Begin typing your search above and press return to search.

ఆక్స్ ఫర్డ్ టీకా సక్సెస్ అయినట్లేనా ?

By:  Tupaki Desk   |   24 Nov 2020 11:30 AM IST
ఆక్స్ ఫర్డ్ టీకా సక్సెస్ అయినట్లేనా ?
X
కరోనా వైరస్ విరుగుడుగా బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటి తయారు చేస్తున్న విరుగుడు టీకా సక్సెస్ అయినట్లే ఉంది. ఎందుకంటే విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేస్తున్న శాస్త్రజ్ఞునులు ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. వైరస్ నుండి తాము తయారుచేసిన టీకా మెరుగైన రక్షణ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. టీకా పనితీరుపై బ్రెజిల్, బ్రిటన్ లో మూడోదశ క్లినికల్ ట్రయల్స్ 70 శాతం సూపర్ సక్సెస్ అయినట్లు విడుదల చేసిన తమ నివేదికలో స్పష్టంగా చెప్పారు.

అనుకున్నది అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలోనే ఈ టీకాను విడుదల చేయబోతున్నట్లు యూనివర్సిటి శాస్త్రజ్ఞులు ప్రకటించారు. కోవిడ్ 19 విరుగుడు టీకాను తయారు చేయటంలో తమ శాస్త్రజ్ఞుల బృందం విజయంసాధించినట్లు బ్రిటన్ వైద్య శాఖ మంత్రి మ్యాట్ హ్యాంకాక్ ప్రకటించటం గమనార్హం. 2021లో ఈ టీకాను భారీ మొత్తంలో రిలీజ్ చేయటానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా హ్యంకాక్ చెప్పారు. కోవిడ్ విరుగుడు టీకాను ఆస్ట్రాజెనికా అనే ఫార్మా కంపెనీతో కలిసి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటి రెడీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ జరుగుతున్న ప్రయోగాలు, క్లినికల్ ట్రయల్స్ ఫలితాలపై యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది.

క్లినికల్ ట్రయల్స్ ను బ్రెజిల్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 20 వేలమందిపై ప్రయోగిస్తున్నారు. మొదటి ట్రయల్స్ ను డోసులో సగం మాత్రమే ఇచ్చారు. డోసు పనితీరును నెల రోజుల పాటు పరీక్షించిన తర్వాత పూర్తిస్ధాయి డోసును ప్రయోగించారు. రెండోసారి ఇచ్చిన డోసు 90 శాతం మంచి ఫలితాలను ఇచ్చిందని నిపుణులు తమ పరీక్షల్లో గుర్తించారు. అయితే మొదటి రెండు డోసుల పనితీరుపై వచ్చిన వ్యత్యాసాలపైన కూడా శాస్త్రజ్ఞులు అధ్యయనం చేస్తున్నట్లు యూనివర్సిటి అధికారులు చెప్పారు.

తాము తయారు చేస్తున్న టీకా తదుపరి దశల క్లినికల్ ట్రయల్స్ ను భారత్, అమెరికా, కెన్యా, జపాన్ లోని 60 వేలమందిపై ప్రయోగించబోతున్నట్లు ప్రకటించారు. ఆక్స్ ఫర్డ్ తయారు చేస్తున్న కోవి షీల్డ్ టీకాను జనవరిలో మనదేశంలో అందుబాటులోకి తేవటానికి ప్రయత్నిస్తున్నట్లు సీరం ఇన్ స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాల తెలిపారు. సుమారు 10 కోట్ల డోసులను భారత్ కు తెప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 4 కోట్ల డోసులను తయారు చేసినట్లు పూనావాలా ప్రకటించారు. బయట మార్కెట్లో కోవీషీల్డ్ టీకా వెయ్యి రూపాయలుంటుందన్నారు. కానీ ప్రభుత్వానికి ఇదే టీకా 250 రూపాయలకే సరఫరా చేయబోతున్నట్లు కూడా చెప్పారు. మొత్తానికి జనవరిలో వైరస్ కు విరుగుడు టీకా రాబోతున్నందుకు అందరం సంతోషించాల్సిందే.