Begin typing your search above and press return to search.

ఇందుకేనా మోడి ఏపిని పట్టించుకోనిది ?

By:  Tupaki Desk   |   15 July 2021 4:32 AM GMT
ఇందుకేనా మోడి ఏపిని పట్టించుకోనిది ?
X
యావత్ దేశానికి తెలుసు ఏపి సంగతి. దేశం మొత్తంమీద ఏ రాష్ట్రంలో లేని రాజకీయ అనైక్యత ఏపిలో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఏ విషయంలో కూడా అధికార, ప్రతిపక్షాలకు ఏకాభిప్రాయం ఉండదు. రాజకీయ అధికారం కోసం కాదు చివరకు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా ఎవరిదారి వాటిదేఅన్నట్లుగా ఉంది. అందుకనే ఏ విషయంలో కూడా కేంద్రం ఏపిని పట్టించుకోవటంలేదు.

ఇందుకు తాజా ఉదాహరణ ఏమిటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. స్టీల్ ప్లాంట్ పై పూర్తి అధికారం కేంద్రానిదే అన్న విషయం అందరికీ తెలిసిందే. తన ప్లాంటును తాను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది మోడి సర్కార్. వెంటనే కేంద్రం నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి చేతకానితనమే అని టీడీపీ మొదలుపెట్టేసింది. కేంద్రంతో జగన్ కుమ్మక్కై స్టీల్ ప్లాంటును సొంతం చేసుకోవాలని కుట్రలు పన్నుతున్నారంటు బురద చల్లేస్తోంది. టీడీపీ ఆరోపణలకు మిగిలిన ప్రతిపక్షాలు వంతపాడేస్తున్నాయి.

ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ఏ విషయంలో అయినా మోడి నిర్ణయం తీసుకుంటే ఎంత మొండిగా ఉంటారో చంద్రబాబునాయుడుకు బాగా తెలుసు. ప్రత్యేకహోదా, పోలవరం లాంటి అనేక అంశాల్లో మోడి పట్టుదలేంటో చంద్రబాబు దగ్గరుండి చూశారు. అలాంటి చంద్రబాబు కూడా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు జగన్ కు ముడిపెట్టేసి కావాలనే బురద చల్లుతున్నారు. అందుకనే అధికార వైసీపీ కూడా టీడీపీ, ప్రతిపక్షాలపైకి దాడులు చేస్తోంది.

ఏ విషయంలో తీసుకున్నా వైసీపీ, ప్రతిపక్షాల మధ్య వ్యవహరం ఉప్పు-నిప్పులాగ తయారైంది. ఇపుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా రాజకీయపార్టీల్లో ఐకమత్యం కనబడటంలేదు. ఆగష్టు 2,3 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కార్మిక సంఘాలు ఆందోళన చేయాలని డిసైడ్ చేశాయి. ఈ ఆందోళనల్లో కూడా అధికార, ప్రతిపక్షాలు కలవటంలేదు. ఎందుకంటే కార్మికసంఘాలు నిర్వహించిన సమావేశానికి వైసీపీ నేతలు హాజరైన కారణంగా టీడీపీ నేతలెవరు కనబడలేదు.

రాజకీయపార్టీల మధ్య ఇంత అనైక్యతుంటే ఇక కేంద్రం మాత్రం ఎందుకని ఏపి ప్రయోజనాల గురించి ఆలోచిస్తుంది. రాష్ట్రప్రయోజనాల విషయంలో పార్టీలన్నీ ఏ విధంగా ఏకమైపోతాయనే విషయంలో తమిళనాడును చూసి కూడా మన రాజకీయ నేతలు గ్రహించటంలేదు. అందుకనే విభజన చట్టాన్ని కూడా మోడి యధేచ్చగా ఉల్లంఘిస్తుంటే అడిగే నాదుడే లేకుండా పోయారు. మరి వైజాగ్ స్టీల్ కార్మికుల ఆందోళనలో ఏ పార్టీలు పాల్గొంటాయో చూడాల్సిందే.