Begin typing your search above and press return to search.

కేసీఆర్ తో `బంధం` చెడిందా? జ‌గ‌న్ లేఖ వెనుక‌..!

By:  Tupaki Desk   |   3 July 2021 4:00 AM GMT
కేసీఆర్ తో `బంధం` చెడిందా?  జ‌గ‌న్ లేఖ వెనుక‌..!
X
రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న నీటి వివాదాల విష‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీ స‌హా కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రికి లేఖ రాయ‌డం ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. ఏపీ సీఎం జ‌గ‌న్‌కు, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మ‌ధ్య మంచి సంబంధాలు కొన‌సాగుతున్నాయ‌ని అంద‌రూ అనుకుంటున్న స‌మ‌యంలో అనూహ్యంగా తెర‌మీదికి వ‌చ్చిన నీటి వివాదాలు.. ఇద్ద‌రు సీఎంలు అనుస‌రిస్తున్న విధానం.. అనేక సందేహాల‌కు ఆస్కారం ఇస్తోంది. నిజానికి జ‌ల వివాదాలు ఇప్పుడు కొత్త‌కాదు. కానీ, ఇప్పుడు జ‌రుగుతున్న వివాదాలే సంచ‌ల‌నంగా మారుతున్నాయి.

ఏపీ, అయినా.. తెలంగాణ అయినా.. రాజ‌కీయాల‌కు అతీతం ఏమీ కాదు. ముఖ్యంగా అనుకూల నేత‌లు రాజ్య‌మేలుతున్న నేప‌థ్యంలో ఇప్పుడు వచ్చిన ఈ ప‌రిణామం వెనుక ఏదైనా రాజ‌కీయ కోణం ఉండే ఉంటుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఒక‌వైపు తెలంగాణ మంత్రులు సీరియ‌స్ వ్యాఖ్య‌లు చేస్తున్నా.. జ‌గ‌న్ మౌనంగా ఉండ‌డం.. మ‌రోవైపు సీఎం కేసీఆర్ 100 శాతం విద్యుత్ ఉత్ప‌త్తికి అధికారులను ఆదేశించ‌డం.. ప్రాజెక్టుల వ‌ద్ద‌.. పోలీసుల‌ను కూడా మోహ‌రించ‌డం వంటి ప‌రిణామాలు.. చూస్తే.. పైకి మాత్రం జ‌గ‌న్ ఇక‌, కేసీఆర్‌తో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీగా ఉన్నార‌ని కొంద‌రు అంటున్నారు.

కానీ, జ‌గ‌న్ వైఖ‌రి.. దీనికి సంబంధించి కీల‌క స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నిస్తే.. మాత్రం అలాకాదు.. ఇంకేదో ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. గ‌తంలో కేసీఆర్ నీటి వివాదాన్ని సామ‌ర‌స్య పూర్వ‌కంగా ప‌రిష్క‌రించుకుందామంటూ.. పిలుపు ఇచ్చిన విష‌యాన్ని.. సజ్జ‌ల గుర్తు చేశారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న ఎందుకు మ‌న‌సు మార్చుకుని క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో తెలియ‌డం లేద‌ని చెప్పారు. కానీ, అంత తెలియ‌కుండా.. అమాయ‌కంగా ఏపీ ప్ర‌భుత్వం ఉందా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఇదే నిజ‌మైతే.. రేపు ప్ర‌జ‌ల‌కు మ‌రేదైనా రాష్ట్రం క‌ష్టం క‌లిగించిన‌ప్పుడు కూడా ఈ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌నే అనుకోవాలి.

ఇక‌, కేంద్రానికి లేఖ రాయ‌డం అనేది గ‌తంలోనూ జ‌రిగిన ప‌రిణామ‌మే. మ‌హారాష్ట్ర‌తో ఆల్‌మ‌ట్టి వివాదం త‌లెత్తిన‌ప్పుడు.. అప్పటి సీఎం చంద్ర‌బాబు.. కేంద్రానికి లేఖ రాశారు. కానీ, కేంద్రం స్పందించ‌లేదు. ఇప్పుడు కూడా అదే జ‌రుగుతుంద‌ని.. విశ్లేష‌కులు భావిస్తున్నారు. అంటే.. ఏపీ సీఎం జ‌గ‌న్‌కు అన్నీ తెలిసే.. లేఖ సంధించార‌ని.. తాను చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు ఉండాల‌నే ప్ర‌చారం కోసం.. ఆయ‌న లేఖ రాసిన‌ట్టుగా ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో జ‌గ‌న్ అనుస‌రిస్తున్న తీరు.. కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కూడా అనేక సందేహాల‌కు తావిస్తోంద‌ని చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో కేసీఆర్‌తో అంత తేలిక‌గా.. జ‌గ‌న్ త‌న సంబంధాల‌ను తెంచుకోలేర‌ని.. అంటున్నారు. ఇదంతా కేవ‌లం.. ఒక వ్యూహం ప్ర‌కారం జ‌రుగుతున్న‌దిగా పేర్కొంటున్నారు.