Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: జీఎస్ఎల్ వీ -ఎఫ్ 10ప్రయోగం విఫలం.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   12 Aug 2021 9:33 AM IST
బ్రేకింగ్: జీఎస్ఎల్ వీ -ఎఫ్ 10ప్రయోగం విఫలం.. ఎందుకంటే?
X
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ ఎఫ్10 ప్రయోగం తాజాగా ఫెయిల్ అయ్యింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం అనుకున్నట్లుగా సాగి విజయవంతమైతే.. భూ పరిశీలన.. నీటి వనరులు.. అడవులు.. పంటలు.. హిమనీ నదాలు సరిహద్దుల్లో అంచనాకు వీలయ్యేది. ఈ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని నిరంతరం అందించేది. అయితే.. ప్రయోగం ప్రారంభమైన కాసేపటికే ఇది ఫెయిల్ అయినట్లుగా తేలింది.

ఈ రోజు (గురువారం) ఉదయం 5.43 గంటలకు నెల్లూరు లోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ స్టేషన్ నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. బుధవారం ఉదయం 3.43 గంటల నుంచి ఈ ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ మొదలైంది. 26 గంటల పాటు సాగిన కౌంట్ డౌన్ పూర్తయి.. ప్రయోగం ప్రారంభమైంది. నింగికి ఎగిసిన ఈ రాకెట్ కు సంబంధించి క్రయోజనిక్ దశలో సమస్య తలెత్తింది. దీంతో.. వాహకనౌక ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలోకి వెళ్లింది.

మూడో దశలో తలెత్తిన సాంకేతిక సమస్యతో.. ఈ ప్రయోగం ఫెయిల్ అయినట్లుగా ఇస్రో ఛైర్మన్ శివన్ వెల్లడించారు. వాస్తవానికి ఈ ప్రయోగాన్ని గత ఏడాది మార్చిలోనే చేపట్టాలని నిర్ణయించారు. అయితే.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు.. సాంకేతిక సమస్యల్ని గుర్తించి ప్రయోగాన్ని నిలిపివేశారు. ఈ ప్రయోగం సక్సెస్ అయి ఉంటే.. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రక్రతి వైపరీత్యాల్ని ముందే పసిగట్టే అవకాశం ఉండేది. తప్పనిసరిగా విజయవంతం అవుతుందని భావించిన ప్రయోగం.. అందుకు భిన్నంగా ఫెయిల్ కావటంతో ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. లైవ్ సోర్సును నిలిపివేశారు.