Begin typing your search above and press return to search.

బాహుబ‌లి రాకెట్ ప్ర‌యోగం స్పెష‌ల్ ఎందుకు?

By:  Tupaki Desk   |   5 Jun 2017 5:41 AM GMT
బాహుబ‌లి రాకెట్ ప్ర‌యోగం స్పెష‌ల్ ఎందుకు?
X
అంత‌రిక్ష ప్ర‌యోగాల్లో ఇస్రో ను వంక పెట్టేందుకు లేదు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న భార‌త అంత‌రిక్ష‌ ప‌రిశోధ‌న సంస్థ తాజాగా మ‌రో ప్ర‌యోగానికి సిద్ధ‌మైంది. అయితే.. ఈ ప్ర‌యోగం కాస్త భిన్న‌మైన‌ది. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిపిన ప్ర‌యోగాల కంటే క‌ష్ట‌మైన‌.. క్లిష్ట‌మైన‌ది. ఆదివారం మొద‌లైన కౌంట్ డౌన్ ఈ రోజు సాయంత్రం 5.28 గంట‌ల‌కు పూర్తయి.. అంత‌రిక్షంలోకి దూసుకెళ్ల‌నుంది. ఇందుకు సంబంధించిన తుది ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. బాహుబ‌లి రాకెట్ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్న మార్క్ 3డీ1 ప్ర‌యోగం మీద చాలానే ఆశ‌లు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

వ‌రుస విజ‌యాల‌తో మాంచి ఊపు మీదున్న ఇస్రో.. తాజా ప్ర‌యోగంపై అంత‌రిక్ష ప‌రిశోధ‌కులు ఎందుకంత టెన్ష‌న్‌ గా ఉన్నార‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఇప్ప‌టివ‌ర‌కూ ఇస్రో రూపొందించిన రాకెట్ల‌న్నీ మొద‌టి ప్ర‌య‌త్నంలో విఫ‌ల‌మ‌య్యాయి. ఈ సెంటిమెంట్‌ ను ఇస్రో ఈసారి అధిగ‌మిస్తుందా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. అయితే.. ఇటీవ‌ల కాలంలో పెరిగిన ఆత్మ‌విశ్వాసం.. వ‌రుస విజ‌యాల నేప‌థ్యంలో తాజా ప్ర‌యోగంతో చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయాల‌ని ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

దాదాపు రెండు ద‌శాబ్దాల కృషితో రూపొందించిన జియో సింక్ర‌న‌స్ ఉప‌గ్ర‌హ ప్ర‌యోగ వాహ‌న నౌక మార్క్ 3డీ1 నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. మిగిలిన ప్ర‌యోగాల‌కు తాజా ప్ర‌యోగానికి మ‌ధ్య‌నున్న పెద్ద వ్య‌త్యాసం ఏమిటంటే.. ఇస్రో ప్ర‌యోగించిన రాకెట్ల‌లో ఇదే అత్యంత పెద్ద‌ది కావ‌టం ఒక‌టైతే.. భారీ ఉప‌గ్ర‌హాల‌ను క‌క్ష్య‌లోకి పంపేందుకు ఇస్రో ఇప్ప‌టివ‌ర‌కూ ఏరియ‌న్ రాకెట్‌ పై ఆధార‌ప‌డుతుంది.

తాజా ప్ర‌యోగం స‌క్సెస్ అయితే.. ఇక ఆ అవ‌సమే ఉండ‌దు. అంతేకాదు.. ఒక్కో ప్ర‌యోగానికి దాదాపు రూ.400 కోట్ల మేర ఖ‌ర్చు కూడా త‌గ్గుతుంది కూడా. 4500 - 5వేల కిలోల ఇన్ శాట్ 4 త‌ర‌హా ఉప‌గ్ర‌హాల్ని కూడా క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టే స్థాయికి ఇస్రో ఎదుగుతుంది. అంతేనా.. మాన‌వ స‌హిత అంత‌రిక్ష ప్ర‌యోగాల‌కు వీలు క‌లుగుతుంది. రానున్న రోజుల్లో గురుడు.. శుక్రుడు లాంటి గ్ర‌హాల వ‌ద్ద‌కు వ్యోమ‌నౌక‌ల‌ను పంపే వీలు ఉంటుంది.

ఇస్రో ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌యోగించిన రాకెట్ల‌లో కెల్లా పెద్ద‌ది తాజా జీఎస్ఎల్‌వీ రాకెట్‌. ఇది 3,136 కేజీల బ‌రువుతో ఉన్న జీశాట్ 19 ఉప‌గ్ర‌హం క‌క్ష్య‌లోకి విజ‌య‌వంతంగా ప్ర‌వేశ పెడితే.. హైస్పీడ్ ఇంట‌ర్నెట్.. క‌మ్యూనికేష‌న్ల వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌స్తుంది. 4జీ సాంకేతిక‌త మ‌రింత మెరుగుప‌డ‌నుంది. అంతేకాదు.. పాత‌త‌రానికి చెందిన ఐదారు క‌మ్యూనికేష‌న్ ఉప‌గ్ర‌హాలు అందించే సేవ‌ల్ని ఈ ఒక్క‌టే అందించ‌గ‌లుగుతుంది. దాదాపు ప‌దేళ్ల పాటు సేవ‌లు అందించే స‌త్తా ఉన్న ఈ రాకెట్ ప్ర‌యోగం క‌చ్ఛితంగా స‌క్సెస్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుందాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/