Begin typing your search above and press return to search.

టీడీపీతో పొత్తుపై ప‌వ‌న్ స‌స్పెన్స్ వెన‌క ఇంత ప్లాన్ ఉందా...!

By:  Tupaki Desk   |   15 Jan 2023 2:00 PM IST
టీడీపీతో పొత్తుపై ప‌వ‌న్ స‌స్పెన్స్ వెన‌క ఇంత ప్లాన్ ఉందా...!
X
ఇటీవ‌ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌లు భేటీ కావ‌డం.. దాదాపు రెండు గంట‌ల పాటు రాజ‌కీయాల‌పై చ‌ర్చించుకోవ‌డం.. ఉమ్మ‌డిగా ప్రెస్ ముందుకు రావ‌డం తెలిసిందే. దీంతో జ‌న‌సేన‌-టీడీపీల మ‌ధ్య పొత్తు పొడిచిందని.. అంద‌రూ అనుకున్నారు. ఆ వెంట‌నే త‌మ‌కు ఇన్ని సీట్లు కావాలంటూ.. ప‌వ‌న్ అభ్య‌ర్థించార‌ని.. కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇక‌, టీడీపీ నేత‌ల్లోనూ జోష్ పెరిగింది.

మ‌రోవైపు..జ‌న‌సేన‌లోనూ.. పొత్తుల ప‌ల్ల‌విపై రాగాలు అందుకున్నాయి. అయితే.. తాజాగా శ్రీకాకుళం జిల్లా ర‌ణ‌స్థలంలో నిర్వ‌హించిన యువ‌శ‌క్తి స‌భ‌లో ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌న‌కు అండ‌గా ఉంటాన‌ని.. అంటే.. తాను ఒంట‌రిగానే పోటీకి రెడీ అవుతాన‌ని చెప్పారు. త‌న‌కు మాత్రం పొత్తులు పెట్టుకోవాల‌ని ఉంటుందా? అని ప్ర‌శ్నించారు. ఆత్మ‌గౌర‌వాన్ని చంపుకోని ఏ ప‌ని చేయ‌నని తేల్చి చెప్పారు.

అంటే.. దీని అర్థం... ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి సంకేతాలు వ‌చ్చినా.. తాను పొత్తుల‌కు రెడీగా లేన‌ని.. లేదా.. జ‌న‌సేన పార్టీ పుంజుకుంటే.. పొత్తుల‌తో ప‌నిలేద‌ని ప‌వ‌న్ సంకేతాలు పంపించిన‌ట్టు అయింది. ఇది రెండుప‌క్క‌ల ప‌వ‌న్‌కే న‌ష్టం. ఎలాగంటే.. జ‌న‌సేన పొత్తు పెట్టుకునే ప‌రిస్థితి ఎలానూ త‌ప్ప‌దు. ఇదే జ‌రిగితే.. పార్టీ బ‌లంగా లేద‌ని స్వ‌యంగా ప‌వ‌నే ఒప్పుకొన్నట్టు అవుతుంది.

ఇది.. వైసీపీకి ఏరికోరి అడ్వాంటేజ్ ఇచ్చిన‌ట్టు అవుతుంది. ఇక‌, మ‌రోవైపు.. తాను ఆత్మ‌గౌర‌వం చంపుకొని పొత్తు పెట్టుకున్న‌ట్టు అవుతుంది. మ‌రి.. ఇది కూడా సునిశిత‌మైన అంశ‌మేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఏదేమైనా.. పొత్తుల‌పై ఇప్పుడే మాట్లాడ‌కుండా.. మౌనంగా అయినా ఉండి ఉండాల్సింద‌ని అంటున్నారు.