Begin typing your search above and press return to search.

ఆ మంత్రి ఈసారి అవ‌నిగ‌డ్డ నుంచి పోటీ చేయ‌నున్నారా?

By:  Tupaki Desk   |   23 Aug 2022 12:30 PM GMT
ఆ మంత్రి ఈసారి అవ‌నిగ‌డ్డ నుంచి పోటీ చేయ‌నున్నారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి రాజ‌కీయాలు ప‌రిణామాలు వేగంగా మారిపోతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయా రాజ‌కీయ పార్టీలు త‌మ వ్యూహ‌, ప్ర‌తి వ్యూహాల‌కు ప‌దును పెట్టాయి. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్సీపీ ఈసారి కొంత‌మంది ఎమ్మెల్యేల‌ను వేరే నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేయిస్తుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇందులో భాగంగా ప‌ల్నాడు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే, రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు ఈసారి కృష్ణా జిల్లాలోని అవ‌నిగ‌డ్డ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దివంగ‌త నేత వంగ‌వీటి రంగా అనుచ‌రుడిగా రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన అంబ‌టి రాంబాబు 1989లో గుంటూరు జిల్లా రేప‌ల్లె నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999 ఎన్నిక‌ల్లో రేప‌ల్లె నుంచే పోటీ చేసిన అంబ‌టి రాంబాబు టీడీపీ అభ్య‌ర్థి ముమ్మ‌నేని వెంక‌ట సుబ్బ‌య్య చేతిలో ఓట‌మిపాల‌య్యారు. ఇక 2004లో అంబ‌టి రాంబాబు ఎక్కడా పోటీ చేయ‌లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రి కావ‌డంతో అంబ‌టి రాంబాబును ఆంధ్ర‌ప్ర‌దేశ్ పారిశ్రామిక మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న సంస్థ (ఏపీఐఐసీ) చైర్మ‌న్‌గా కేబినెట్ మంత్రి హోదాలో నియ‌మించారు.

2011లో వైఎస్ జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి వైఎస్సార్సీపీని ఏర్పాటు చేశాక అంబ‌టి రాంబాబు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. 2014 ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి నుంచి శాస‌న‌స‌భ‌కు పోటీ చేసి టీడీపీ అభ్య‌ర్థి కోడెల శివ‌ప్ర‌సాద్ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. అయితే 2019లో అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి శాస‌న‌స‌భకు ఎన్నిక‌య్యారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రెండోసారి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అంబ‌టి రాంబాబుకు కీల‌క‌మైన జ‌ల‌వ‌న‌రుల మంత్రిత్వ శాఖ ద‌క్కింది.

వైఎస్సార్సీపీ త‌ర‌ఫున అటు శాస‌న‌స‌భ‌లోనూ, ఇటు బ‌య‌ట‌ మీడియా ముందు ప్ర‌తిప‌క్షాల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసేవారిలో అంబ‌టి రాంబాబు ఒక‌రు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్‌పై గ‌తంలో అంబ‌టి చేసిన వ్యాఖ్య‌లు కాక‌రేపాయి. మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను అంబ‌టి త‌ర‌చూ విమ‌ర్శిస్తుండ‌టంపై జ‌న సైనికులు, మెగాభిమానులు కూడా ఆయ‌న‌పై ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆయ‌న‌ను ఓడిస్తామని ఇప్ప‌టికే చాలెంజులు చేశారు.

మ‌రోవైపు గ‌తంలో ఒక మ‌హిళ‌తో ఫోన్ కాల్ మాట్లాడుతూ అంబ‌టి స‌ర‌సాలాడార‌ని చెప్పుకుంటున్న ఆడియో క్లిప్ వైర‌ల్ అయ్యింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అంబ‌టి రాంబాబును కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ నుంచి శాస‌న‌స‌భ‌కు పోటీ చేయిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అవ‌నిగ‌డ్డ‌లో కాపు సామాజిక‌వ‌ర్గం ఎక్కువ‌గా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వివిధ పార్టీల త‌ర‌ఫున కాపు అభ్య‌ర్థులే విజ‌యం సాధిస్తూ వస్తున్నారు. ప్ర‌స్తుతం సింహాద్రి ర‌మేష్ బాబు వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అంబ‌టి రాంబాబును బరిలోకి దించుతార‌ని చెబుతున్నారు. అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం.. రేప‌ల్లెకు పొరుగున ఉండే నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం గ‌మ‌నార్హం. ఇక అంబ‌టి అవ‌నిగ‌డ్డ నుంచి పోటీ చేస్తే ప్ర‌స్తుత ఎమ్మెల్యే ర‌మేష్ బాబుకు ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇస్తార‌ని చెబుతున్నారు.