Begin typing your search above and press return to search.

విశాఖ అంతలా భయపెడుతోందా... ?

By:  Tupaki Desk   |   23 Oct 2021 10:30 AM GMT
విశాఖ అంతలా భయపెడుతోందా... ?
X
జగన్ ముఖ్యమంత్రి. ఆయన రెండున్నరేళ్ళుగా తనదైన శైలిలో పాలన చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల బిల్లుని తీసుకువచ్చారు. తద్వారా విశాఖ ఎంతో కాలంగా ఆశపడుతున్న రాజధాని కోరిక తీర్చారు. అయితే ఈ చట్టం న్యాయ సమీక్షలో ఉంది. దాంతో అమలుకు నోచుకోలేదు. మొత్తానికి జగన్ తాను విశాఖ మీద ప్రేమను చాటుకున్నారు. తన పరిధిలో చేయాల్సింది చేశారు. ఇక జగన్ మనసు ఎపుడూ విశాఖ మీదనే ఉందని వైసీపీ వర్గాలు ఎపుడూ అంటూ ఉంటాయి. అలాంటిది చూస్తే జగన్ విశాఖ రావడానికి మాత్రం ఎందుకో ఎపుడూ పెద్దగా ఉత్సాహం చూపిన దాఖలాలు లేవు. ఆయనతో పోలిస్తే ఈ విషయంలో చంద్రబాబే బెటర్ అని కూడా అంటారు.

చంద్రబాబు అయిదేళ్ల పాలనలో విశాఖకు లెక్కలేనన్ని సార్లు వచ్చారు 2024 అక్టోబర్ లో విశాఖ హుదూద్ తుఫాన్ కి విలవిలలాడితే ఆయన వారం రోజుల పాటు అక్కడే మకాం వేశారు. ఇక జాతీయ అంతర్జాతీయ సదస్సులు కూడా అనేకం విశాఖలో చంద్రబాబు నిర్వహించారు. మంత్రి వర్గం తొలి సమావేశం కూడా బాబు విశాఖలోనే పెట్టారు. మరి బాబుతో పోలిస్తే జగన్ ఎపుడూ కూడా విశాఖలో ఒక్క రాత్రి కూడా బస చేసింది లేదు. ఆయన విపక్ష నేతగా ఉన్నపుడు కూడా ఇలా వచ్చి ఆలా వెళ్లిపోయేవారు.

ఇక ముఖ్యమంత్రి అయ్యాక సగం పాలన పూర్తయ్యాక చూసుకుంటే జగన్ గట్టిగా అరడజన్ సార్లు కూడా విశాఖలో టూర్ చేసింది లేదనే అంటారు. ఇక తాజాగా జగన్ విశాఖ టూర్ ఉంది అనుకుంటే చివరి నిముషంలో రద్దు అయిపోయింది. జగన్ విశాఖ వస్తారని వైసీపీ వర్గాలు చాలా ఆసక్తిగా చూశాయి. జగన్ వస్తే ఏమైనా అభివృద్ధి గురించి చెబుతారేమోనని విశాఖ వాసులు కూడా ఎదురుచూశారు. ఇక జగన్ టూర్ ఉందని తెలిసి చాలా రోజులుగా అందరూ కష్టపడ్డారు. అలాంటిది జగన్ సడెన్ గా విశాఖ పర్యటనను రద్దు చేసుకోవడంతో అంతా నిరాశకు గురి అవుతున్నారు.

మరో వైపు చూస్తే జగన్ విశాఖ ఎందుకు రావడంలేదు, ఆయన ఎంతో ఇష్టపడి రాజధానిగా ప్రకటించిన సిటీకి రావడానికి ఎందుకు త‌టపటాయిస్తున్నారు అన్న చర్చ కూడా సాగుతోంది. నిజానికి విశాఖ అంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఉత్సాహమే చూపుతారు. పని ఉన్నా లేకున్నా కూడా రావాలనుకుంటారు. జగన్ తీరు మాత్రం భిన్నంగా ఉందనే అంటున్నారు. అయితే దీని మీద కూడా కొంత ప్రచారం అయితే ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం పీక్స్ లో ఉంది. జగన్ విశాఖ వస్తే కలవాలని కార్మిక సంఘాలు అనుకుంటున్నాయి. కేంద్రం అయితే ప్రైవేటీకరణకు కట్టుబడిఉంది. ఆ దిశగా జోరు చేస్తోంది. దాంతో జగన్ ఈ విషయం మీద మాట్లాడాల్సి ఉంటుంది.

అలాగే విశాఖ రాజధాని విషయంలో కూడా అయాన ఏదో ఒకటి చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంలో మాట్లాడడం అయితే జగన్ కి ఈ సమయంలో ఇష్టం లేదనే అంటున్నారు. ఇక ఏపీలో రాజకీయ పరిణామాలు చూస్తే ఒక్క సారిగా వేడెక్కాయి. దాంతో జగన్ విశాఖ టూర్ లో ఆ ప్రభావం పడి ఏమైనా అనుకోని ఘటనలు జరిగుతాయన్న నివేదికలు ఏమైనా ఉండి జగన్ టూర్ రద్దు చేసుకున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. మొత్తానికి జగన్ విశాఖ టూర్ గత కొన్ని నెలలుగా ఎప్పటికపుడు వాయిదా పడుతూనే ఉంది. దాంతో విశాఖ వాసులతో పాటు పార్టీ నేతలు కూడా నిరాశ చెందుతున్నారు. మరి జగన్ విశాఖ ఈసారి అయినా కచ్చితంగా వచ్చే డేట్ ని ప్రకటించాలని అంతా కోరుతున్నారు.