Begin typing your search above and press return to search.

పవన్ పై వీర్రాజుకు అనుమానముందా ?

By:  Tupaki Desk   |   21 Jan 2022 4:35 AM GMT
పవన్ పై వీర్రాజుకు అనుమానముందా ?
X
బీజేపీ, జనసేన పార్టీలు రెండు కలిసే ఉన్నాయని ఒకసారి చెబుతారు. జనసేన తమ మిత్రపక్షమే అని మరో మారు చెబుతారు. తమ రెండు పార్టీలు కలిసే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తాయని ఇంకోసారి అంటారు. తాజాగా కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ జనసేన తమ మిత్రపక్షమే అని మరోసారి చెప్పారు. ఇదంతా వివిధ సందర్భంగా బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చెప్పిన మాటలే. ఇదంతా చూస్తుంటే జనసేనపై బీజేపీలో అనుమానాలున్నాయేమో అనిపిస్తోంది.

లేకపోతే మిత్రపక్షాన్ని పట్టుకుని ఇన్నిసార్లు జనసేన తమకు మిత్రపక్షమే అని పదే పదే చెప్పాల్సిన అవసరం వీర్రాజుకు ఏమొచ్చింది . మరీ ముఖ్యంగా కుప్పం పర్యటనలో పవన్ కు చంద్రబాబు నాయుడు పంపిన లవ్ ప్రపోజల్ తర్వాత వీర్రాజు భజన మరీ ఎక్కువైపోయింది. చూస్తుంటే పవన్ పైన బీజేపీలో అనుమానాలు పెరిగిపోతున్నట్లే ఉంది. మొదటే మిత్రపక్షాల వ్యవహారం అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే రెండు పార్టీలు పేరుకు మిత్రపక్షాలే కానీ ఎప్పుడు కలిసిలేవు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనల కార్యక్రమాలను కూడా రెండు పార్టీలు దేనికదే నిర్వహిస్తున్నాయి. రెండు పార్టీలు నిర్వహించే ఆందోళనల్లో పొరపాటున కూడా రెండో పార్టీ పేరు ప్రస్తావించటం లేదు. ఒక పార్టీ చేస్తున్న ఆందోళనలకు రెండో పార్టీ నేతలను పిలవటం లేదు. ఇలాంటి అనేక ఘటనల తర్వాత పేరుకు మాత్రమే రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయని అందరికీ అర్ధమైపోయింది. మొన్ననే జరిగిన బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి పోటీచేశారు. ఆ ఉపఎన్నికలో పవన్ ఒక్కసారి కూడా ప్రచారానికి రాలేదు.

అలాగే తర్వాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కొన్నిచోట్ల జనసేన అభ్యర్ధులు టీడీపీతో కలిసి పోటీ చేశారు. పేరుకు మిత్రపక్షమే అయినా ఎక్కడా బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే పవన్ కు చంద్రబాబు పంపిన లవ్ ప్రపోజల్ ఒకటి. దాంతో ఎప్పుడైనా పవన్ తమతో బంధాన్ని తెంపుకుంటాడేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నట్లున్నాయి. అందుకనే పవన్ను ఫిక్స్ చేయటంలో భాగంగా వీర్రాజు పదే పదే జనసేన తమకు మిత్రపక్షమని చెబుతున్నారు. మరి అతుకుల బొంత ఎంతకాలముంటుందో చూడాలి.