Begin typing your search above and press return to search.

చదువుకున్న ఆ కుటుంబంలో అంత మూఢత్వమా?

By:  Tupaki Desk   |   26 Jan 2021 10:00 AM IST
చదువుకున్న ఆ కుటుంబంలో అంత మూఢత్వమా?
X
విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. ఏ మాత్రం జీర్ణించుకోలేని రీతిలో ఉన్న అంశాలు చిత్తూరు జిల్లా మదనపల్లె శివారులో చోటు చేసుకున్న అక్కాచెల్లెళ్ల హత్య కేసులో వెలుగు చూస్తున్నాయి. ఎన్నో హత్య కేసుల్ని డీల్ చేసిన పోలీసులకు సైతం.. తాజా కేసు షాకింగ్ గా మారటమే కాదు.. సరికొత్తగా ఉందంటున్నారు. ఉన్నత విద్యావంతుల కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు అస్సలు మింగుడుపడటం లేనివిగా మారాయి. మూఢత్వాన్ని నిండుగా నింపుకున్న ఆ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు తెలుసుకున్న వారంత హడలిపోతున్నారు. ఇదెక్కడి పైత్యం రా బాబు.. అన్నట్లుగా పరిస్థితి ఉంది.

హత్యలకు గురైన అక్కాచెల్లెళ్లను కన్న తల్లే చంపినట్లుగా తొలుత పోలీసులు భావించారు. కానీ.. చెల్లెల్ల్ని అక్క చంపటం.. తనను చంపితే.. తాను వెళ్లి చెల్లెలు ఆత్మను తీసుకొస్తానని అక్క చెప్పినట్లుగా పోలీసుల విచారణలో తల్లి పద్మజ చెప్పినట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ కుటుంబంలోని వారంతా ఉన్నత విద్యా వంతులే. తండ్రి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ అయితే.. తల్లి మదనపల్లెలో పేరొందిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థకు కరస్పాండెంట్ కావటం గమనార్హం. ఈ సంస్థలో ప్రస్తుతం 800 మంది విద్యార్థులు చదువుతున్నారు.

పాతికేళ్ల క్రితం మదనపల్లెకు వచ్చిన వారు.. మూడేళ్ల క్రితం నగర శివారులో మూడంతస్తుల ఇల్లు నిర్మించుకున్నారు. ఇంటి మొత్తంలో వారే ఉండేవారు. ఇంట్లో తరచూ అధ్యాత్మిక అంశాలే చర్చకు వచ్చేవని..తలనొప్పి వచ్చినా.. జ్వరం వచ్చినా.. వాటిని తగ్గించటానికి మందుల కంటే బాబానే ఆదుకుంటారన్న ఆలోచనలో ఉండేవారు. రోజంతా ఉపవాసం ఉన్నా.. అదంతా బాబే వల్లే సాధ్యమని వారు చెప్పుకునే వారట.

వారం క్రితం అక్కాచెల్లెళ్లు ఇద్దరు పెంపుడు కుక్కను వాకింగ్ కు తీసుకెళ్లారు. రోడ్డులో వేసిన ముగ్గులో ఉంచిన నిమ్మకాయలు.. పసుపు.. కుంకుమలను తొక్కారని.. ఆ విషయాన్ని ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి ఏదో జరుగుతుందన్న భయం వారిని వెంటాడేదని చెబుతున్నారు. అప్పటి నుంచి వారు మౌనంగా ఉంటున్నారని.. ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని వారు చెప్పేవారంటున్నారు.

ఈ నేపథ్యంలో తమిళనాడు నుంచి ఒక మంత్రగాడిని సంప్రదించి తాయిత్తు వేసుకున్న వారు.. పిల్లలున్న పరిస్థితులతో వారం నుంచి తల్లిదండ్రులు ఇద్దరూ కాలేజీకి వెళ్లటం లేదని తేలింది. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో పూజలు చేస్తుండగా.. పై అంతస్తులో ఉన్న సాయి దివ్య ఉన్నట్లుండి కేకలు వేయటం.. మానసిక రోగిలా ప్రవర్తించింది. తల్లిదండ్రులు.. సోదరి ముగ్గురు కలిసి ఆమెకు దెయ్యం ఆవహించిందని డంబెల్ తో గట్టిగా కొట్టటంతో మరణించింది.

చనిపోయిన చెల్లెలు నుదిటి మీద ముగ్గులు వేసి.. ఆమె ఆత్మ బయటకు వెళ్లకుండా తాను బంధించినట్లు పేర్కొంది. ముగ్గురు నగ్నంగా ఇంట్లో పూజలు చేశారు. ఆమెను బతికించి తీసుకొస్తానని.. తనను చంపాలని తల్లిని కోరింది. దీంతో.. ఆమె నోట్లో చిన్న కలశం పెట్టి.. తల మీద డంబెల్ తో కొట్టటంతో ఆమె చనిపోయింది. అనంతరం వారి స్మార్ట్ ఫోన్లను పగులగొట్టారు.

అనంతరం పురుషోత్తం నాయుడు (తండ్రి) తన సహచర అధ్యాపకుడికి జరిగిన విషయాల్ని చెప్పగా.. ఆయన వచ్చి చూసి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. డెడ్ బాడీల్ని మార్చురీకి తరలిస్తుండగా.. తాను కాళికననని.. బిడ్డలిద్దరూ పుణ్యలోకాల్లో ఉన్నారని.. సోమవారం ఉదయాన్నే వారిని తాను బయటకు తీసుకొస్తానంటూ పెద్దగా అరుస్తూ.. అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు ఆమెను కట్టడి చేసి.. తరలించారు. ఊహకు అందని రీతిలో చోటు చేసుకున్న ఈ క్రైంకు సంబంధించి మరిన్ని విషయాలు బయటకు వస్తే కానీ.. మరింత క్లారిటీ రావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.