Begin typing your search above and press return to search.

ఆగష్టులో మరో సంక్షోభం తప్పదా ?

By:  Tupaki Desk   |   27 July 2022 5:20 AM GMT
ఆగష్టులో మరో సంక్షోభం తప్పదా ?
X
ఆగష్టు సంక్షోభం అంటే ఇదేదో రాజకీయ సంక్షోభం అనుకునేరు. ఎంతమాత్రం కాదు ఇది పూర్తిగా బొగ్గు సంక్షోభం. క్షేత్ర స్ధాయిలో పరిస్దితులను గమనిస్తుంటే మళ్ళీ విద్యుత్ కొరత తప్పదనే అనిపిస్తోంది.

బొగ్గు సంక్షోభం తలెత్తితే కానీ విద్యుత్ కొరత తలెత్తదు. అందుకనే దేశవ్యాప్తంగా మరోసారి బొగ్గు సంక్షోభం తలెత్తే అవకాశముందని నిపుణులు ఆందోళన పడుతున్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలను పెంచుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు పదే పదే సూచిస్తోంది.

సంప్రదాయ పద్దతులైన జలవిద్యుత్, పవన విద్యుత్ ద్వారా వచ్చే విద్యుత్ తక్కువన్న విషయం తెలిసిందే. బొగ్గు ఆధారంగా ఉత్పత్తయ్యే థర్మల్ విద్యుత్తే దేశంలో చాలా ఎక్కువ. మామూలుగా ఏ విద్యుత్ ఉత్తత్తి కేంద్రమైనా తన దగ్గర 21 రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గును 365 రోజులూ నిల్వ ఉంచుకోవాలి. అప్పుడే థర్మల్ విద్యుత్ ఉత్తత్తికి ఎలాంటి ఇబ్బందులుండవు. అలాకాకుంటే మాత్రం బొగ్గు కొరత ఉన్నట్లే అనుకోవాలి.

ఇపుడు దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలు 180 ఉన్నాయి. వీటిల్లో 74 కేంద్రాల్లో బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. సొంతంగా బొగ్గు గనులున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే మరి మిగిలిన కేంద్రాల పరిస్దితి ఏమిటి ? ఏమిటంటే విదేశాల నుండో లేకపోతే దేశీయంగానో బొగ్గును తెప్పించుకోవాల్సిందే.

ఇక్కడే దేశీయంగా ఉత్పత్తయ్యే బొగ్గు కోసం థర్మల్ విద్యుత్ కేంద్రాలు పోటీపడుతున్నాయి. పోటీ ఎక్కువైపోయి బొగ్గు సరఫరా సాధ్యం కావట్లేదు. అందుకనే విదేశీ బొగ్గు వైపు చూస్తున్నాయి.

విదేశాల నుండి బొగ్గంటే ఇండోనేషియా, ఆస్ట్రేలియా, రష్యా, ఉక్రెయిన్ నుండి మాత్రమే మనకు దిగుమతవుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పై రెండు దేశాల నుండి బొగ్గు ఆగిపోయింది. మిగిలిన దేశాలు కూడా మనకు బొగ్గుసరఫరాను కావాలనే తగ్గించేశాయి. దాంతో బొగ్గు కొరతతో పాటు ధరలు కూడా ఆకాశానికి చేరుకుంటున్నాయి. దీంతో బొగ్గు కొరత తప్పటంలేదు. చూస్తుంటే వర్షాకలంలో మళ్ళీ బొగ్గు కొరత తద్వారా విద్యుత్ కొరత తప్పేట్లులేదు.