Begin typing your search above and press return to search.

గ్రేటర్ లో పవన్ తో పోటీకి బీజేపీ అందుకే నో చెప్పిందా?

By:  Tupaki Desk   |   27 Nov 2020 10:02 AM IST
గ్రేటర్ లో పవన్ తో పోటీకి బీజేపీ అందుకే నో చెప్పిందా?
X
ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది బీజేపీ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి మాస్టర్ మైండ్ ను ఢీ కొట్టే విషయంలో కమలనాథులు పక్కాగా సిద్ధమయ్యారని చెబుతున్నారు. చిన్నతప్పు చేసినా భారీ మూల్యం చెల్లించాలన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్న మాటను రాష్ట్ర నేతలకు జాతీయ పార్టీ ముఖ్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రతి అంశంపైనా తాము నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లుగా తెలుస్తోంది.

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందని చెప్పి.. బరిలోకి దిగేందుకు జనసేన అధినేత పవన్ చెప్పినా.. ఆయన్ను చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పించటానికి పార్టీ అధినాయకత్వం నేరుగా రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. తొలుత కొన్ని స్థానాల్లో జనసేనతో కలిసి పోటీ చేయాలని భావించినా.. అది పార్టీకి ఇబ్బందిగా మారుతుందన్న విషయాన్ని గుర్తించిన ఢిల్లీ నాయకత్వం.. వెంటనే రాష్ట్ర పార్టీని అలెర్టు చేసినట్లుగా చెబుతున్నారు.

జనసేన బరిలోకి దిగిన వెంటనే.. అధికారపక్షం భావోద్వేగ అంశాల్ని తెర మీదకు తీసుకురావటం ఖాయమని.. ఎన్నికల ఎజెండా మారిపోవటంతో పాటు.. ఫోకస్ అంతా అనవసరమైన విషయాల మీదకు రావటంతో పాటు.. బీజేపీకి లేనిపోని అంశాల్ని అంటించే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు. అందుకే.. పోటీ చేస్తామని చెప్పి.. వెనక్కి తగ్గిన జనసేనకు జరిగే నష్టాన్ని తాము భవిష్యత్తులో పూడుస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీ మిత్రపక్షంగా గ్రేటర్ పరిస్థితిని ప్రత్యేకంగా తీసుకోవాలన్న మాటతో పవన్ కల్యాణ్ కూడా కన్వీన్స్ అయినట్లు చెబుతున్నారు.

పోటీచేసి గెలిచే స్థానాలు ఉంటాయా? అన్నది సందేహమే అయినప్పుడు.. బీజేపీ గెలుపు అవకాశాల్ని ప్రభావితం చేసేలా పోటీ చేయటం ఎందుకన్న వాదనకు పవన్ కల్యాణ్ అంగీకరించినట్లుగా చెబుతున్నారు. ముందుచూపుతో బీజేపీ అధినాయకత్వం వ్యవహరించటంతో టీఆర్ఎస్ అధినేతకు అవకాశం ఇవ్వకుండా కమలనాథులు జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతున్నారు. పవన్ ను గ్రేటర్ పోటీ నుంచి తప్పించటం ద్వారా.. గులాబీ దళానికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదంటున్నారు.