Begin typing your search above and press return to search.

తాలిబన్లకే చుక్కులు చూపుతున్నదా ?

By:  Tupaki Desk   |   14 Oct 2021 8:15 AM GMT
తాలిబన్లకే చుక్కులు చూపుతున్నదా ?
X
ప్రపంచ దేశాల్లో తీవ్రవాద సంస్ధలకు సంబంధించి తాలిబన్ అంటే వణుకుపుడుతుంది. అలాంటి తాలిబన్లు ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో అధికారాన్ని కబ్జా చేసేశారు. ఒకపుడు తాలిబన్లకు కంటిలో నలుసుగా మారిన పంజ్ షీర్ గ్రూపు కూడా తలవంచింది. దాంతో దేశం మొత్తం మీద తాలిబన్లకు ఎదురన్నదే లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో యావత్ ప్రపంచాన్ని వణికించేస్తున్నా తాలిబన్లకు కూడా మరో ఉగ్రవాద సంస్థ చుక్కలు చూపిస్తోంది. అదే ఇస్లామిక్ స్టేట్ ( ఐఎస్).

తాలిబన్లు దేశంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రతిరోజు దేశంలోని చాలా చోట్ల తాలిబన్లనే టార్గెట్ చేసుకుని ఐఎస్ దాడులు చేస్తునే ఉంది. మామూలు జనాలను తాలిబన్లు ఏవో నిబంధనల పేరుతో ఎటాక్ చేస్తుంటే తాలిబన్లను ఐఎస్ గ్రూపు ఎటాక్ చేస్తోంది. రోజుకు కనీసం డజను మంది తాలిబన్ ఉగ్రవాదులను చంపటమే టార్గెట్ గా ఐఎస్ దాడులు చేస్తోంది. స్ధూలంగా చూస్తే రెండు సంస్థలు కూడా ఉగ్రవాద సంస్ధలే. కానీ తాలిబన్లు తమ అధికారాన్ని కేవలం ఆప్ఘనిస్థాన్ కు మాత్రమే పరిమితం చేశారు. అదే ఐఎస్ మాత్రం యావత్ ప్రపంచాన్ని ఇస్లామిక్ స్టేట్ (ఖలీఫా రాజ్యం)గా మార్చేయాలని కంకణం కట్టుకున్నది.

రెండు సంస్థలు కూడా షరియా అంటే మతపరమైన చట్టాలను చాలా కఠినంగా అమలు చేయాలని కోరుకుంటున్న సంస్ధలే. ఒకపుడు అంటే అధికారంలో లేని రోజుల్లో కూడా తాలిబన్లు కేవలం ఆఫ్ఘన్ కు మాత్రమే పరిమితమయ్యారు. పరోక్షంగా ఇతర దేశాల్లోని ఉగ్రవాద సంస్ధలకు పూర్తి సహకారాన్ని అందించేవారు. కానీ ఐఎస్ మాత్రం సిరియా, ఇరాక్ లను ఆక్రమించుకుని ప్రపంచదేశాల్లో వణుకుపుట్టించింది. ప్రపంచంలో ఖలీఫా రాజ్యం మాత్రమే పరిపాలనలో ఉండాలనేది ఐఎస్ గట్టి నమ్మకం.

దీంతో మతపరమైన షరియా చట్టాల అమలులో తాలిబన్ల కన్నా ఐఎస్ పదాకులు ఎక్కువే చదివింది. అందుకనే ఐఎస్ ను వ్యతిరేకించే దేశాలను, పాలకులను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇలాంటి అనేక కారణాలతో తమతో విభేదించిన తాలిబన్లకు ఇపుడు ఐఎస్ చుక్కలు చూపిస్తోంది. దేశంలో అధికార పగ్గాలు అందుకున్నామన్న సంతోషం కూడా తాలిబన్లకు లేకుండా ఐఎస్ చేస్తున్నది.

ఏరోజు తమలో ఎవరిపైన ఐఎస్ గ్రూపు దాడిచేస్తుందో తెలీక తాలిబన్ల నేతలు టెన్షన్ పడుతున్నారు. ప్రధానంగా ఉత్తర, దక్షిణ ఆఫ్ఘన్ ప్రాంతాల్లో ఎక్కువగా ఐఎస్ గ్రూపు దాడులు చేస్తోంది. ఏదోరోజు సెంట్రల్ ఆఫ్ఘన్లో కూడా దాడులు మొదలుపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే అధికారంలో ఉన్నామన్న పేరు తప్ప ఇంకెందులోను తాలిబన్లకు ప్రశాంతత లేకుండా పోయిందనే చెప్పాలి. మొత్తానికి ప్రపంచానికి తాలిబన్లు ఒకపుడు చుక్కలు చూపిస్తే ఇపుడు తాలిబన్లకే ఐఎస్ చుక్కలు చూపిస్తోందన్నది వాస్తవం.