Begin typing your search above and press return to search.

ట్రంప్ కు అసలు కరోనా వచ్చిందా?

By:  Tupaki Desk   |   6 Oct 2020 1:40 PM IST
ట్రంప్ కు అసలు కరోనా వచ్చిందా?
X
ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనాకు చిన్నా.. పెద్దా అన్న తేడా లేదన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మాయదారి వైరస్ కారణంగా ప్రముఖులకు సోకటమే కాదు.. దీనికి బలైనోళ్లు తక్కువేం కాదు. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారికి కరోనా వస్తే ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నది చూశాం. అలాంటిది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు కరోనా వచ్చిందంటూ సాగిన ఎపిసోడ్ ను చూస్తే మాత్రం బోలెడన్ని సందేహాలు రాక మానవు.

ఎందుకంటే.. ట్రంప్ నకు కరోనా వచ్చిందన్నది నిజమే అయినప్పుడు.. ఆయనకు తీవ్రత ఎక్కువగా ఉందని.. 48 గంటల వరకు తామేమీ చెప్పలేమని వైద్యులు చెప్పిన తర్వాత.. ఆయన చేసిన పనులు ఇప్పుడు కొత్త సందేహాలకు తావిచ్చేలా ఉన్నాయి. ఓవైపు పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే వినియోగించే మందుల్ని ట్రంప్ నకు వాడుతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ఆయనేమో.. తన మద్దతుదారుల్ని కలుసుకునేందుకు కారులో బయటకు రావటం సంచలనంగా మారింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులకు కరోనా వచ్చింది. వారెవరూ చేయని సిత్రమైన పనుల్ని చేశారు ట్రంప్. అంతేనా.. తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వైట్ హౌస్ లో వారం పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఎప్పటిలానే తన విధుల్ని నిర్వర్తించొచ్చని చెబుతున్నారు. కరోనా బారిన పడి.. డిశ్చార్జి అవుతున్నందుకు తాను సంతోషంగా ఉన్నట్లుగా ట్రంప్ పేర్కొన్నారు.

కొవిడ్ గురించి ఎవరూ భయపడొద్దన్న ఆయన.. మన జీవితాలపై వైరస్ అధిపత్యం ప్రదర్శించకుండా చూసుకోవాలన్న మాట చెప్పారు. ఆసుపత్రిలో నాలుగు రోజుల పాటు కరోనా చికిత్స పొందిన ట్రంప్.. ఏ సందర్బంలోనూ ఆయనకు ముప్పు పొంచి ఉందన్నట్లుగా వ్యవహరించింది లేదు. ఆ మాటకు వస్తే.. ట్రంప్ కు కరోనా డేంజర్ ఎంతన్న విషయం వాస్తవం కంటే వార్తల్లోనే ఎక్కువగా కనిపించిందన్న విమర్శ వినిపిస్తోంది. ఏమైనా.. ట్రంప్ చేతలు ఏవీ.. కరోనా వచ్చినట్లుగా ఉన్నట్లు లేదంటున్నారు. ఈ దేవ రహస్యాన్ని ఏ మీడియా సంస్థో తేలిస్తే తప్పించి.. అసలు విషయం బయటకు వచ్చేలా లేదని చెప్పక తప్పదు.