Begin typing your search above and press return to search.

టీడీపీ బీజేపీ పొత్తుకు ఛాన్సే లేదా?

By:  Tupaki Desk   |   4 May 2022 12:26 PM IST
టీడీపీ బీజేపీ పొత్తుకు ఛాన్సే లేదా?
X
కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని బీజేపీ డిసైడ్ చేసింది. తనను కలసిన ఏపీ బీజేపీ నేతలకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇదే విషయమై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని రెండు కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నట్లు చెప్పారు. తమ పార్టీ రెండు కుటుంబ పార్టీలు అంటే వైసీపీ, టీడీపీలకు సమానదూరం పాటిస్తుందన్నారు.

ఇప్పటివరకు ప్రభుత్వంపై బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ప్రభుత్వపరంగా కేంద్ర-రాష్ట్రాల మధ్య సత్సంబంధాలున్నాయి. ఇదే సమయంలో పార్టీల పరంగా వైసీపీ-బీజేపీలు దేని దారిలో అవే నడుస్తున్నాయి.

జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై కమలనాథులు రెగ్యులర్ గా ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు తో పాటు టీడీపీ మీద కూడా వీర్రాజు ఆరోపణలతో విరుచుకుపడుతునే ఉన్నారు.

అయితే ఏదో రోజు టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు కుదురుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం ఎంతగా తుంగలో తొక్కేస్తున్నా చంద్రబాబు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. పెట్రోలు, డీజల్, వంటగ్యాస్ ధరల పెరుగుదల విషయంలో కూడా కేంద్రాన్ని కాకుండా జగన్నే టార్గెట్ చేస్తున్నారు. దీంతోనే బీజేపీతో పొత్తుపై చంద్రబాబు పెద్ద ఆశలే పెట్టుకున్నట్లు అర్ధమైపోతోంది.

ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉంది కాబట్టి పొత్తుల విషయం అంత తేలిగ్గా ఫైనల్ కాదని అందరికీ తెలిసిందే. ఒకవేళ బీజేపీ, టీడీపీ పొత్తు ఉండాలంటే అది నడ్డా స్థాయిలో జరిగే నిర్ణయం కాదు. నడ్డా పేరుకు మాత్రమే జాతీయ అధ్యక్షుడు అయినా వ్యవహారం నడిపించేదంతా నరేంద్ర మోడీ, అమిత్ షా మాత్రమే అని అందరికీ తెలిసిందే.

కాకపోతే ఈలోగా కుటుంబ పార్టీలకు బీజేపీ దూరమని ప్రకటిస్తుంటారు. ఈ మధ్య నరేంద్రమోడీనే స్వయంగా ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు కాబట్టి టీడీపీతో పొత్తు కష్టమనే అనిపిస్తోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.