Begin typing your search above and press return to search.

తెలంగాణ 24అక్రమ ప్రాజెక్టులు కడుతోందా? ఏపీ వాదన ఇదేనట

By:  Tupaki Desk   |   7 July 2021 7:41 AM GMT
తెలంగాణ 24అక్రమ ప్రాజెక్టులు కడుతోందా? ఏపీ వాదన ఇదేనట
X
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న జల వివాదానికి సంబంధించి ఏపీ మీద తెలంగాణ.. ఆ రాష్ట్రం మీద ఏపీ సర్కారు ఆరోపణల మీద ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏపీ సర్కారు అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును షురూ చేసినట్లు ఆరోపించటం తెలిసిందే. ఈ ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇదిలా ఉంటే.. తెలంగాణ మీద ఘాటు ఆరోపణలు చేసింది ఏపీ ప్రభుత్వం. తాము నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టు అక్రమమైతే.. తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 24 అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తుందంటూ కేంద్రానికి కొత్త కంప్లైంట్ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 24 ప్రాజెక్టుల్లో 15 మద్య.. భారీ తరహా ప్రాజెక్టు అని.. తొమ్మిది చిన్న తరహా ప్రాజెక్టులు అంటూ ఏపీ ప్రభుత్వం చెబుతోంది. విభజన చట్టాన్ని పక్కన పెట్టేశారని.. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోకుండా.. అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుల వివరాల్ని వెల్లడించారు. వీటిల్లో ఆరింటిని ఇప్పటికే పూర్తి చేశారని.. మరో రెండు ప్రాజెక్టుల పనులను యమా స్పీడ్ గా చేస్తున్నారన్నారు.

మిగిలిన ఏడు ప్రాజెక్టులు సర్వే దశలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేయాలని చెబుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఇంకో తొమ్మిది ప్రాజెక్టులను త్వరలోనే చేపట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ చేపట్టినట్లు చెబుతున్న అక్రమ ప్రాజెక్టులకు సంబంధించి వివరాల్ని వెల్లడించారు ఏపీ ఈఎన్ సీ సి. నారాయణరెడ్డి. ఆయన చెప్పిన వాటి వివరాల్ని చూస్తే.. ఆ 24 అక్రమ ప్రాజెక్టులను చూపిస్తున్నారు.

ఇంతకీ అవేమంటే..

1. పాలమూరు- రంగారెడ్డి
2. డిండి
3. భక్త రామదాసు
4. మిషన్ భగీరథ
5. నెట్టెంపాడు సామర్థ్యం పెంపు
6. కల్వకుంట్ల సామర్థ్యం పెంపు
7. తుమ్మిళ్ల ఎత్తిపోతల
8. ఎస్సెల్సీసీ సామర్థ్యం పెంపు
9. జోగులాంబ బ్యారేజీ
10. బీమా వరద కాలువ
11. సంకేసుల బ్యారేజీ నుంచి ఎత్తిపోతల
12. కల్వకుర్తి లో అంతర్భాగంగా ఉండే రిజర్వాయిర్
13. పులిచింత ప్రాజెక్టులో ఎత్తిపోతల
14. సాగర్ టెయిల్ పాండ్ ఎత్తిపోతల
15. జూరాల - పాకాల వరద కాలువ
16. బుగ్గమందారం ఎత్తిపోతల
17. ఆమరావరం ఎత్తిపోతల
18. రేవూరు ఎత్తిపోతల
19. చింతలపాళెం ఎత్తిపోతల
20. ఎర్రగట్టుతాండ ఎత్తిపోతల
21. చొటపల్లి ఎత్తిపోతల
22. నువ్యవహాడ్ ఎత్తిపోతల
23. గట్టు ఎత్తిపోతల
24. కోయిల్ సాగర్

కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్ పురేకు ఏపీ ప్రభుత్వం రాసిన లేఖలో కీలక అంశాలివే

- విభజన చట్టం ప్రకారం కృష్ణా బేసిన్‌లో ఇరు రాష్ట్రాలు కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా.. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ ను కృష్ణా బోర్డు, కేంద్ర జలసంఘంకు పంపాలి. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చాక.. వాటిని అపెక్స్‌ కౌన్సిల్‌ ముందు పెట్టాలని వివరించారు. ఇందుకు విరుద్ధంగా తెలంగాణ అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదించకుండానే.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా 24 ప్రాజెక్టులు చేపట్టింది.

- కృష్ణా నదీ జలాలను చిన్న నీటివనరుల విభాగంలో కేటాయింపుల కంటే అదనంగా 86.39 టీఎంసీలను అక్రమంగా వాడుకుంటున్న తెలంగాణ సర్కార్‌పై చర్యలు తీసుకోవాలి.

- 2014 నుంచి 2021 మధ్య కృష్ణా బేసిన్‌లో 16,163 చెరువులను పునరుద్ధరించడం తోపాటు కొత్తగా 24 చెరువులు, చెక్‌ డ్యామ్‌లు నిర్మించి తద్వారా చిన్న నీటివనరుల విభాగంలో 10,77,034 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే పనులను రూ.6,243 కోట్లతో చేపట్టింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ సర్కార్‌ 474 జీవోను జారీ చేసింది. ఈ ఆయకట్టుకు నీళ్లందించడానికి 175.54 టీఎంసీలను తెలంగాణ వాడుకుంటోంది.

- కేటాయించిన నీటి కంటే అదనంగా 86.39 టీఎంసీలను తెలంగాణ అక్రమంగా వాడుకుంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోంది. వెంటనే చర్యలు తీసుకోవాలి.