Begin typing your search above and press return to search.

బాంబుల కార్లను అమెరికాకు పంపుతారట

By:  Tupaki Desk   |   15 Sep 2015 2:53 PM GMT


తమ దుర్మార్గపు చేష్టలతో ప్రపంచానికి పెనుముప్పుగా వాటిల్లిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల దురాగతాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాను తీవ్రంగా హెచ్చరిస్తూ ఐసిస్ తీవ్రవాదులు ఒక వీడియోను విడుదల చేశారు.

ట్విన్ టవర్ లతో మహా విధ్వంసానికి పాల్పడి వేలాది మంది అమెరికన్ల మరణానికి కారణమైన పేలుళ్లను ప్రస్తావిస్తూ.. అలాంటి ఘటనలే మళ్లీ పునరావృతం చేస్తామంటూ ఐసిస్ హెచ్చరించటం గమనార్హం. అంతేకాదు.. అమెరికాకు మానవ బాంబుల్ని.. బాంబులతో నిండిన కార్లను అమెరికాకు పంపి విధ్వంసం సృష్టించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచంలోని జిహాదీలంతా ఏకం కావాలని.. అల్లా సైనికులు సిద్ధంగా ఉండి అమెరికాపై దాడులు చేస్తామంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేశారు. అందులో జీపుల్లో ఉగ్రవాదులు వెళుతున్న దృశ్యాలతో పాటు.. ట్విన్ టవర్ లు కూలిపోతుంటే.. దాని ముందు కూర్చొని అమెరికాను హెచ్చరించిన బిన్ లాడెన్ దృశ్యాల్ని వీడియోలో ఉంచటం గమనార్హం. తాజాగా విడుదలైన ఈ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది.