Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కారుపై అంత భారీ కుట్ర జరిగిందా?

By:  Tupaki Desk   |   16 Aug 2019 6:01 AM GMT
కేసీఆర్ సర్కారుపై అంత భారీ కుట్ర జరిగిందా?
X
పంద్రాగస్టు సందర్భంగా రాజ్ భవన్ లో నిర్వహించే ఎట్ హోం కార్యక్రమం ఆసక్తికర అంశాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో రాష్ట్ర గవర్నర్.. సీఎంల మధ్య జరిగే తరచూ భేటీలు జరుగుతుంటాయి. ఆ సందర్భంలో గంటల కొద్దీ సమయాన్ని ఇద్దరు ప్రముఖులు గడుపుతుంటారు. తాజాగా తెలంగాణ గవర్నర్ వారు నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తో మాట్లాడిన మాటల్లో అప్పుడెప్పుడో జరిగిన ఇంటర్ రచ్చను సీఎం కేసీఆర్ గవర్నర్ వద్ద ప్రస్తావించారు.

ఇంటర్ ఫలితాల వెల్లడిలో అవకతవకలు చోటు చేసుకోవటం.. ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు వెలుగుచూడటం తెలిసిందే. కేసీఆర్ సర్కారు ఇమేజ్ ను డ్యామేజ్ చేసినట్లుగా చెప్పే ఈ ఉదంతాన్ని తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించటం విశేషం. ఇంటర్ పరీక్షల ఫలితాలకు సంబంధించిన వివాదం పెద్ద కుట్రగా కేసీఆర్ అభివర్ణించారు. కొందరు వ్యక్తులు.. పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు ఈ కథను నడిపినట్లుగా పేర్కొన్నారు.

సున్నితమైన అంశాన్ని పట్టుకొని రాద్దాంతం చేయటం.. విద్యార్థుల మనోభావాల్ని దెబ్బ తీయటానికి పూనుకోవటం వెనుక పెద్ద కుట్ర ఉందని.. తమ ప్రభుత్వం సకాలంలో రియాక్ట్ అయి.. దానిని కంట్రోల్ చేసినట్లుగా చెప్పుకున్నారు. ఈ వ్యవహారం దారుణమని.. ఇలాంటి కుట్రల్ని తమ ప్రభుత్వం తిప్పి కొడుతుందని గవర్నర్ వారితో కేసీఆర్ చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు చోటు చేసుకున్న ఉదంతంలో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం కేసీఆర్ సర్కారుకు మచ్చగా మారింది. అయితే.. ఈ ఉదంతం జరిగినప్పుడు సీఎం కేసీఆర్ స్పందించింది లేదని.. ప్రభుత్వం పరంగా తీసుకుంటున్న చర్యల గురించి మాట్లాడింది లేదన్న విమర్శలు ఉన్నాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అప్పుడు స్పందించని కేసీఆర్.. ఇప్పుడు ఎట్ హోం కార్యక్రమంలో మాత్రం గవర్నర్ వద్ద ఆవేదన వ్యక్తం చేసుకోవటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఇటీవల తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్రపతి కోవింద్ కు ఇంటర్ పరీక్షా ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై ఫిర్యాదు చేయటం.. దీనిపై రియాక్ట్ అయిన ఆయన.. ప్రభుత్వాన్ని వివరణ కోరటం తెలిసిందే. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో కేసీఆర్ ఇరుకున పడినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రపతి నేరుగా కలుగజేసుకున్న నేపథ్యంలో.. ఇంటర్ లోని కుట్ర కోణాన్ని కేసీఆర్ ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు. ప్రజలకు వివరణ ఇవ్వని సారు.. రాష్ట్రపతి రియాక్ట్ అయినంతనే మాత్రం కుట్ర కోణం గురించి చెప్పటం గమనార్హం.