Begin typing your search above and press return to search.

ఆ వివాదాస్ప‌ద ఎమ్మెల్సీని త‌ప్పించ‌డానికేనా ఇదంతా?

By:  Tupaki Desk   |   19 Aug 2022 5:38 AM GMT
ఆ వివాదాస్ప‌ద ఎమ్మెల్సీని త‌ప్పించ‌డానికేనా ఇదంతా?
X
తన మాజీ డ్రైవర్‌ సుబ్ర‌హ్మ‌ణ్యం హత్య కేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత్‌బాబు ప్ర‌స్తుతం జైలులో ఉన్న సంగ‌తి తెలిసిందే. ముందు సుబ్ర‌హ్మ‌ణ్యం ప్రమాదవశాత్తు చనిపోయాడని చెప్పిన అనంత్‌బాబు.. సుబ్ర‌హ్మ‌ణ్యం కుటుంబ సభ్యులు, ద‌ళిత సంఘాలు ఆందోళనకు దిగడంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి ఆయన రిమాండ్‌లో ఉన్నారు.

సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో పోలీసులు మే 23 అనంత్ బాబును అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి ఆయ‌న రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సెంట్ర‌ల్ జైలులో ఉంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మూడుసార్లు బెయిల్ కోసం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధ‌క న్యాయ‌స్థానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోగా .. మూడుసార్లు కోర్టు కొట్టేసింది. ఆయ‌న బ‌య‌ట‌కొస్తే సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశ‌ముంద‌న్న బాధితుల వాద‌న‌తో కోర్టు ఏకీభ‌వించింది.

మ‌రోవైపు సుబ్ర‌హ్మ‌ణ్యం కుటుంబ స‌భ్యులు అనంత్ బాబుకు బెయిల్ ఇవ్వ‌ద్ద‌ని న్యాయ‌మూర్తిని విన్న‌వించారు. ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ ను క‌ల‌సిన సుబ్ర‌హ్మ‌ణ్యం త‌ల్లిదండ్రులు అనంత్ బాబును ఎమ్మెల్సీ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని కోరారు. అంతేకాకుండా సీబీఐతో త‌న కుమారుడి హ‌త్య కేసును విచారించాల‌ని విన్న‌వించారు.

కాగా సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య మే 19న జ‌రిగింది. అయితే కేసులో అనంత్ బాబును అరెస్టు చేసి 88 రోజులు గ‌డిచినా పోలీసులు చార్జిషీట్ దాఖ‌లు చేయ‌క‌పోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అయిన సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు ఆయ‌న‌పై ఆగ‌స్టు 17న పోలీసులు చార్జిషీట్ దాఖ‌లు చేశారు. అయ‌తే ఆగ‌స్టు 18 శుక్ర‌వారం శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మితో కోర్టుకు సెల‌వు ఉంద‌ని అంటున్నారు. ఆగ‌స్టు 19న కోర్టు ప‌రిపాల‌న ప‌నులు మాత్ర‌మే ఉంటాయ‌ని స‌మాచారం. వాద‌న‌లు ఉండ‌వ‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్సీ అనంత్ బాబును వ్యూహాత్మ‌కంగా త‌ప్పించ‌డానికే ఇలా చేశార‌ని మాన‌వ హ‌క్కుల సంఘాలు, ఏపీ పౌర హ‌క్కుల సంఘం ఆరోపిస్తున్నాయి. 90 రోజుల్లోపు చార్జిషీట్ దాఖ‌లు చేయ‌క‌పోతే అనంత్ బాబుకు బెయిల్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. అందుకే పోలీసులు ఇలా చేశార‌ని విమ‌ర్శిస్తున్నారు.

అన్ని ఆధారాల‌తో అనంత్ బాబు త‌న డ్రైవ‌ర్ హ‌త్య కేసులో దొరికిపోయినా.. దాదాపు మూడు నెల‌ల‌పాటు చార్జిషీట్ దాఖ‌లు చేయ‌క‌పోవ‌డం దేనికి నిద‌ర్శ‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ అనంత్ బాబును ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌క‌పోవ‌డం కూడా స‌రికాద‌ని అంటున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు అనంత్ బాబు స‌న్నిహితుడు కావ‌డం వ‌ల్లే అత‌డి చార్జిషీట్‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా ఆల‌స్యం చేశార‌ని.. అనంత్ బాబుకు బెయిల్ వ‌చ్చేలా చేసి కేసును నీరుగార్చ‌డ‌మే దీని వెనుక ఉన్న ఉద్దేశ‌మ‌ని మాన‌వ హ‌క్కుల సంఘాలు, ద‌ళిత సంఘాలు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నాయి.