Begin typing your search above and press return to search.

ట్రంప్ చుట్టు ఉచ్చు బిగుసుకుంటోందా?

By:  Tupaki Desk   |   5 July 2022 3:57 AM GMT
ట్రంప్ చుట్టు ఉచ్చు బిగుసుకుంటోందా?
X
అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయటానికి మళ్ళీ రెడీ అవుతున్న అమెరికా మాజీ అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లే ఉంది. అధ్యక్షపదవి నుండి ట్రంప్ దిగిపోవాల్సొచ్చిన సమయంలో అమెరికన్ పార్లమెంటు భవనం క్యాపిటల్ హిల్స్ పై అల్లరి మూకలు దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అల్లరిమూకలు పార్లమెంటు భవనంలోకి యధేచ్చగా ప్రవేశించి అడ్డు అదుపులేకుండా విధ్వంసం సృష్టించారు.

2021, జనవరి 6వ తేదీన జరిగిన అప్పటి దాడి ఘటన అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. క్యాపిటల్ భవనంపై అల్లరిమూకలు చేసిన దాడివెనుక అప్పటికి అధ్యక్షుడిగా ఉన్న ట్రంపే కారణమని మెల్లిగా బయటపడుతోంది.

ఇప్పటివరకు జరిగిన విచారణలో ట్రంప్ ను దోషిగా నిలిపేందుకు అవసరమైన సాక్ష్యాలన్నీ విచారణ కమిటికి దొరుకుతోంది. అప్పటి వైట్ హౌస్ ఉద్యోగులు, క్యాపిటిల్ భవనం ఉద్యోగులు కూడా ట్రంప్ పాత్రనే నిర్ధారిస్తున్నారట.

అల్లర్లను నిలుపుదల చేసే అవకాశమున్నా ట్రంప్ ఆ పనిచేయలేదని సెక్యురిటి అధికారులు చెప్పారు. అసలు ట్రంప్ రెచ్చగొట్టడం వల్లే అల్లరిమూకలు విధ్వంసానికి పాల్పడ్డాయంటు అప్పటి సెక్యురిటి అధికారులు కూడా తమ సాక్ష్యాలను చెప్పారు.

అమెరికాలోని ఎక్కడెక్కడి అల్లరిమూకలను ట్రంపే వాషింగ్టన్ కు పిలిపించినట్లు బాగా ఆరోపణలున్నాయి. అప్పట్లో దాడులు ఏ స్ధాయిలో జరిగాయంటే ఎంపీలు ఎక్కడ దాక్కోవాలో తెలీక భయంతో చివరకు బాత్ రూముల్లో వెళ్ళిపోయి ప్రాణాలను కాపాడుకోవాల్సొచ్చింది. అలాగే ఎక్కడెక్కడో ఫర్నీచర్ కింద, వెనకాల దాక్కున్నారు.

అయితే తనకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న సాక్ష్యాలను ట్రంప్ కొట్టిపారేస్తున్నారు. 2020 ఓటమి గురించి ఆలోచించకుండా తాను 2024 ఎన్నికల్లో పోటీచేయటం ఖాయమని ట్రంప్ ప్రకటించేశారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే క్యాపిటల్ హిల్స్ భవనం మీద దాడి ఘటనలో ట్రంప్ పాత్ర ఆధారాలతో సహా బయటపడితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని కోల్పోవటం ఖాయమే అనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీచేయటం కాదు చివరకు జైలుకు వెళ్ళినా ఆశ్చర్యపోవక్కర్లేదు.