Begin typing your search above and press return to search.

వైసీపీకి మోడీ ఇచ్చిన ఆఫర్ ఇదేనా?

By:  Tupaki Desk   |   8 Oct 2020 3:26 PM IST
వైసీపీకి మోడీ ఇచ్చిన ఆఫర్ ఇదేనా?
X
ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ భేటి ముగిసింది. అయితే తెరవెనుక ఈ భేటిలో అసలు సంగతులు ఏమిటన్నది బయటకు రాలేదు. అయితే వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం కేంద్ర మంత్రివర్గంలో చేరాలని పీఎం నరేంద్ర మోడీ వైఎస్‌ఆర్‌సి పార్టీకి ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. రెండు కేంద్ర మంత్రి పదవులు ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఆఫర్‌పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ ప్రకారం.. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరమని మోడీ తాజా భేటిలో జగన్ ను ఆహ్వానించారు, అయితే జగన్ ఆంధ్రప్రదేశ్ కు ఏదో ఒక రూపంలో లేదా మరొకటి ప్రత్యేక కేటగిరీ హోదాను ఇస్తే తాను ఈ ప్రతిపాదనను అంగీకరిస్తానని చెప్పాడని మీడియాలో మరో చర్చ జరుగుతోంది.

ఈ దశలో ఎన్డీఏ ప్రభుత్వంలో చేరడానికి వైసీపీ ఆసక్తి చూపకపోతే, కనీసం ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖాళీగా ఉన్న లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని అంగీకరించాలని జగన్‌ ను మోడీ కోరినట్టు సమాచారం. జగన్ కు చాలా సన్నిహితుడైన వైసీపీ ఎంపీ పి మిథున్ రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామని మోడీ సూచించారు.ఈ విషయంపై సీఎం జగన్ తక్షణం స్పందించకుండా పార్టీలో ఈ విషయం పై చర్చించిన తరువాత కాల్ చేస్తానని ప్రధానితో చెప్పారని సమాచారం.

1999 లో కూడా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, అప్పటి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేరడానికి ఆయన నిరాకరించారు. బయటి నుండి మద్దతునిచ్చారు. ఫలితంగా నాడు వాజ్‌పేయి టిడిపికి లోక్‌సభ స్పీకర్ పోస్టును కేటాయించింది. పార్టీలో చర్చించిన తరువాత చంద్రబాబు ఈ ప్రతిపాదనను అంగీకరించారు. ఆ విధంగా జిఎంసి బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా చేశారు.

ఇప్పుడు జగన్ అదే చంద్రబాబు మోడల్‌ను అనుసరిస్తారా.. డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ను అంగీకరిస్తారా లేదా అలాంటి పదవులకు దూరంగా ఉంటారా అనేది చూడాలి.

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చాక భర్తీ కాలేదు. 470 రోజులకు పైగా ఖాళీగా ఉండటం ఇదే మొదటిసారి. ప్రస్తుతం లోక్ సభ డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోవడానికి వేళైంది. 1998 లో కూడా 260 రోజులకు పైగా ఈ పదవి ఖాళీగా ఉంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం, లోక్‌సభ సభలోని ఇద్దరు సభ్యులను వీలైనంత త్వరగా స్పీకర్‌గా, డిప్యూటీ స్పీకర్‌ గా ఎన్నుకుంటుంది. మునుపటి లోక్‌సభ లో ఎఐఎడిఎంకె నాయకుడు ఎం. తంబిదురై డిప్యూటీ స్పీకర్ పదవి కి పోటీ లేకుండా ఎన్నికయ్యారు.