Begin typing your search above and press return to search.

ఆఫీసుకు రమ్మనే ఐటీ కంపెనీలు.. ఈ సంస్థను చూసి బుద్ధి తెచ్చుకోండి

By:  Tupaki Desk   |   30 April 2022 5:33 AM GMT
ఆఫీసుకు రమ్మనే ఐటీ కంపెనీలు.. ఈ సంస్థను చూసి బుద్ధి తెచ్చుకోండి
X
ఉద్యోగుల సంక్షేమానికి.. వారి ఇష్టాలకు పెద్దపీట వేస్తామని చెప్పే ఐటీ కంపెనీలు తమ అవసరాలకు తగ్గట్లుగా మాట్లాడటం.. నిర్ణయాలు తీసుకోవటం ఈ మధ్యన ఎక్కువైంది. చెప్పే నీతులన్ని కూడా తమ అవసరం కోసమే తప్పించి.. ఉద్యోగుల సంక్షేమం.. వారిని సంతోషానికి గురి చేసేందుకు కాదన్న పచ్చి నిజం.. కొన్ని ఐటీ కంపెనీల తీరుతో అర్థమవుతోంది. కరోనా వేళ.. ఇంటి నుంచి పని చేసుకోవచ్చన్న బంఫర్ ఆఫర్ ఇచ్చేసి.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న భయాందోళనల్ని అసరాగా చేసుకొని.. ఎనిమిది గంటల పనిని పద్నాలుగు గంటల పాటు పిండేసిన ఐటీ కంపెనీల తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కరోనా పరిస్థితులు తగ్గి.. సాధారణ పరిస్థితులు నెలకొంటున్న వేళ.. అవసరం ఉన్నా లేకున్నా ఆఫీసుకు తప్పనిసరిగా రావాలంటూ వేస్తున్న హుకుంలతో ఐటీ ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎంతసేపటికి తమ కోణంలో తప్పించి.. ఉద్యోగుల కోణంలో ఆలోచించని కంపెనీ ఉద్యోగులు పలువురు .. తమ ఉద్యోగాలకు రిజైన్ చేసేయటం తెలిసిందే. కరోనా తర్వాత ఐటీ సంస్థల్లో పెరిగిన అవకాశాల నేపథ్యంలో.. తరచూ ఇబ్బందులకు గురి చేసే కంపెనీలకు చెందిన ఉద్యోగులు సింఫుల్ గా గుడ్ బై చెప్పేస్తున్న వైనం ఇప్పుడు ఎక్కువైంది.

ఇలాంటి వేళ.. తెలివి తెచ్చుకున్న ఐటీ కంపెనీలు కొన్ని ఉద్యోగులు ఆఫీసుకు రావాలన్న అంశంపై చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఆఫీసుకు రావాలంతే అంటూ కరాఖండిగా చెప్పినోళ్లు సైతం ఇప్పుడు తమ తీరును మార్చుకుంటున్నారు. ఇలాంటివేళలో.. ఒక సంస్థ చేసిన ప్రకటన ఐటీ ఉద్యోగులకు కొత్త ఉత్సాహానికి గురి చేయటమే కాదు.. తమ కంపెనీలు సైతం ఇలానే ఆఫర్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇంతకూ సదరు ఐటీయేతర కంపెనీ తమ ఉద్యోగులకు ఇచ్చిన భారీ ఆఫర్ ఏమంటే.. 'మీరు పని చేయండి. అందుకు ఆపీసుకు రావాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎక్కడున్నా ఫర్లేదు. మీ పని మీరు చేస్తే చాలు' అని పేర్కొంది. ఇంతకీ ఆ కంపెనీ పేరేమిటంటే.. ఎయిర్ బీఎన్ బి (Airbnb).

ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా వసతి సౌకర్యాన్ని ఇచ్చే ప్రైవేటు సంస్థలు.. ప్రైవేటు వ్యక్తుల వివరాలతో సేవలు అందించే యాప్ గా దీనికి మంచి పేరుంది. ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వసతి సౌకర్యాలకు సంబంధించి ప్రపంచంలోని ఏ ప్రాంతమైనా ఇట్టే వెళ్లిపోవచ్చన్న భావన కలిగించలంలో సక్సెస్ అయ్యింది. శాన్ ఫ్రాన్సిక్సో వేదికగా పని చేసే ఈ సంస్థ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

'దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా లేదంటే 170 దేశాల్లోని ఏ మూల నుంచైనా ఉద్యోగులు పని చేసుకోవచ్చు. పని ప్రాంతం జీతంపై ఎలాంటి ప్రభావం చూపదు. మరికొద్ది నెలల్లో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తాం. అయితే.. అమెరికా కాకుండా విదేశాల్లో పని చేసే ఉద్యోగులు మాత్రం కొన్ని షరతులకు లోబడి పని చేయాలి' అంటూ సదరు సంస్థ సీఈవో బ్రియాన్ చెస్కీ ఒక మొయిల్ ను తమ ఉద్యోగులకు పంపారు. ఇంతకూ ఆయన విధించిన నాలుగుషరతులు ఏమంటే..

1. ప్రపంచంలో ఎక్కడి నుంచి పని చేసినా ఫర్లేదు. కాకుంటే కొద్ది మంది ఉద్యోగులు మాత్రం ఆఫీసుకు రావాల్సి ఉంటుంది.. అది కూడా కార్యాలయ కలాపాలు చూసుకునేందుకు.

2. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా పని చేయొచ్చు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే. కుటుంబానికి దగ్గర ఉండి పని చేసే కలను తీర్చుకునే క్రమంలో ఏ ప్రాంతం నుంచైనా పని చేయొచ్చు. మీ జీతం మీద ఎలాంటి ప్రభావం చూపదు. జీతం.. ఈక్విటీలు ఒకేలా చెల్లింపులు జరుగుతాయి. ప్రాంతాన్నిబట్టి తక్కువ చెల్లింపులు ఎవరి విషయంలో జరిగినా.. జూన్ లో ఆయా ఉద్యోగులు తమ జీతాల పెరుగుదలను చూస్తారు.

3. 170 దేశాల్లో ఏ ప్రాంతం నుంచైనా పని చేసుకోవచ్చు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకుంటే.. పన్నులు.. ఇతర కారణాల నేపథ్యంలో ఒక ప్రాంతంలో 90 రోజులు మాత్రం తప్పక ఉండాలి. ఉద్యోగుల సౌలభ్యం కోసం స్థానిక ప్రభుత్వాలతో సంస్థ సంప్రదింపులు జరుపుతూనే ఉంటుంది.

4. కరోనా ఇంకా కంట్రోల్ కాని వేళ.. పరిమిత సంఖ్యలో ఆఫ్ సైట్ ఈవెంట్ లు ఉంటాయి.