Begin typing your search above and press return to search.

సర్వే: తెలంగాణలో షర్మిల పార్టీ ప్రభావం ఎంత?

By:  Tupaki Desk   |   10 July 2021 2:30 AM GMT
సర్వే: తెలంగాణలో షర్మిల పార్టీ ప్రభావం ఎంత?
X
ఆంధ్రా ఆడకూతురు.. తెలంగాణ కోడలుగా వచ్చి ఇక్కడ రాజకీయం చేయడానికి పార్టీ ప్రారంభించింది. సహజంగానే తెలంగాణ ప్రజల్లో ఆంధ్రావారిపై ఒకరకమైన ద్వేషభావమే ఉండేది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు ఆంధ్రా నేతలు అన్యాయం చేశారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆంధ్రా నేతల పాలనకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం పుట్టింది. టీఆర్ఎస్ ఆవిర్భవించి స్వరాష్ట్ర పాలన కోసం ఆంధ్రా నేతలతోనే పోరాడింది. దీంతో సహజంగానే తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్రా నేతలు రాణించడం అంత ఈజీ కాదు.. ఈక్రమంలోనే వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టేసింది.

తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల పార్టీ ప్రభావం ఎంత? ఆమె ఎంత వరకు తెలంగాణలో సత్తా చాటుతుంది? తెలంగాణ రాజకీయాలను ఏలే సత్తా షర్మిలకు ఉందా? రాష్ట్రంలో అధికారం చేపట్టగలదా? షర్మిల బలాబలాలు ఏమిటీ? అన్న దానిపై తాజాగా జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం ఆత్మీయంగా ఉంటుంది. నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు. నచ్చకపోతే పాతరేస్తారు. వారికి ఏదైనా ఎక్కువే అంటారు. ఇక్కడి నీళ్లు, నిధులు, నియామకాల కోసం దశాబ్ధాలుగా ఆంధ్రా నేతలతో పోరాడి చివరకు రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ క్రమంలోనే అభివృద్ధి , ఉద్యోగాల్లో చాలా వివక్షకు గురయ్యారు. అందుకే ఆంధ్రా నేతల వాసననే ఇక్కడి ప్రజలు గిట్టడం లేదు. సహించడం లేదని పోయిన ఎన్నికల్లో రుజువైంది.

అంతదాకా ఎందుకు.. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆంధ్రాప్రజలు నివసిస్తున్నారు. వారు తెలంగాణ వాసులుగానే ఇక్కడ స్థిరపడిపోయారు. తెలంగాణ సంస్కృతిలో ఇమిడిపోయారు. హైదరాబాద్ మహానగర ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ను, ప్రతిపక్ష బీజేపీని గెలిపించారే కానీ.. ఆంధ్రా పార్టీ అయిన తెలుగుదేశంను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుతో జట్టు కట్టిన పాపానికి ప్రతిపక్ష కాంగ్రెస్ ను సైతం ఓడించారు. అంటే తెలంగాణ ప్రజలు ఇక్కడి పార్టీలకే పట్టం కడుతారని తేటతెల్లమైంది. అయినా ఆంధ్రుల ఆశ చావడం లేదు.

తాజాగా తెలంగాణ ఇంటి కోడలుగా మారిన ఏపీ సీఎం జగన్ చెల్లెలు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టేశారు. 'రాజన్న రాజ్యం' తెస్తానంటూ ఆంధ్రా నేత పాలన వైభవాన్ని కొనియాడారు. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు, ఉద్యోగాలు ఇవ్వని సర్కార్ పై పోరాడుతానని అన్నారు. దీంతో షర్మిల ప్రభావం ఉంటుందా? ఉండదా? అన్న దానిపై తాజాగా మా 'తుపాకీ.కామ్' పోల్ నిర్వహించింది. 'తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల స్థాపించే పార్టీ ప్రభావం ఉంటుందా?' అని పాఠకులకు ప్రశ్న సంధించగా ఆశ్చర్యకరమైన స్పందన వచ్చింది..

'తుపాకీ' సర్వేలో ఏకంగా 77.75 శాతం మంది వైఎస్ షర్మిల పార్టీ ప్రభావం తెలంగాణలో అస్సలు ఉండదంటూ కుండబద్దలు కొట్టారు. ఆమెకు మనుగడ కష్టమన్నారు. ఈ సర్వేలో మెజార్టీ పీపుల్ షర్మిల తెలంగాణలో రాజకీయంగా రాణించలేదని తేల్చారు.

ఇక తెలంగాణలో షర్మిల పార్టీ ప్రభావం ఉంటుందని 18.56 శాతం మంది అభిప్రాయపడ్డారు. షర్మిల రాకను స్వాగతించారు.వీరు కేవలం 20శాతం లోపువారే ఉండడంతో షర్మిల పార్టీకి అంతగా భవిష్యత్ లేదని అర్థమవుతోంది.

ఇక ఈ సందిగ్ధ స్థితిలో తాము ఏమీ చెప్పలేమని షర్మిల పార్టీపై 3.69శాతం మంది సమాధానం దాటవేశారు. ఇది చాలా స్వల్ప సంఖ్య ఉండడంతో వీరి అభిప్రాయం పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా ఉంది.పాఠకుల అభిప్రాయాన్ని బట్టి షర్మిల పార్టీకి తెలంగాణలో అంత ఈజీ కాదని తేటతెల్లమైంది. అయితే ఆంధ్రా ప్రాబల్య హైదరాబాద్, ఖమ్మం లాంటిచోట్ల షర్మిల ప్రభావం కనిపించొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.