Begin typing your search above and press return to search.

పవన్ సోషల్ ఇంజనీరింగ్ ఇదే... ?

By:  Tupaki Desk   |   7 Oct 2021 6:45 AM GMT
పవన్ సోషల్ ఇంజనీరింగ్ ఇదే... ?
X
ఏపీలో కులాల కుంపట్లు ఉన్నాయి. రాజకీయం అంటేనే సంకుల సమరం అని చెప్పాలి. ఏపీలో చూసుకుంటే గత మూడున్నర దశాబ్దాలుగా ప్రత్యక్షంగా కుల రాజకీయం కీలక పాత్ర పోషిస్తోంది. 1983లో ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ పెట్టడం వెనక ఒక బలమైన సామాజిక వర్గం ఉందన్న మాట వినిపించినా కూడా నాడు అన్న గారిని అందరూ ఆదరించారు. ఆయన అందరివాడుగానే రాజకీయ అరంగ్రేట్రం చేశారు. టీడీపీ రాక ముందు కాంగ్రెస్ లో రెడ్లు బలమైన నేతలుగా రాజకీయాలను శాసించించా కాంగ్రెస్ కూడా కులం కంపు కొట్టలేదు. ఏపీకి ఆ చీడ పట్టలేదు. ఎపుడైతే టీడీపీ ఏర్పాటు అయిందో పరోక్షంగా కులం కీలకం అయింది. ఆ తరువాత అంటే 1988 నాటికి అది మరింతగా ముందుకు వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా దారుణ హత్య తరువాత కాపులు ఏపీ రాజకీయాల్లో మరింత చైతన్యం అయ్యారని చెప్పాలి.

ఆ తరువాత కాపులు తమ రాజకీయ వాటా గురించి మరింతగా డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఒక తడవ కాంగ్రెస్, మరో తడవ టీడీపీగా ఉమ్మడి ఏపీలో అధికార రాజకీయాలు సాగిపోయాయి. పైగా 23 జిల్లాల ఏపీలో ఎన్నో కులాలు ఉన్నాయి. దాంతో 2008లో ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవికి కాపుల మద్దతు దక్కినా అధికారంలోకి రాలేకపోయారు. ఇక 2014లో జనసేనకు ఏర్పాటు చేసిన పవన్ అప్పట్లో పోటీ చేయలేదు. 2019 నాటికి ఆయన బరిలో ఉన్నా కులాలకు తాను దూరమని చెప్పేశారు. ఈ పరిణామాల నేపధ్యంలో కాపులు తమకు తోచిన రాజకీయాన్నే చేసుకుంటూ పోయారు.

ఇపుడు మాత్రం అలా కాదు అన్న పరిస్థితి వచ్చేసింది. కాపులు తమ అస్థిత్వాన్ని రాజకీయంగా చాటుకోవడానికి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం రాజమండ్రీ సభలో డైరెక్ట్ అయిపోయారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఆయన పిలుపు ఇచ్చారు. అంతే కాదు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ చేసిన సోషల్ ఇంజనీరింగ్ మాదిరిగా తాను చేయడం ద్వారా 2024లో అధికారంలోకి రావాలనుకుంటున్నారు. కాపులు కీలకమైన స్థానంలో ఉంటూనే బీసీలు, ఎస్టీలు, ఎస్టీలు, మైనారిటీలను కలుపుకోవడం ద్వారా ఏపీలో రాజ్యాధికారన్ని అందుకోవాలన్నది జనసేనాని ఎత్తుగడగా కనిపిస్తోంది.

ఏపీలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. ఆ తరువాత కాపులదే పెద్ద వాట. ఇక ఎస్సీస్, ఎస్టీలు, మైనారిటీలు ఏ వైపు ఉంటే వారిదే విజయం. ఇప్పటిదాకా ఈ వర్గాలు వైసీపీనే అంటిపెట్టుకుని ఉన్నాయి. మరి వారి నుంచి వేరు చేసి జనసేన దిశగా ఆకట్టుకోవాలి అనుకుంటే చాలా కష్టమైన పనే కానీ అసాధ్యం అయితే కాదు, ప్రస్తుతం ఈ సోషల్ ఇంజనీరింగ్ లోనే పవన్ బిజీగా ఉన్నారని అంటున్నారు. ఈ వర్గాలన్నీ సంఘటితమైతే వాటికి కాపులు నాయకత్వం వహిస్తే కచ్చితంగా పవన్ ఏపీకి కొత్త సీఎం అవుతారు. అయితే ఇది చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం ఎన్నో సమస్యలు ఉన్నాయి. బీసీలకు కాపులకు మధ్య విభేదాలు కొన్ని జిల్లాల్లో ఉన్నాయని ప్రచారం ఉంది. అలాగే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అంత తేలిగ్గా వైసీపీని వీడి రారు. మొత్తానికి ఈ ప్రయోగంలో పవన్ కేవలం కాపుల నాయకుడిగా మిగిలిపోతే ఆయన రాజకీయానికే అది ఇబ్బందికరం అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.