Begin typing your search above and press return to search.

అంత సాహ‌సం చేస్తున్న జ‌గ‌న్‌!

By:  Tupaki Desk   |   20 Jun 2019 11:00 PM IST
అంత సాహ‌సం చేస్తున్న జ‌గ‌న్‌!
X
తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌పై కేసీఆర్ ఉద్య‌మం చేస్తున్న వేళ‌.. ఇంకాస్త వివ‌రంగా చెప్పాలంటే 2006-07 కాలంలో జ‌రిగిన ఉదంతంగా దీన్ని చెప్పాలి. అప్ప‌ట్లో ఎవ‌రైనా ఔత్సాహిక జ‌ర్న‌లిస్టులు ఢిల్లీ కాంగ్రెస్ నేత‌ల‌తో తెలంగాణ ఉద్య‌మం గురించి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ప్ర‌శ్న‌లు వేసిన‌ప్పుడు వారి వింత‌గా చూసేవారు. మీకో ఇష్యూ కావాలి. మీరు మాట్లాడుకుంటారు. కానీ.. మాకు జ‌ర‌గ‌ని విష‌యాల మీద దృష్టి సారించాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చేసేవారు. పేప‌ర్లో చాలా వార్త‌లు వ‌స్తున్నాయి క‌దా? సోనియాగాంధీ ఈ అంశాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్లుగా చెప్పే మాట‌ల్లోనూ నిజం లేదా? అంటే.. కాస్త చిరాగ్గా చూస్తే.. ఒక‌సారి చెబితే అర్థం కాదా? అన్న‌ట్లుగా ఒక చూపు చూసి.. ఆమెకు మ‌రే ప‌ని లేదా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశ‌మే ఉందా? అని ఎదురు ప్ర‌శ్న వేసేవారు.

తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో సోనియాకు అత్యంత స‌న్నిహితుల నోటి నుంచి మాట‌లు.. 2011 నాటికి సీన్ మొత్తం మారిపోయింది. ఇదంతా ఎందుకు చెప్ప‌టం అంటే.. రాజ‌కీయాల్లో ఏది సాధ్యం కాద‌న్న‌ది ఎంత నిజ‌మో ఏదీ అసాధ్యం కాద‌న్న‌ది కూడా అంతే నిజం. తెలంగాణ సెంటిమెంట్ ప్ర‌జ‌ల్లో మ‌స్తుగా ఉన్నా పాల‌కుల‌కు అదేమీ ప్రాధాన్య‌త అంశం కాన‌ప్ప‌టికీ టీఆర్ఎస్ అధినేత అదే ప‌నిగా వివిధ వేదిక‌ల మీద ప్ర‌స్తావిస్తూ ఉండేవారు.

తెలంగాణ క‌థ‌ను చెప్పే క్ర‌మంలో ఆయ‌న భావోద్వేగాన్ని రంగ‌రించ‌టంతో పాటు.. తాను వినిపిస్తున్న వాద‌న నిజ‌మ‌న్న విష‌యాన్ని అర్థ‌మ‌య్యేందుకు వీలుగా కొన్ని గ‌ణాంకాల్ని ప్ర‌స్తావించేవారు. ఇక‌.. ప్ర‌తి విష‌యంలోనూ త‌మ‌కు జ‌రిగిన అన్యాయం ఏమిటో చెప్పే ప్ర‌య‌త్నం చేసేవారు. దీంతో.. తెలంగాణ‌కు చాలా అన్యాయం జ‌రిగింద‌న్న వాద‌న‌తో పాటు.. కేసీఆర్ మాట‌ల మీద గురి ఏర్ప‌డ‌టం మొద‌లైంది. తొలుత తెలంగాణ ఇష్యూను వినేందుకు తీరిక లేని సోనియా.. త‌ర్వాతి కాలంలో ఆ అంశం మీద పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు నిర్వ‌హించాల్సి వ‌చ్చేది. ఒక‌ప్పుడు తెలంగాణ ఏర్పాటు ప్ర‌స్తావ‌న తెచ్చినంత‌నే ఒక చూపు చూసే సోనియా.. చివ‌ర‌కు త‌న‌కు తానే ఇవ్వ‌టం కాదు.. అందుకోసం పార్ల‌మెంటు త‌లుపులు మూసి.. లైవ్ క‌ట్ చేసి మ‌రీ చేసిన ప్ర‌య‌త్నాన్ని మ‌ర్చిపోలేం.

ఇదంతా ఎందుకంటే..కొన్ని వాద‌న‌లు.. వాదాలు మొద‌ట్లో పెద్ద‌గా ప‌ట్ట‌వు. కానీ.. అదే ప‌నిగా ప్ర‌స్తావిస్తున్న‌ప్పుడు వాటికొచ్చే ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇదే తీరును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఏపీకి రావాల్సిన ప్ర‌త్యేక హోదా మీద ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చూస్తే.. ఎంతో సాహ‌సోపేతమైన చ‌ర్య‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఎందుకంటే.. కేసీఆర్ తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్న‌ప్పుడు ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు. దీన్ని సీరియ‌స్ గా తీసుకున్న‌ది లేదు. కాంగ్రెస్ ఏ రోజూ తెలంగాణ ఇవ్వ‌న‌ని చెప్పింది లేదు. కానీ.. హోదా విష‌యంలో వ్య‌వ‌హారం కాస్త వేరు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతూ ప్ర‌తి వేదిక మీద మాట్లాడుతున్న జ‌గ‌న్‌.. ఇప్పుడు ఏపీ సీఎం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. హోదా అన్న‌ది ముగిసిన కార్య‌క్ర‌మంగా బీజేపీ ఇప్ప‌టికే వంద‌సార్లు చెప్పేసింది.
ఆ మాట చెప్పిన త‌ర్వాత ఎన్నిక‌ల‌కు వెళ్లింది కూడా. ఇలాంట‌ప్పుడు హోదా విష‌య‌మై అదే ప‌నిగా ప్ర‌స్తావించే వారిపై మోడీకి కోపం రావ‌టానికి ఎక్కువ అవ‌కాశం ఉంది. మోడీ లాంటి నేత‌కు త‌న‌కిష్టం లేని అంశాల్ని అదే ప‌నిగా ప్ర‌స్తావించ‌టాన్ని అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. ఆయ‌న‌కు కోపం వస్తే ప‌రిణామాలు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇలాంటి వేళ‌.. తానిచ్చిన మాట‌కు వెన‌క్కి త‌గ్గ‌కుండా అదే ప‌నిగా మోడీ నేతృత్వం వ‌హించే స‌మావేశాల్లో ప్ర‌త్యేక హోదా ప్ర‌స్తావ‌న‌ను తీసుకురావ‌ట‌మే కాదు.. ఏపీకి ఎంత అవ‌స‌రం అన్న విష‌యాన్ని ఆయ‌న ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా చెబుతున్న తీరు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఏమైనా ఏపీకి హోదా సాధ‌న కోసం జ‌గ‌న్ చాలానే రిస్క్ తీసుకుంటున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.