Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే, ఆయన బావమరిది గొడవలో ట్విస్టుల మీద ట్విస్టులు!

By:  Tupaki Desk   |   5 Dec 2022 5:32 AM
వైసీపీ ఎమ్మెల్యే, ఆయన బావమరిది గొడవలో ట్విస్టుల మీద ట్విస్టులు!
X
శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆయన బావమరిది శ్రీధర్‌రెడ్డి వివాదం వ్యవహారం సీరియల్‌ను తలపిస్తోంది. ఈ గొడవలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కొడుకు శ్రీధర్‌రెడ్డికి వ్యతిరేకంగా, అల్లుడు బియ్యపు మధుసూదన్‌రెడ్డికి అనుకూలంగా శ్రీధర్‌రెడ్డి తండ్రి రంగప్రవేశం చేయడంతో ఈ గొడవ ఆసక్తికర పరిణామాలకు దారి తీసింది.

అసలు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, ఆయన బావమరిది శ్రీధర్‌రెడ్డిల మధ్య గొడవ ఎందుకొచ్చిందంటే.. తన ఆస్తిని తన సోదరి భర్త, బావ అయిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కాజేశారని శ్రీధర్‌రెడ్డి ఆరోపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాను తన ఇంటి వద్ద బోరు వేసుకుంటుంటే తన బావ, ఎమ్మెల్యే అయిన బియ్యపు మధుసూదన్‌రెడ్డి అడ్డుకున్నారంటూ శ్రీధర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుంటానంటూ హడావుడి చేశారు.

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో తప్పంతా తన కుమారుడిదేనని శ్రీధర్‌రెడ్డి తండ్రి వెంకట నారాయణరెడ్డి స్పష్టం చేయడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. తన కుమారుడు శ్రీధర్‌రెడ్డిదే తప్పని.. కూతురు, అల్లుడికి మద్దతుగా వెంకట నారాయణరెడ్డి నిలబడ్డారు.

తన కొడుకువన్నీ డ్రామాలని శ్రీధర్‌రెడ్డి తండ్రి వెంకట నారాయణరెడ్డి మండిపడ్డారు. గతంలోనూ ఇలాగే ఆత్మహత్య చేసుకుంటానంటూ డ్రామాలు ఆడాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటున్న శ్రీధర్‌రెడ్డి తనను, తన భార్యను ఇంట్లో నుంచి తరిమేశాడని మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. అంతేకాకుండా తన కుమార్తె, అల్లుడు బియ్యం మధుసూదన్‌రెడ్డిని ఇష్టానుసారం తన కుమారుడు శ్రీధర్‌ తిడుతున్నాడని విమర్శించారు.

తన ఆస్తిలో పదెకరాలను పసుపు, కుంకుమల కింద తన కుమార్తె అయిన బియ్యం మధుసూదన్‌రెడ్డి భార్యకు ఇచ్చానని వెంకట నారాయణరెడ్డి తెలిపారు. అందులో 8 ఎకరాలను ఎమ్మెల్యే అయిన తన అల్లుడు అమ్ముకున్నారని వెల్లడించారు. తానిచ్చిన పదెకరాల్లో 8 ఎకరాలు పోగా మిగిలిన రెండు ఎకరాల్లో తన కుమార్తె, అల్లుడు ఇల్లు నిర్మించుకుంటున్నారని తెలిపారు. అయితే ఈ భూమిని కాజేసేందుకే తన కుమారుడు శ్రీధర్‌రెడ్డి ఆత్మహత్య డ్రామాకు తెరలేపాడని వెంకట నారాయణ రెడ్డి మండిపడ్డారు.

ఈ మొత్తం వివాదంలో తన కొడుకు శ్రీధర్‌రెడ్డి మామ, మాజీ జెడ్పీ చైర్మన్‌ సుబ్రమణ్యంరెడ్డి కారణమని వెంకట నారాయణరెడ్డి ఆరోపించారు. మరోవైపు తన కుమారుడి వ్యవహారంపై ఆయన శ్రీకాళహస్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

కాగా వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి తనకు బదులుగా తన కుమార్తె బియ్యపు పవిత్రా రెడ్డిని పోటీ చేయించాలనే యోచనలో మధుసూదన్‌రెడ్డి ఉన్నారు. ఇప్పటికే పవిత్ర నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తుండటం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.