Begin typing your search above and press return to search.

ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయాల్సింది జగన్ కదా వంశీ?

By:  Tupaki Desk   |   18 Oct 2022 5:24 AM GMT
ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయాల్సింది జగన్ కదా వంశీ?
X
తొందరపడి కోయిల ముందే కూసిందన్న సామెతెను గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాటలు. టీడీపీ బొమ్మ మీద 2019 ఎన్నికల్లో గెలిచిన ఆయన.. పార్టీ మారటం.. తనకు టికెట్ ఇచ్చి తాను ఎమ్మెల్యే అయ్యేందుకు అవకాశం ఇచ్చిన చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా ఉండటమే కాదు.. ఆయన పలుమార్లు తీవ్రంగా నొచ్చుకోవటానికి కారణమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వల్లభనేని వంశీ. పార్టీ మారటమైతే మారారు కానీ.. తాను విడిచిపెట్టి వచ్చిన పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవిని మాత్రం వదలకుండా తన వద్దే భద్రంగా ఉంచుకున్నారు.

పార్టీ మారారు కానీ.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ రచ్చే అన్న అపవాదును వైసీపీలోనూ మోస్తున్నారు. పార్టీలోకి వచ్చినంతనే.. వైసీపీని నమ్ముకొని ఎప్పటినుంచో ఉంటున్న యార్లగడ్డ వెంకట్రావుతో పంచాయితీ పెట్టుకున్నారు. పార్టీ మారిన వంశీ కారణంగా తన రాజకీయ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తున్న వంశీపై యార్లగడ్డ వర్గీయులు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇలాంటివేళ.. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇస్తారు? ఎవరికి ఇవ్వరు? అన్న విషయంలో వైసీపీ అధినేత జగన్ కు మినహా మరెవరికీ క్లారిటీ లేదన్న సంగతి తెలిసిందే.

ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కాని రీతిలో ఉండే జగన్ తీరును వంశీ పసిగడతారా? అన్నది ప్రశ్నే. చంద్రబాబును డీల్ చేసిన రీతిలో జగన్ ను డీల్ చేయటం సాధ్యం కాదన్న విషయాన్ని వంశీ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని.. ఆ విషయంలో మరో మాటకు అవకాశం లేదని స్పష్టం చేశారు.

అయితే.. జగన్ తీరు గురించి తెలిసిన వారు.. ఆయన మైండ్ సెట్ మీద అవగాహన ఉన్న వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయరంటున్నారు. తనకు వర్గ రాజకీయాలు కొత్త కాదని.. టీడీపీలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో పలు వర్గాలు ఉన్నాయని చెబుతున్న వల్లభనేని వంశీ.. వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ కాదన్న విషయాన్ని వంశీ మర్చిపోతున్నారని చెబుతున్నారు. తాను తీసుకోవాల్సిన నిర్ణయాన్ని..

తాను చేయాల్సిన ప్రకటనను తాను చేయకుండా.. తనకు బదులుగా పార్టీ నేతలు చెప్పటాన్ని ఇష్టపడని జగన్ మైండ్ సెట్ గురించి తెలిసి కూడా వల్లభనేని వంశీ తన మాటలతో అధినేతను కెలికారన్న మాట పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఒకవేళ ఆ వాదనే నిజమైతే.. వల్లభనేని వంశీకి షాకు తప్పదన్న మాట వినిపిస్తోంది. అయితే.. దీనికి కాలమే సరైన సమాధానం చెబుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.