Begin typing your search above and press return to search.

హనుమ మనవాడే.... టీటీడీ దూకుడు తో వివాదమేనా... ?

By:  Tupaki Desk   |   9 Feb 2022 11:30 AM GMT
హనుమ మనవాడే.... టీటీడీ దూకుడు తో వివాదమేనా... ?
X
దేవుడు అన్న వాడు ఎక్కడైనా ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి. ఇందుగలడు అందు లేడు అన్న సందేహమే వలదు అంటాడు. అలాంటి దేవుడి చిరునామాలు, పుట్టుపూర్వత్తరాలు వెతకడం అంటే అది దుస్సాహసమే. ఇక వాటి మీద ఎవరైనా కోరి మరీ వివాదాలకు కూడా అహ్వానించినట్లుగా ఉంటుంది. ఇదంతా ఎందుకు అంటే తిరుమల గిరుల మీద ఉన్న అంజనాద్రి హనుమంతుడి జన్మ స్థ‌లం అని టీటీడీ గట్టిగా నమ్ముతోంది. అయితే గతంలో టీటీడీ దీని మీద ప్రకటనలు చేయడంతోనే ఉత్తరాది ఆధ్యాత్మిక సంస్థల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

నాడు కొందరు పరిశోధకులు టీటీడీ వచ్చి దీని మీద చర్చలు కూడా జరిపారు. చివరికి ఇరు పక్షాల మధ్యన వాదనలే జరిగాయి తప్ప ఎవరూ కూడా తగ్గలేదు. తమదే కరెక్ట్ అని భావించారు. నిజానికి చూస్తే హనుమంతుడి పుట్టిన ప్రదేశాలుగా హంపీ దగ్గర ఉన్న విజయనగరం, కిష్కింద, నాసిక్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర సహా పలు ప్రాంతాల్లోని వాటిని అక్కడి వారు విశ్వసిస్తారు. అలాంటిది తిరుమల గిరుల మీద ఉన్న అంజనాద్రి మాత్రమే హనుమ పుట్టిన ప్రాంతం అంటే వారి మనోభావాలు కూడా దెబ్బతింటాయని చెబుతున్నారు.

అయితే టీటీడీ ఇపుడు దీని మీద ఒక పుస్తకం కూడా తీసుకురాబోతోంది. ఈ నెల 16న ఆ పుస్తకం ఆవిష్కరిస్తారు. అందులో హనుమ జన్మస్థలంగా అంజనాద్రిని గట్టిగా చెప్పబోతున్నారు. మరి ఈ పుస్తకం కనుక బయటకు వస్తే దాని మీద మరెన్ని వివాదాలు చేలరేగుతాయో అన్న సందేహాలు అయితే ఉన్నాయి.

ఇదిలా ఉంటే అంజనాద్రిని హనుమ పుట్టిన ప్రాంతంగా టీటీడీ నియమించిన కమిటీ గుర్తించింది. దాంతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టబోతున్నారు. యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దిన సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితోనే ఇక్కడ అభివృద్ధి పనులకు కూడా డిజైన్లు వేయించబోతున్నారుట.

అదే విధంగా అంజనాద్రి మీద అంజనాదేవితో పాటు బాలాంజనేయస్వామి వారి ఆలయాన్ని నిర్మిస్తారు. అలాగే ముఖ మండపం, గోపురం ఏర్పాటు చేసి దీని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారుట. ఇవన్నీ కూడా హనుమంతుడు ఇక్కడే పుట్టాడు అని చెప్పడానికి ఇక మీద హనుమ జన్మస్థలం అంటే ఇదేనని చాటడానికి టీటీడీ చేస్తున్న కార్యక్రమం. అయితే దీని మీదనే వివాదాలు కూడా ముసురుకుంటాయా అన్న డౌట్లు అయితే ఉన్నాయి.

ఇపుడు రాజకీయమే కాదు, ఆధ్యాత్మికం అయినా మరే రంగం అయినా కూడా వివాదాలకు లోటు లేదు, మరి టీటీడీ అయితే హనుమ మనవాడే అంటోంది. దాని మీద మిగిలిన ప్రాంతాల వారు ఎలా రియాక్ట్ అవుతారు అన్నదే అందరిలోనూ నెలకొన్న సందేహం. చూడాలి మరి.