల‌కు రప్పించాలి, ఎవరిని ఇంటి నుంచి పని చేయించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నాయి.

200 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమలో లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఐటీ సంస్థల్లో 15 శాతం మంది మాత్రమే ప్రస్తుతానికి ఆఫీస్‌లకు తిరిగి వస్తారని భావిస్తున్నారు. కంపెనీ అవసరాలు, ఉద్యోగుల ఇబ్బందులు, క్లయింట్స్ డిమాండ్‌కు అనుగుణంగా కార్యాలయానికి ఉద్యోగులను ర‌ప్పించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులకు రిమోట్ వర్కింగ్ ఇబ్బందికరంగా మారింది. కార్యాల‌యం‌లో కొంతమంది ఉద్యోగులు తప్పనిసరిగా కావాలి. అందుకే డేటా తయారు చేసుకొని, వారిని కార్యాలయాలకు రప్పించనున్నాయి. అయితే ప్ర‌స్తుతం వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న స‌మ‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉద్యోగులను కార్యాల‌యాల్లో ప‌ని చేసేలా చేయాలి. ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు పాటిస్తూనే ఉద్యోగుల‌తో ప‌ని చేయించుకోవాలి. అందుకు అనుగుణంగా కార్యాల‌యాల్లో ఏర్పాట్లు చేస్తున్నాయి. కార్యాలయంలో అవసరమైన ఉద్యోగుల జాబితాను తయారుచేసి కార్యాలయానికి రప్పించమని, ఆఫీస్ నుంచి వర్క్ కోసం క్రమంగా ఉద్యోగులను పెంచుతామని టెక్ మహీంద్రా సీఎస్ఓ జగదీశ్ మిత్ర తెలిపారు. సురక్షిత వాతావరణంలో ప‌ని జరిగేలా చూస్తామ‌న్నారు.

మాస్కులు.. శానిటైజ‌ర్‌.. భౌతిక దూరం వంటి జాగ్ర‌త్త‌లు పాటిస్తూనే కార్యాల‌యాల్లో ఉద్యోగులు విధులు నిర్వ‌హించేలా ఆయా యాజ‌మాన్యాలు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఇంటి నుంచి ప‌ని చేయ‌డంతో ఇబ్బందులు పడుతున్న క్లయింట్స్ ప్రాజెక్టుల కోసం మాత్రమే ఉద్యోగుల‌ను కార్యాల‌యాల‌కు రప్పిస్తున్నట్లు ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్ రావు తెలిపారు. పరిస్థితులు మెరుగుపడ్డాక ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి పని చేయాలని భావిస్తున్నారు.