Begin typing your search above and press return to search.

బండి సెటైర్ మామూలుగా లేదుగా? తర్వాతి పీసీసీ చీఫ్ కేసీఆర్

By:  Tupaki Desk   |   15 Feb 2022 4:28 AM GMT
బండి సెటైర్ మామూలుగా లేదుగా? తర్వాతి పీసీసీ చీఫ్ కేసీఆర్
X
రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. అలానే శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటం.. అప్పటివరకు వినిపిస్తున్న వాదనలకు భిన్నమైన నిర్ణయాలు తీసుకోవటం కనిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అదిరే పంచ్ విసిరారు.

సోషల్ మీడియాను వేదికగా చేసుకున్న ఆయన.. కేసీఆర్ మీద భారీ సెటైర్ విసిరారు. ప్రగతిభవన్ నుంచి గాంధీ భవన్ కు కేసీఆర్ మారబోతున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. కేసీఆర్ కు 10 జన్ పథ్ నుంచి స్క్రిప్టు వస్తున్నట్లుగా పేర్కొన్నారు. అందుకే.. కేసీఆర్ అలా మాట్లాడుతున్నట్లుగా వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థతో పాటు ప్రధాని.. ఇతర వ్యవస్థలపై కేసీఆర్ కు నమ్మకం లేదన్న బండి.. రఫెల్ స్కాం విషయంలో సుప్రీంతీర్పును కేసీఆర్ ధిక్కరిస్తున్నారన్నారు.

రఫెల్ విషయంపై నోరు జారితే రఫెల్ రెక్కలకు కేసీఆర్ ను కడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టటం.. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మీద ఘాటు విమర్శలు చేయటం.. సర్జికల్ స్ట్రైక్స్ మీద ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ పైన కేంద్ర మంత్రులు.. బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఎదురుదాడికి దిగుతున్నారు. ఇలాంటి వేళ బండి సంజయ్ గళం విప్పారు.

సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతున్నప్పుడు చూస్తే కానీ కేసీఆర్ కు నమ్మకం కలగదేమో అన్న ఆయన.. తమపై దాడి జరిగిందని పాకిస్థాన్ ప్రకటించినా కేసీఆర్ నమ్మదా? అని బండి ప్రశ్నించారు. కేసీఆర్ వ్యాఖ్యలు సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని.. కేసీఆర్ వ్యాఖ్యలపై దేశ భక్తులంతా బాధ పడుతున్నారన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని సీఎం కేసీఆర్ అంటున్నారని.. కానీ అలాంటి అక్రమాలు జరగలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వైనాన్ని గుర్తు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత దేశమంతా సంబరాలు జరుపుకుందన్న బండి.. జవాన్ల త్యాగాన్ని కించపరిచేలా మాట్లాడటం దేశ ద్రోహమే అవుతుందన్నారు.

‘ఆయన సైనికుల మాటల్ని నమ్మరు. ప్రధాని మాటల్ని నమ్మరు. పాక్ అధికారులు చెప్పినా కూడా నమ్మరా? సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని కేసీఆర్ వ్యాఖ్యానించటం సరికాదు. కేసీఆర్ ఏ దేశానికి మద్దతుగా మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డ బండి.. ఈ సందర్భంగా సర్జికల్ స్ట్రైక్స్ వీడియో క్లిప్పింగ్ ను.. పాకిస్థాన్ చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియోల్ని ప్రదర్శించారు. ఇటీవల కాలంలో 10 జన్ పథ్ నుంచి వచ్చిన స్క్రిప్టులతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర విభజన వేళలో సోనియాగాంధీని కేసీఆర్ పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలని కోరటం.. అందుకు సోనియా ఒప్పుకోలేదన్నారు. ఇక.. ఇప్పుడైతే ప్రగతి భవన్ నుంచి నేరుగా గాంధీ భవన్ కు కేసీఆర్ పోతారన్నారు. యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కార్మిక శాఖా మంత్రిగా ఉన్న వేళలో.. ఆయన పని తీరుపై అప్పటి ప్రధాని మన్మోహన్ కు స్వయంగా క్షమాపణలు చెప్పిన వైనాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. గతంలో కేసీఆర్ ను సీబీఐ అధికారులు ఒకరోజు విచారించిన వైనాన్నిప్రసతావిస్తూ.. సహారా స్కాంలో సీబీఐ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించారన్నారు. కేసీఆర్ అత్యంత అవినీతిపరుడిగా అభివర్ణించారు.