Begin typing your search above and press return to search.

కన్నబాబుపై పవన్ కల్యాణ్ కోపానికి కారణం అదేనా?

By:  Tupaki Desk   |   7 Nov 2019 1:30 AM GMT
కన్నబాబుపై పవన్ కల్యాణ్ కోపానికి కారణం అదేనా?
X
ఏపీ మంత్రి కురసాల కన్నబాబుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో మండిపడుతున్నారు. తరచూ ఆయన్ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకప్పుడు తన సోదరుడు చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం పార్టీలో పవన్‌తో పటు కన్నబాబు కలిసి తిరిగారు. చిరంజీవికి, పవన్‌కు కూడా ఆయన సన్నిహితంగా మెలిగారు. అయితే.. ఇప్పుడు పవన్ ఇంతగా ఆయన్ను టార్గెట్ చేయడానికి కారణమేంటి.. ఇద్దరి మధ్య ఎక్కడ చెడిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ఎన్నికల సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రచార సమయంలో కన్నబాబుపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ అనంతరం కూడా పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. తాజాగా విశాఖలో జనసేన లాంగ్ మార్చ్ సమయంలోనూ కన్నబాబు రాజకీయ జీవితం తమతోనే ప్రారంభమైందని గుర్తు చేస్తూ దెప్పిపొడిచినట్లుగా మాట్లాడారు. జగన్ కంటే, తనను నిత్యం విమర్శించే నాయకుల కంటే ఎక్కువగా కన్నబాబును పవన్ టార్గెట్ చేయడానికి కారణంపై రాజకీయవర్గాల్లో అనేక వాదనలు వినిపిస్తున్నాయి.

‘‘మీ బతుకులు తెలియవా మీరెక్కడ నుంచి వచ్చారో తెలియదా’' అంటూ మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాసులను ఉద్దేశించి పవన్ అనడం తెలిసిందే. వైసీపీ నాయకుడిగా మాట్లాడే కన్నబాబును తాము రాజకీయాల్లోకి తీసుకొచ్చామని.. ఇంకా చెప్పాలంటే తన అన్న నాగబాబు కన్నబాబును రాజకీయాల్లోకి తెచ్చారని పవన్ గుర్తుచేశారు. ‘వైజాగ్ నుంచి మంత్రి అయి ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారా ’ అంటూ అవంతి శ్రీనివాస్ పైనా పవన్ విమర్శలు చేశారు.

చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన కన్నబాబు.. ప్రజారాజ్యాన్ని చిరంజీవి కాంగ్రెస్‌లోవిలీనం చేసేలా తప్పుడు గైడెన్స్ ఇచ్చారని పవన్ బలంగా నమ్ముతున్నారట. అన్న చిరంజీవి తన మాట వినకుండా కన్నబాబు మాట విని పార్టీని కాంగ్రెస్‌లో కలిపారని.. ఆ పార్టీయే ఉంటే ఈ సరికి తమ కుటుంబానికి సీఎం పదవి దక్కేదని పవన్ తన సన్నిహితుల వద్ద అంటుంటారట.
మరోవైపు కన్నబాబు కూడా పలు సందర్భాల్లో చిరంజీవి లేకపోతే పవన్ పరిస్థితేమిటని.. ఆయన హీరో అయ్యేవాడా.. పార్టీ పెట్టేవాడా.. ఈ జనం వచ్చేవారా అని అన్నారని.. ఇవన్నీ మనసులో పెట్టుకుని పవన్ సందు దొరికినప్పుడంతా కన్నబాబుపై మండిపడుతున్నారని చెబుతున్నారు.