Begin typing your search above and press return to search.

వైట్ హౌస్ స్టాఫ్..ట్రంప్ కేమీ తీసిపోరబ్బా!

By:  Tupaki Desk   |   31 Aug 2019 3:51 PM GMT
వైట్ హౌస్ స్టాఫ్..ట్రంప్ కేమీ తీసిపోరబ్బా!
X
డొనాల్డ్ ట్రంప్... అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ఈ రియట్ ఎస్టేట్ టైకూన్ టెర్న్ డ్ పొలిటీషియన్ వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్సేనని చెప్పాలి. అధ్యక్ష ఎన్నికల్లో తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్... వైరివర్గాల చేతిలో భారీగానే షాకులు తిన్నారు. అయితే ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో ఎలాగోలా గెలిచేసిన ట్రంప్... అమెరికా అధ్యక్షుడిగా వైట్ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత కూడా తన వైఖరినేమీ మార్చుకోలేదు. పాలనలో తనదైన శైలి నిర్ణయాలు తీసుకున్న ట్రంప్... అసలు ఈయనను ఎందుకు గెలిపించామా? అన్న భావన అమెరికన్లలో వచ్చేలా చేశారు. ఇంతటి వివాదాస్పద నేత కార్యాలయంలో పనిచేసే స్టాఫ్ కూడా ఆయనకేమీ తీసిపోరని నిరూపించారు. అధ్యక్షుడి కూతురు అని కూడా చూడకుండా ట్రంప్ డాటర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ట్రంప్ పీఏ ఒకరు ఏకంగా వైట్ హౌస్ నుంచే బహిష్కరణకు గురయ్యారు.

ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ కథాకమామీషు ఏమిటో చూద్దాం పదండి. వైట్ హౌస్ లో అడుగుపెట్టిన ట్రంప్ కు పీఏగా మ్యాడెలిన్ వెస్టర్ హౌట్ విధుల్లో చేరారు. ఆమె ఇటీవల ఓ పార్టీలో ఇతరులతో మాట్లాడుతూ - ట్రంప్ కుమార్తె టిఫానీ ఊబకాయంతో బాధపడేదని - అందుకే ఆమె ఫొటోలను చూడడానికి కూడా ట్రంప్ ఇష్టపడేవారు కాదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను వైట్ హౌస్ తీవ్రంగా పరిగణించింది. భవిష్యత్తులో మ్యాడెలిన్ వైట్ హౌస్ లో అడుగుపెట్టరాదని స్పష్టం చేసింది. అధ్యక్ష కార్యాలయానికి సంబంధించిన సమాచారం లీక్ చేసిందంటూ ఆమెపై ఆరోపణలు మోపింది.

దీనిపై ట్రంప్ కూడా స్పందించారు. తాను ఆమెతో మాట్లాడానని, ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని మ్యాడెలిన్ ఎంతో బాధపడుతున్నారని - ఆమె మద్యం సేవించి మాట్లాడినట్టు తెలిపారని ట్రంప్ వివరించారు. తనకు కుమార్తెలంటే చాలా ఇష్టమని - ఇలాంటి ఆరోపణలను తాను అంగీకరించనని స్పష్టం చేశారు. మొదటి నుంచి ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలిగా వ్యవహరిస్తున్న మ్యాడెలిన్ పనితీరుపై ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. ట్రంప్ కూడా ఎన్నోసార్లు తన పీఏ గురించి ప్రశంసించేవారు. అలాంటిది - ఉన్నట్టుండి ఆమెపై వేటు వేయడంతో విపక్షాలతో పాటు సొంత పార్టీలోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.